(నమస్తే తెలంగాణ) రంగారెడ్డి, డిసెంబర్ 25 ; ప్రభుత్వానికి అత్యధిక ఆదాయం తీసుకొచ్చే సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాలు సమస్యలతో సహవాసం చేస్తున్నాయి. ఆదాయంలో ప్రథమ స్థా నంలో ఉండగా.. వసతుల కల్పనలో మాత్రం అధమస్థానంలో ఉన్నాయి. జిల్లాలో 18 సబ్‌రిజిస్ట్రేషన్ కార్యాలయాలుండగా ఏండ్ల తరబడిగా వాటికి సొంత భవనాల్లేక.. అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. ఈ ఆఫీసుల్లో కూర్చునేందుకు బెంచీలు, కుర్చీలు లేక, తాగేందుకు నీరు, మూత్రశాలల్లేక ఇక్కడికి ప్రతిరోజూ వివిధ పనుల నిమిత్తం వచ్చే ప్రజలు తీవ్ర ఇబ్బం దులకు గురవుతున్నారు. జిల్లాలో ఎక్కడా లేని విధంగా 18 సబ్‌రిజిస్ట్రేషన్ కార్యాలయాలుండగా వాటి ద్వారా ప్రభుత్వానికి ప్రతి నెలా దాదాపుగా రూ. 300 కోట్ల వరకు ఆదాయం సమకూరుతున్నట్లు సమాచారం.
చాలీచాలని వసతులతో..
జిల్లాలోని సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు పక్కా భవనాలు లేకపోవడంతో అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. ఇబ్రహీంపట్నంలో గత 30 ఏండ్లుగా సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయం అద్దె భవనంలోనే ఉన్నది. అలాగే, షాద్‌నగర్‌లో ఒకే అద్దె భవనంలో షాద్‌నగర్, ఫరూఖ్నగర్లకు చెందిన సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాలు కొనసాగుతున్నాయి. అబ్దుల్లాపూర్‌మెట్, పెద్దఅంబర్‌పేట, హయత్‌నగర్, సరూర్‌నగర్, రాజేంద్రనగర్, మహేశ్వరం, శేరిలింగంపల్లి, చేవెళ్ల వంటి సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాలు కూడా కొన్నేండ్లుగా అద్దె భవనాల్లోనే ఉన్నాయి. వాటికి పక్కా భవనాలు నిర్మించాలని ప్రజలు కోరుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదనే విమర్శలు న్నాయి. జిల్లాలోని సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాలన్నీ చాలీచాలని వసతులతో అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. కాగా సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు పక్కా భవనాల కోసం గత ప్రభుత్వం రూ. కోటి నిధులు కేటాయించింది. ఇబ్రహీంపట్నంలో భవన నిర్మాణ పనులను ప్రారంభించినా ప్రభుత్వం మారడంతో ఆ పనులు మధ్యలోనే నిలిచిపోయాయి. ఈ భవన నిర్మాణం కోసం మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ఎంతో కృషి చేశారు. ప్రభుత్వం స్పందించి సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు పక్కా భవనాలను నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు.
ప్రతినెలా రూ.300 కోట్ల వరకు ఆదాయం..
జిల్లాలో 18 సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాలున్నాయి. అవి.. ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, పెద్దఅంబర్‌పేట, అబ్దుల్లాపూర్‌మెట్, సరూర్‌నగర్, హయత్‌నగర్, చంపాపేట, శేరిలింగంపల్లి, గండిపేట, రాజేంద్రనగర్, శంషాబాద్, శంకర్పల్లి, చేవెళ్ల, ఫరూఖ్‌నగర్ వంటి ప్రాంతాల నుంచి ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్ల ద్వారా ప్రతినెలా రూ.300 కోట్ల వరకు ఆదా యం సమకూరుతున్నది. కానీ, ఈ కార్యాలయాలకు వచ్చే వారికి కూ ర్చునేందుకు కూడా వసతుల్లేక.. తాగేందుకు నీళ్లు లేక తీవ్ర అవస్థలు పడుతున్నారు.