షాబాద్, ఆగస్టు 20 : ఆరుగాలం కష్టపడి పంటలు పండించే రైతన్న ప్రమాదవశాత్తు ఏ కారణం చేతనైనా మృతి చెందిదే ఆ కుటుంబం వీధిన పడొద్దనే సదుద్దేశంతో గత కేసీఆర్ ప్రభుత్వం రైతుబీమా పథకానికి శ్రీకారం చుట్టింది. ప్రతి ఏడాది రైతుల పేరిట ప్రభుత్వమే బీమా కోసం రూ. 3,556 ప్రీమియం చెల్లించింది. రైతు చనిపోతే వారం, పది రోజుల్లో నామినీ ఖాతా ల్లో రూ.5 లక్షల బీమా డబ్బులు జమ అయ్యేవి. కాగా, 33 నెలల కిందట అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ గతేడాది ప్రీమియం డబ్బులు సకాలంలో చెల్లించకపోవడంతో రైతు కుటుంబాలకు అందాల్సిన బీమా సకాలంలో అందలేదు. ఈ ఏడాది ఆగస్టు 15తో బీమా గడువు ముగిసింది. బీమా రెన్యువల్ చేయకపోవడంతో ప్రమాదవశాత్తు ఎవరైన రైతులు మృతిచెందితే డబ్బులు అందే పరిస్థితి లేదు. రంగారెడ్డి జిల్లాలో బీమా రెన్యువల్‌పై తమకు ఎలాంటి ఆదేశాలు రాలేవని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు.
రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల, షాద్‌నగర్, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, రాజేంద్రనగర్, ఆమనగల్లు, శేరిలింగంపల్లి నియోజకవర్గాల పరిధిలోని 21 మండలాల్లో 1,71,763 మంది రైతులను బీమాకు అర్హులుగా గుర్తించినట్టు వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. 2025-2026లో జిల్లాలో పలు కారణాలతో 927 మంది మృతిచెందగా, అందులో ఇప్పటివరకు 777 మంది రైతుల కుటుంబాలకే బీమా డబ్బులు అందగా.. మిగిలిన 150 మంది రైతు కుటుంబాలు బీమా డబ్బుల కోసం ఎదురుచూస్తున్నారు.
కేసీఆర్‌ను గుర్తు చేసుకుంటున్న రైతులు
గత బీఆర్ఎస్ హయాంలో పదేండ్లపాటు కేసీఆర్ రైతుల అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. పంటలకు పెట్టుబడి సాయాన్ని అదునుకు అందించడంతోపాటు రైతు చనిపోతే వారం రోజుల్లోనే బీమా డబ్బులు బాధిత ఫ్యామిలీ బ్యాంకు ఖాతాలో జమ అయ్యేలా చర్యలు తీసుకున్నారు. రైతు ప్రమాదవశాత్తు మరణిస్తే ఆ కుటుంబం వీధిన పడొద్దనే 15-08-2018న రైతు బీమా పథకానికి శ్రీకారం చుట్టారు. అప్పటి నుంచి 2023 ఆగస్టు 15వరకు ప్రతి ఏడాది రైతు పేరిట ఆగస్టు 15వ తేదీ లోపు రూ. 3,556 ప్రీమియం డబ్బులు చెల్లించి ఆ బీమాను రెన్యువల్ చేయించారు.
బీమా రైతులకెంతో ఉపయోగం
అన్నదాత సంక్షేమమే ధ్యేయంగా గత కేసీఆర్ ప్రభుత్వం రైతుబీమాను తీసుకొచ్చింది. రైతు ఏ కారణం చేతనైనా చనిపోతే ఆ కుటుంబం విధినపడకుండా రైతుబీమా ద్వారా రూ.5 లక్షలు అందించి ఆదుకుంది. బీఆర్ఎస్ హయాంలో సజావుగా సాగిన ఈ పథకం, కాంగ్రెస్ వచ్చిన తర్వాత పట్టించుకోవడంలేదు. ప్రభుత్వం ఈ పథకాన్ని కావాలనే నిర్లక్ష్యం చేస్తున్నది. ప్రభుత్వం పునరాలోచించి రెన్యువల్ చేయాలి.
– మధుసూదన్‌రెడ్డి, రైతుబంధు సమితి మాజీ అధ్యక్షుడు, షాబాద్
బీమా రెన్యువల్‌పై ఎలాంటి ఆదేశాలు రాలేదు
రైతుబీమా రెన్యువల్‌పై ప్రభుత్వం నుంచి మాకు ఎలాంటి ఆదేశాలు రాలేవు. 2025-2026 లో జిల్లాలో పలు కారణాలతో 927 మంది రైతులు మృతిచెందగా, అందులో ఇప్పటికే 777 మందికి రూ.5లక్షల చొప్పున బీమా డబ్బులు అందించాం. మిగతా 150 మంది రైతు కుటుంబాలకూ త్వరలోనే బీమా డబ్బులు అందించేలా చర్యలు చేపట్టాం. ఆగస్టు 15తో బీమా గడువు ముగిసింది. బీమా రెన్యువల్‌పై ప్రభుత్వం నుంచి ఏమైనా ఆదేశాలు వస్తే రైతులకు తెలియజేస్తాం.
– సుజాత, రంగారెడ్డి జిల్లా ఏఓ
రైతులను నిండా మోసం చేస్తున్న కాంగ్రెస్
కాంగ్రెస్ పార్టీ రైతులను మోసం చేస్తున్నది. రైతుబీమా పథకాన్ని కావాలనే నిర్లక్ష్యం చేస్తున్నది. గడువు ముగిసినా ఇంకా ఆ పథకానికి ప్రీమియం డబ్బులు చెల్లించకపోవడం దారుణం. రైతుబీమాను ఎందుకు రెన్యువల్ చేయడం లేదో ప్రభుత్వం సమాధానం చెప్పాలి. రైతులను ఇబ్బందులు పెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి రానున్న రోజుల్లో తగిన గుణపాఠం తప్పదు.
– గంగిడి భూపాల్‌రెడ్డి, బీఆర్ఎస్ నేత, షాబాద్
రైతుల కోసం కేసీఆర్ బీమా చేసిండు
రైతుల కోసం, రైతు బిడ్డగా మాజీ సీఎం కేసీఆర్ రైతు బీమా తీసుకొచ్చాడు. దేశంలో ఎక్కడాలేని విధంగా తెలంగాణలో రైతు చనిపోతే రూ.5 లక్షల బీమా ఇచ్చి బాధిత కుటుంబాలను అందుకు న్నారు. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినంకా రైతులను అన్ని విధాలా ఇబ్బందిపెడుతున్నది. ఆగస్టు 15 దాటినా ఇంకా రైతుబీమాను రెన్యువల్ చేయకపోవడం సరికాదు. ప్రభుత్వం వెంటనే రైతుబీమాను రెన్యువల్ చేసి, ఆ పథకాన్ని కొనసాగించాలి.
– కుమార్, రైతు కుమ్మరిగూడ, షాబాద్