రంగారెడ్డి, జూన్ 12(నమస్తే తెలంగాణ) ; గతేడాది స్వయం సహాయక మహిళా సంఘాలకు లక్ష్యానికి మించి రుణాలు అందజేసిన జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ 2024-25 ఆర్థిక సంవత్సరంలోనూ భారీ ఎత్తున రుణాలు అందజేయనున్నది. ఈ మేరకు 15,570 మహిళా సంఘాలకు రూ.850.39కోట్ల బ్యాంకు లింకేజీ రుణాలను అందజేయాలని లక్ష్యంగా పెట్టుకున్నది. గతేడాదితో పోలిస్తే రుణ లక్ష్యం దాదాపు రూ.60కోట్ల వరకు పెరిగింది. ఈసారి అత్యధికంగా మొయినాబాద్ మండలానికి రూ.6,083.39 లక్షలను, అత్యల్పంగా ఆమనగల్లు మండలానికి రూ.1,594.55లక్షలను రుణాలుగా ఇచ్చేలా లక్ష్యాన్ని నిర్దేశించారు. ఇప్పటికే సంబంధిత అధికారులు రుణాల పంపిణీకి సంబంధించి కసరత్తును మొదలుపెట్టారు.
మహిళా స్వయం సహాయక సంఘాల అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం ఏటా బ్యాంకు లింకేజీ, స్త్రీనిధి పథకాల ద్వారా రుణాలను అందజేస్తున్నది. మార్చి 30 నాటికి ఆర్థిక సంవత్సరం ముగియడంతో 2024-25కు గాను ప్రభుత్వం బ్యాంకు లింకేజీ రుణ లక్ష్యాన్ని నిర్దేశిస్తూ గ్రామీణాభివృద్ధ్ది శాఖ అధికారులకు ఆదేశాలిచ్చింది. గత ఏడాది జిల్లా వ్యాప్తంగా ఉన్న మహిళా సంఘాలకు పూర్తిస్థాయిలో రుణాలు ఇవ్వడంతో వందశాతానికి పైగానే రుణాలు అందించారు. ఇదే ఉత్సాహంతో ఈ ఏడాదిలోనూ వందశాతం రుణాలిచ్చేలా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. పెరుగుతున్న సంఘాలకు అనుగుణంగా గ్రామీణాభివృద్ధి శాఖ ప్రతి ఏటా రుణ లక్ష్యాన్ని పెంచుకుంటూ వస్తున్నది. గతేడాది 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.708.79 కోట్లు రుణాలుగా అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే అంతకుమించి రూ.790.46 కోట్ల రుణాలను అందించారు. గతేడాదితో పోలిస్తే రూ.60 కోట్లు అదనంగా ఈ ఏడాది రూ.850.39 కోట్ల బ్యాంకు లింకేజీ రుణాలను అందజేయనున్నారు.
స్వయం సమృద్ధి దిశగా సంఘాలు..
ప్రభుత్వం అందిస్తున్న రుణాలతో జిల్లాలోని మహిళా సంఘాలు స్వయం సమృద్ధి దిశగా ముందుకు సాగుతున్నాయి. సభ్యుల ఆర్థిక అవసరాల మేరకు వ్యవసాయ, అనుబంధ రంగాలు, కిరాణ దుకాణాలు, పిండిగిర్నీ, టైలరింగ్, బ్యూటీ పార్లర్, ఫుట్వేర్ తదితర వ్యాపారాలకు రుణాలను అందిస్తున్నారు. కొత్తగా ఏర్పాటైన సంఘాలు ఆరు నెలలు క్రమం తప్పకుండా పొదుపు చేస్తే వారికి కూడా విరివిగా రుణాలను అందజేస్తున్నారు. గతంలో బ్యాంకు లింకేజీ కింద రూ.లక్ష రుణం ఇచ్చేవారు. అయితే గత రెండేండ్ల నుంచి దాన్ని రూ.2లక్షలకు పెంచారు. గతేడాది రుణ ప్రగతిలో జిల్లా ప్రత్యేక గుర్తింపును పొందడంతో అదే ఉత్సాహంతో ఈసారి కూడా రుణాలు అందజేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.
ఈ ఏడాదీ లక్ష్యాన్ని అధిగమిస్తాం : శ్రీలత, డీఆర్డీవో, రంగారెడ్డి జిల్లా
గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది బ్యాంకు లింకేజీ వార్షిక రుణ లక్ష్యం పెరిగింది. ఏటా ప్రభుత్వం నిర్దేశిస్తున్న లక్ష్యాన్ని అధిగమించేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తున్నాం. ఈ ఏడాది నిర్దేశించుకున్న రూ.850.39 కోట్ల రుణ లక్ష్యాన్ని కూడా అధిగమిస్తాం. కలెక్టర్ ఆదేశాలు, సూచనలకు అనుగుణంగా మండలాల వారీగా సమీక్షలు నిర్వహించి అర్హులైన వారందరికీ రుణాలను అందించి వారి ఆర్థిక అభివృద్ధికి తోడ్పాటును అందిస్తాం.