జిల్లాలోని పత్తి రైతులు ఆందోళనకు గురవుతున్నారు. పత్తి విక్రయించే సమయంలో ఏదో ఒక కొర్రీ పెట్టి రైతులను ఇబ్బందులు పెట్టిన సీసీఐ(కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) పత్తిని విక్రయించిన రైతులకు డబ్బులు చెల్లించడంలోనూ తీవ్ర జాప్యం చేస్తున్నది. ఐదారు రోజుల్లోగా పత్తిని విక్రయించిన రైతులకు చెల్లింపులు పూర్తి చేస్తామంటూ సీసీఐ అధికారులు చెబుతున్నప్పటికీ.. నెలరోజులైనా డబ్బులు చేతికందకపోవడంతో కష్టాలు పడుతున్నారు. డబ్బుల కోసం ఎదురుచూడాల్సి వస్తున్నది.
వికారాబాద్, ఫిబ్రవరి 5, (నమస్తే తెలంగాణ) : పత్తిని సేకరించిన అనంతరం వెంటనే బిల్లులు చేయాల్సిన సీసీఐ కొనుగోలు కేంద్రాల సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో రైతులకు చెల్లింపులు జమ కావడంలో తీవ్ర జాప్యం జరుగుతున్నట్లు మార్కెటింగ్ అధికారులు చెబుతున్నారు. కొందరు రైతుల బ్యాంకు ఖాతాలకు ఆధార్ లింక్ కాకపోవడం, ఆధార్ మ్యాపింగ్ లేకపోవడం.. తదితర కారణాలతో చెల్లింపుల్లో జాప్యం జరుగుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. మరోవైపు జిల్లాలో ఇప్పటి వరకు రూ.543 కోట్ల విలువైన పత్తిని సేకరించగా, రూ.496 కోట్ల చెల్లింపులను రైతుల బ్యాంకు ఖాతాల్లో సీసీఐ జమ చేసింది. మరో రూ.47 కోట్ల చెల్లింపులు పెండింగ్‌లో ఉండడం గమనార్హం. ఈ నెల 3 వరకు పత్తిని విక్రయించిన 33,571 మంది రైతులకుగాను 29,966 మంది రైతులకు రూ.496 కోట్ల చెల్లింపులను పూర్తి చేశారు. పత్తి కొనుగోలు కేంద్రాలు కూడా మరో వారం రోజుల్లో మూసివేసేందుకు సీసీఐ అధికారులు కసరత్తు చేస్తున్నారు. జిల్లాలోని అన్ని కొనుగోలు కేంద్రాల్లో ప్రస్తుతం కేవలం 10 శాతం మేర పత్తి మాత్రమే వచ్చింది. సీసీఐ మాత్రం కొనుగోలు కేంద్రాలను మూసి వేసేందుకు చర్యలు చేపట్టింది.
అంచనాలకు మించి పత్తి సేకరణ..
జిల్లావ్యాప్తంగా 14 పత్తి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. తాండూరులో మారుతి, శుభం, బాలాజీ కొనుగోలు కేంద్రాలు, కోట్‌పల్లిలో సాయిబాబా కాటన్ అగ్రో ఇండస్ట్రీస్, పరిగిలో లక్ష్మీ వేంకటేశ్వర, నరసింహ, రాకంచర్ల కాటన్‌మిల్, వికారాబాద్‌లో ధరణి, సాయిబాబా, అయ్యప్ప జిన్నింగ్ మిల్లులో, మర్పల్లిలో శ్రీఅయ్యప్ప కాటన్ ట్రేడర్స్, కొడంగల్‌లో విజయ్ ఇండస్ట్రీస్ జిన్నింగ్ మిల్లుల్లో సీసీఐ కేంద్రాలతోపాటు ప్రైవేట్ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. గతేడాది 2.50 క్వింటాళ్ల పత్తిని కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించారు. ఈ ఏడాది 2.80 లక్షల క్వింటాళ్ల పత్తిని సేకరించాలని లక్ష్యంగా పెట్టుకోగా, జిల్లా మార్కెటింగ్ అధికారుల అంచనాలకు మించి సీసీఐ పత్తిని కొనుగోలు చేసింది.
ఇప్పటివరకు 7,83,700 క్వింటాళ్ల(78,370 మెట్రిక్ టన్నులు) పత్తిని 33,571 మంది రైతుల నుంచి కొనుగోలు చేశారు. జిల్లా మార్కెటింగ్ అధికారుల అంచనాలకు మించి 5 లక్షల క్వింటాళ్ల మేర పత్తిని సీసీఐ కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించడం గమనార్హం. అత్యధికంగా పరిగి నియోజకవర్గంలోని నరసింహ కాటన్ మిల్లులో ఏర్పాటు చేసిన సీసీఐ కొనుగోలు కేంద్రానికి 8869 మెట్రిక్ టన్నుల పత్తి వచ్చింది. మండలాల వారీగా పరిశీలిస్తే వికారాబాద్‌లోని కొనుగోలు కేంద్రాల ద్వారా 21,709 మెట్రిక్ టన్నుల పత్తిని కొనుగోలు చేశారు. తాండూరులో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల ద్వారా 8700 మెట్రిక్ టన్నుల పత్తిని కొనుగోలు చేయగా, కొడంగల్‌లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రం ద్వారా 2846 మెట్రిక్ టన్నులు, కోట్‌పల్లిలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల ద్వారా 7820 మెట్రిక్ టన్నులు, ధారూరులోని కొనుగోలు కేంద్రం ద్వారా 6805 మెట్రిక్ టన్నుల పత్తి, మర్పల్లి కొనుగోలు కేంద్రం ద్వారా 6565 మెట్రిక్ టన్నుల పత్తిని రైతుల నుంచి సేకరించారు.
త్వరగా చెల్లింపులు అయ్యేలా చర్యలు…; జిల్లా మార్కెటింగ్ అధికారి సారంగపాణి
పత్తిని విక్రయించిన రైతులకు త్వరగా చెల్లింపులు పూర్తి అయ్యేలా సీసీఐ అధికారులకు సూచిస్తామని జిల్లా మార్కెటింగ్ అధికారి సారంగపాణి తెలిపారు. బిల్లులు, ఆధార్ మ్యాపింగ్ లేకపోవడం బ్యాంకు లింకేజీ సమస్యలతో చెల్లింపుల్లో జాప్యం జరుగుతున్నట్లు వెల్లడించారు. వెనక్కి వస్తున్న బిల్లులకు మళ్లీ బిల్లులు చేసి సీసీఐకి పంపిస్తున్నామని తెలిపారు.