షాబాద్, జూలై 11 : ప్రభుత్వ పాఠశాలలను మన ఊరు-మనబడి కార్యక్రమం ద్వారా కార్పొరేట్‌కు దీటుగా సకల సౌకర్యాలతో తీర్చిదిద్దుతున్న తెలంగాణ ప్రభుత్వం తాజాగా పాఠశాలల సమగ్ర సమాచారాన్ని పక్కాగా నమోదు చేసేందుకు చర్యలు చేపట్టింది. ఈమేరకు రంగారెడ్డిజిల్లాలోని 945 ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలకు 1058 ట్యాబ్‌లను ప్రభుత్వం అందజేసింది. ఇన్ని రోజులు సీఆర్పీలు, ఉపాధ్యాయులు పాఠశాలల్లోని సకల వివరాలను తమ స్మార్ట్ ఫోన్లోని యాప్ ద్వారా నమోదు చేస్తుండగా, పలు సమస్యలు ఎదురయ్యేవి. వాటిన్నింటికీ చెక్‌పెడుతూ ట్యాబ్‌లు అందజేయడంతో విద్యార్థుల హాజరు, మధ్యాహ్న భోజనం వంటి అనేక విషయాల్లో పారదర్శకత అమలు కానుంది. ట్యాబ్‌లతో వివరాలు నమోదు, ఎప్పటికప్పుడూ తెలుసుకోవడం సులువు కావడంతో పాటుగా, ట్యాబ్‌ల ద్వారా ఐదో తరగతి వరకు పాఠాలు డిజిటల్ బోధనలో ఉపయోగపడనున్నాయి.
సమాచారం పారదర్శకం
రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా చేవెళ్ల, షాద్‌నగర్, ఇబ్రహీంపట్నం, ఆమనగల్లు, మహేశ్వరం, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి నియోజకవర్గాల పరిధిలోని 27 మండలాల్లో మొత్తం 945 ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలకు ప్రభుత్వం ట్యాబ్‌లు అందజేసింది. 10 మంది విద్యార్థులకంటే ఎక్కువగా ఉన్న పాఠశాలకు ఒక్క ట్యాబ్ అందజేయగా, 165 మంది విద్యార్థులకంటే ఎక్కువగా ఉన్న పాఠశాలలకు రెండు ట్యాబ్‌లు అందజేశారు. జిల్లావ్యాప్తంగా ప్రాథమిక పాఠశాలలు 881, ప్రాథమికోన్నత పాఠశాలలు 181తో కలిపి మొత్తం 1062 పాఠశాలలున్నాయి. ఇందులో 767 ప్రాథమిక పాఠశాలలకు, 178 ప్రాథమికోన్నత పాఠశాలలకు ప్రభుత్వం ట్యాబ్‌లు అందించింది. ఇందులో 113 పాఠశాలలకు రెండు చొప్పున ట్యాబ్‌లు అందించారు. తెలంగాణ ప్రభుత్వం సర్కారు బడుల్లో కార్పొరేట్‌కు దీటుగా సకల సౌకర్యాలను కల్పిస్తూ అభివృద్ధి చేస్తున్నది. మన ఊరు-మన బడి కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలలను ఇప్పటికే ఎంతో బాగా తీర్చిదిద్దుతున్నది. మరోవైపు పాఠశాలల సమగ్ర సమాచారాన్ని పక్కాగా నమోదు చేసేందుకు స్కూళ్లలో సాంకేతిక సౌకర్యాన్ని కల్పిస్తున్నది. ఈ మేరకు ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలకు ట్యాబ్‌లను అందించింది. పాఠశాలల సమగ్ర సమాచారాన్ని ట్యాబ్‌లో నమోదు చేయడం ద్వారా పారదర్శకత తీసుకురానుంది.
ట్యాబ్‌లతో బోధించే అవకాశం
పాఠశాలల్లో ప్రస్తుతం సీఆర్పీలు, ఉపాధ్యాయులు జిల్లాలోని మండల పరిషత్ ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల విద్యార్థుల ప్రగతి, విద్యార్థుల ప్రవేశాలు, టీసీల జారీ, మార్కుల వివరాల నమోదు, ఉపాధ్యాయుల సమాచారం, మన ఊరు-మన బడి పనుల పురోగతి, మధ్యాహ్న భోజనం చేసిన విద్యార్థుల వివరాలు, విద్యార్థులు-తల్లిదండ్రుల సమావేశాల నిర్వహణ, తొలిమెట్టు అమలు తదితర వివరాలను స్మార్ట్ ఫోన్లలో సంబంధిత యాప్ ద్వారా నమోదు చేస్తున్నారు. ఈ క్రమంలో వస్తున్న సమస్యలకు చెక్ పెడుతూ ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరం పాఠశాలలకు ట్యాబ్‌లు పంపిణీ చేసింది. పాఠశాల హెచ్ఎంలు రోజూ సమాచారాన్ని, ప్రగతి వివరాలను ట్యాబ్‌లో నమోదు చేసి మండలం, జిల్లా, రాష్ట్ర స్థాయికి పంపుతున్నారు. ప్రధానంగా తరగతి గదుల్లో చదువుతున్న విద్యార్థులు, ఉపాధ్యాయులను చాంబర్లో ముఖచిత్రం గుర్తింపు ఆధారంగా హాజరు నమోదు చేస్తున్నారు. దీంతో గైర్హాజరైన వారు హాజరైనట్లు వేసే అవకాశం ఉండదు. మధ్యాహ్న భోజనం వివరాలు కూడా పక్కాగా నమోదవుతున్నాయి. పాఠశాలలకు సంబంధించిన అన్ని కార్యక్రమాలు, ఫొటోలు ట్యాబ్‌లో వెనువెంటనే నమోదు చేస్తున్నారు. అదేవిధంగా ఒకటి నుంచి ఐదో తరగతి వరకు పాఠ్యాంశాలను ఇంటర్నెట్లో పొందుపరిచారు. ట్యాబ్‌లో ఇంటర్నెట్ ద్వారా విద్యార్థులకు పాఠాలు బోధించే అవకాశం కూడా ఉంది. డిజిటల్ బోధనకు కూడా ట్యాబ్‌లను వినియోగించుకోవచ్చు. ట్యాబ్‌ల పంపిణీతో ప్రధానోపాధ్యాయులకు పేపర్ వర్క్ తగ్గడంతో పాటు పాఠశాల సమగ్ర సమాచారం ట్యాబ్‌లలో నిక్షిప్తమై ఉండడంతో ఎప్పటికప్పుడూ చూసుకోవచ్చు.
జిల్లాలో 945 పాఠశాలలకు ట్యాబ్‌లు పంపిణీ
– సుశీందర్‌రావు, రంగారెడ్డిజిల్లా విద్యాశాఖ అధికారి
పాఠశాలలకు సంబంధించిన అన్ని వివరాలు ఎప్పటికప్పుడూ నమోదు చేసేందుకు ప్రభుత్వం ట్యాబ్‌లు అందజేసింది. జిల్లావ్యాప్తంగా 945 ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలకు 1058 ట్యాబ్‌లు అందించారు. ఇందులో 113 పాఠశాలలకు రెండు చొప్పున ట్యాబ్‌లు పంపిణీ చేశాం. ఇంతకు ముందు పాఠశాలలకు సంబంధించిన అన్ని వివరాలను సీఆర్పీలు, ఉపాధ్యాయులు స్మార్ట్ ఫోన్లలో నమోదు చేసేవారు. సమగ్ర వివరాల నమోదు పక్కాగా చేపట్టేందుకు ప్రభుత్వం ట్యాబ్‌లు అందజేసింది. విద్యార్థుల హాజరు, మధ్యాహ్న భోజనం వివరాలు, మన ఊరు-మన బడి పనుల పురోగతి తదితర వివరాలను ఎప్పటికప్పుడూ ట్యాబ్‌లో నమోదు చేస్తారు.