ఫోర్జరీ సంతకాలతో ఓ విలేజ్ బుక్ కీపర్ తన చేతివాటాన్ని ప్రదర్శించింది. గ్రూపులో ఉన్న సభ్యులకు సంబంధం లేకుండానే లక్షల రూపాయలను పక్కదోవ పట్టించింది. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం చౌదర్పల్లి గ్రామానికి చెందిన వరమ్మ అనే మహిళ గత కొంత కాలంగా ఐకేపీలో విలేజ్ బుక్ కీపర్‌గా పనిచేస్తున్నది. ఆమె కొంత మంది ఐకేపీ, బ్యాంకు సిబ్బందితో కుమ్మకై ఒకటి కాదు రెండు కాదు ఏకంగా సుమారు కోటిన్నరకు పైగా స్వాహా చేసినట్లు గ్రామానికి చెందిన డ్వాక్రా సంఘాల మహిళలు ఆరోపిస్తున్నారు. ఈ ఘటన యాచారం ఎస్బీఐ బ్యాంకులో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
– యాచారం, ఆగస్టు 12
దీనికి సంబంధించి స్థానికులు, డ్వాక్రా సంఘాల మహిళలు, పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. మండలంలోని చౌదర్పల్లి గ్రామంలో సుమారుగా 40 వరకు డ్వాక్రా సంఘాలకు చెందిన పొదుపు సంఘాలు ఉన్నాయి. వీరు గ్రూపుల వారీగా తక్కువ వడ్డీకి రుణాలు తీసుకొని ప్రతి నెలా పొదుపుతో పాటుగా తీసుకున్న వడ్డీకి రుణాలు చెల్లిస్తుంటారు.
ఇదంతా బాగానే ఉన్నా గ్రామానికి చెందిన బుక్‌కీపర్ వరమ్మది ఒక లెక్క, కొంతమంది పొదుపు సంఘాలకు సంబంధించిన డ్వాక్రా సంఘాల మహిళలు తాము తీసుకున్న రుణాలు పూర్తిగా చెల్లించినప్పటికీ వారికి బ్యాంకు నుంచి రుణాలు చెల్లించాలని నోటీసులు రావడంతో అట్టి మహిళలు ఒక్కసారిగా అవాక్కయ్యారు. కొంత మంది రుణాలు తీసుకోకుండానే తీసుకున్నట్లు, మరి కొంత మంది తాము రుణాలు మొత్తం వడ్డీతో సహా చెల్లించినప్పటికీ చెల్లించనట్టుగా నోటీసులు ఎలా వస్తాయని ఆశ్చర్యానికి గురయ్యారు.
దీంతో బ్యాంకు స్టేటస్‌ను తెలుసుకోవడానికి గ్రామానికి చెందిన గౌరి, తిరుమల, దుర్గాబాయి, సాయిరాం, హారతి, మల్లన్న, మణికంఠ, శ్రీనిధి డ్వాక్రా సంఘాల గ్రూపులకు చెందిన మహిళలు పెద్ద ఎత్తున మంగళవారం మండల కేంద్రంలోని ఎస్బీఐ బ్యాంకుకు తరలివెళ్లి ఆరా తీయగా, అక్కడ వరమ్మ అసలు బాగోతం బయటపడింది.
బ్యాంకు స్టేట్మెంట్లో అనేక నిజాలు వెలుగులోకి వచ్చాయి. గ్రూపు సభ్యులకు మంజూరైన రుణాలు అక్కరలేని వారి మహిళల స్థానంలో గుట్టు చప్పుడు కాకుండా వారి సంతకాలను ఫోర్జరీ చేసి ఆ రుణాలను తిరిగి తన అనుచరులకు, ఇతరులకు ఇప్పించినట్టు సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇందులో ఐకేపీ అధికారులు, బ్యాంకు సిబ్బంది సైతం కమీషన్లకు కక్కుర్తి పడుతున్నట్లు మహిళలు ఆరోపిస్తున్నారు.
గ్రామంలో ప్రతినెలా పొదుపు డబ్బులను సేకరించి సకాలంలో బ్యాంకులో డిపాజిట్ చేయకపోవడం, తన అవసరాలకు వాడుకోవడం చేసేదని గ్రామస్తులు గుర్తించారు. మొత్తంగా సుమారు కోటిన్నరకు పైగా అవినీతి జరిగినట్లు గుర్తించారు. అయితే దీనిపై నిర్ధారణ జరపాల్సి ఉంది. పూర్తి స్థాయిలో విచారణ చేస్తేనే మరిన్ని విషయాలు వెలుగులోకి రానున్నాయి. దీంతో బ్యాంకులో పెద్ద సంఖ్యలో గుమికూడిన మహిళలు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. బ్యాంకు సిబ్బందితో ఒక్కసారిగా వాగ్వాదానికి దిగారు.
అంతటితో ఆగక నాగార్జున సాగర్- హైదరాబాద్ ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. మహిళల ధర్నాకు స్థానికులు, పలు రాజకీయ పార్టీల నాయకులు మద్దతు తెలిపారు. మహిళల రాస్తారోకోతో రోడ్డుకు ఇరువైపులా కిలోమీటర్ మేర వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. అదే సమయంలో మండలంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించేందుకు అటునుంచి వెళ్తున్న ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి బ్యాంకును సందర్శించి మహిళలతో మాట్లాడారు.
బ్యాంకు మేనేజర్‌తో మాట్లాడి సమస్యను అడిగి తెలుసుకున్నారు. విలేజీ బుక్ కీపర్ నేరం అంగీకరించిందని, జరిగిన ఘటనకు సంబంధించి మహిళలు ఎమ్మెల్యేకు వివరించారు. మహిళల డబ్బులను పక్కదోవ పట్టించిన నిందితులను ఎవరినీ వదులొద్దని సీఐ నందీశ్వర్రెడ్డిని ఆదేశించారు. ఇటీవల కాలంలోనే మండలంలోని మల్కీజ్గూడకు చెందిన వీబీకే సైతం లక్షల రూపాయల అక్రమాలకు పాల్పడినట్లు స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు.
ఐకేపీలో పెద్ద మొత్తంలో అక్రమాలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపించారు. దీంతో మహిళలు శాంతించడంతో పోలీసులు ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. ఈ లావాదేవీలు గత మేనేజర్ ఝాన్సీరాణి ఉన్నప్పుడు జరిగాయని, దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించి అన్ని విషయాలు త్వరలోనే వెల్లడిస్తామని, అక్రమాలకు పాల్పడినవారిపై చర్యలు తీసుకుంటామని బ్యాంకు అధికారులు పేర్కొన్నారు.