అన్ని వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా సీఎం కేసీఆర్ సుపరిపాలనను సాగిస్తూ అసాధ్యాన్ని సైతం సుసాధ్యం చేస్తున్నారని విద్యాశాఖ మంత్రి పి.సబితారెడ్డి అన్నారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకల్లో భాగంగా శనివారం సుపరిపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఉమ్మడిజిల్లా వ్యాప్తంగా పలు గ్రామాల్లో ర్యాలీలు నిర్వహించారు. ముందుగా ఆయా నియోజకవర్గాల్లో జరిగిన సంబురాల్లో పాల్గొన్న ఎమ్మెల్యేలు అనంతరం కలెక్టరేట్లల్లో జరిగిన సమావేశానికి హాజరయ్యారు. రంగారెడ్డి కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి సబితారెడ్డి పాల్గొని ప్రసంగించారు. సీఎం కేసీఆర్ సుపరిపాలనలో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారన్నారు. సాహసోపేతమైన సంస్కరణలతో ప్రజలకు పాలనను చేరువ చేసి పల్లెలు, పట్టణాల స్వరూపాన్నే మార్చివేశారన్నారు. కొత్తగా జిల్లాలు, మండలాలు, గ్రామాలు ఏర్పాటు చేయడంతో ప్రగతి పరుగులు పెడుతుందన్నారు. చిన్న జిల్లాలు, మండలాలతో అధికారులపై పని ఒత్తిడి తగ్గడంతోపాటు ప్రజలకు పారదర్శకమైన సేవలు అందుతున్నాయన్నారు. శాంతిభద్రతల రక్షణ కోసం సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారన్నారు. వికారాబాద్ కలెక్టరేట్లో జరిగిన ఉత్సవాల్లో కలెక్టర్ నారాయణరెడ్డి, రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యుడు శుభప్రద్పటేల్పాల్గొని మాట్లాడారు.
రంగారెడ్డి, జూన్ 10 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో కొనసాగుతున్న పాలన స్వర్ణయుగంలా నడుస్తున్నదని విద్యా శాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి అన్నారు. దశాబ్ది వేడుకల్లో భాగంగా శనివారం సుపరిపాలన దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి పాల్గొని అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత చేపట్టిన సంస్కరణలు, సుపరిపాలన, ప్రజలకు అందుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను మననం చేసుకోవడానికి 21 రోజుల పాటు దశాబ్ది ఉత్సవాలను నిర్వహించుకుంటున్నామన్నారు.
సీఎం కేసీఆర్ పరిపాలనా స్వరూపాన్ని మార్చి వేశార్నరు. పరిపాలన ప్రజలకు మరింత చేరువ చేయడానికి ప్రభుత్వం అత్యంత సాహసోపేతమైన పరిపాలన సంస్కరణలు అమలు చేసిందన్నారు. ఏక కాలంలోనే పరిపాలన విభాగాల్లో పునర్విభజన చేపట్టినదని పేర్కొన్నారు. 2016 అక్టోబర్‌కు ముందు తెలంగాణలో 10 జిల్లాలో జిల్లా కేంద్ర కార్యాలయాలు ఉండేవని, అక్కడికి వెళ్లాలంటే 200 నుంచి 250 కిలో మీటర్ల దూరం ఉండేదని, దీంతో జిల్లా కేంద్రాల అధికారులు గ్రామాలకు వెళ్లాలన్నా, ప్రజలు జిల్లా కేంద్రాలకు రావాలన్నా పలు ఇబ్బందులు పడేవారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత జిల్లాలు పెరగడంతో పాలనా సౌలభ్యం పెరిగిందని, జిల్లాలో అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండడంతో పరిపాలనకు సులభమైనదని మంత్రి పేర్కొన్నారు.
ఎక్కడో విసిరేసినట్టుగా ఉన్న రంగారెడ్డి జిల్లా కార్యాలయాలు ఒకే చోటకు వచ్చేలా సమీకృత కలెక్టర్ కార్యాలయ సముదాయాన్ని నిర్మించి ప్రజలకు అందుబాటులోకి తెచ్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతున్నదని మంత్రి అన్నారు. వికేంద్రీకరణతో ప్రజల వద్దకు పాలన తీసుకొచ్చి నూతన జిల్లాలు, డివిజన్లు, మండలాలు, గ్రామ పంచాయతీలు, పోలీస్స్టేషన్లు, కమిషనరేట్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అధికార వికేంద్రీకరణతో అధికారుల మీద పని ఒత్తిడి తగ్గిందని, పారదర్శకత పెరిగిందని, పనులు సులువుగా అవుతున్నాయన్నారు. శాంతి భద్రతల పరిరక్షణకు పోలీస్ శాఖకు ఇన్నోవా వాహనాలు, నిధుల కేటాయింపు, షీ టీమ్‌లను ఏర్పాటు చేసి ఫ్రెండ్లీ పోలీస్ వాతావరణం కల్పించిందన్నారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి ద్వారా సౌకర్యాలు ఏర్పడ్డాయని, ప్రజలు గ్రామాల్లో ఉండేందుకు మొగ్గు చూపుతున్నారని, ఇదే తెలంగాణ సాధించిన ప్రగతికి గీటురాయి అని అన్నారు.
నాడు నిర్లక్ష్యానికి గురైన వ్యవసాయ శాఖ నేడు ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యతతో అన్ని రంగాల కన్నా ముందున్నదని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం అనువైన వాతావరణం కల్పించడంతో వెల్లువలా పెట్టుబడులు వస్తున్నాయన్నారు. సంక్షేమంలో తెలంగాణ దేశంలోనే నంబర్ వన్‌గా నిలుస్తున్నదన్నారు. రూ.3,116 ఉన్న దివ్యాంగుల పెన్షన్‌ను రూ.4,116లకు పెంచిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మంత్రి ధన్యవాదాలు తెలిపారు.
కలెక్టర్ హరీశ్ మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పాటు తర్వాత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అన్ని రంగాలను ఎంచుకొని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లారన్నారు. పరిపాలన సౌలభ్యం సులభతరం అయిందని, త్వరితగతిన ప్రజలకు సేవలందించేందుకు ప్రభుత్వం అనేక సౌకర్యాలు కల్పించినదని పేర్కొన్నారు. పరిపాలనా సౌలభ్యం కోసం రంగారెడ్డి జిల్లాలో 27 మండలాలు, ఐదు రెవెన్యూ డివిజన్లు, 13 మున్సిపాలిటీలు, 3 మున్సిపల్ కార్పొరేషన్లను ఏర్పాటు చేపినట్లు కలెక్టర్ తెలిపారు. రంగారెడ్డి జిల్లా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయాన్ని అన్ని హంగులతో అధునాతన సదుపాయాలతో ఇబ్రహీంపట్నం మండలం కొంగరకలాన్‌లో 35 ఎకరాల విస్తీర్ణంలో రూ.58.29 కోట్లతో నిర్మాణం చేపట్టి, గతేడాది ఆగస్టు 28న సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేసుకొని జిల్లా పరిపాలన కొనసాగిస్తున్నామని తెలిపారు. ప్రజల సంక్షేమం కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టి అమలు పరుస్తున్నదన్నారు.
భూ సమస్యల పరిష్కారం, వ్యవసాయం సాగు, తాగునీరు, వైద్య ఆరోగ్య, ప్రతి శాఖలో అనేక సంస్కరణలు చేపట్టి ప్రజలకు సులభంగా సేవలందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని కలెక్టర్ తెలిపారు. ఈ సుపరిపాలన మరింత వేగంగా ప్రజలకు సేవలు అందించాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. అలాగే ప ల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమా న్ని ప్రవేశపెట్టి పల్లెలు, పట్టణాలను అభివృద్ధి చేసుకుం టూ పరిశుభ్రంగా ఉండేలా చేసుకున్నామన్నారు. పల్లెల్లో వైకుంఠ ధామాలు, డంపింగ్ యార్డులు, మరుగుదొడ్లు, నర్సరీలు, పల్లె ప్రకృతి వనాలు, బృహత్ పల్లె ప్రకృతి వనాలు, తెలంగాణ క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చే సుకొన్నామన్నారు. కార్యక్రమం లో జడ్పీ చైర్పర్సన్ అనితా హరినాథ్ రెడ్డి, ఎమ్మెల్యేలు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, జైపాల్ యాదవ్, అదనపు కలెక్టర్లు తిరుపతి రావు, ప్రతీక్ జైన్, జిల్లా రెవెన్యూ అధికారి హరిప్రియ, ఆర్డీవో వెంకటాచారి,రైతు సమన్వయ సంఘం రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు వంగేటి లక్ష్మారెడ్డి, పోలీసు అధికారులు, ప్రజా ప్రతినిధులు, జిల్లా అధికారులు, రెవెన్యూ అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.