షాబాద్, మే 13: సీఎం కేసీఆర్ ప్రభుత్వం విద్యాభివృద్ధికి పెద్దపీట వేసిందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. శుక్రవారం ఆమె మండలంలోని హైతాబాద్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో అమెజాన్ వెబ్ సర్వీస్ సహకారంతో రూ. కోటి నిధులతో చేపట్టనున్న పాఠశాల భవన మరమ్మతు పనులను చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, అమెజాన్ వెబ్ సర్వీస్ డైరెక్టర్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి సబితాఇంద్రారెడ్డి మాట్లాడుతూ…అమెజాన్ వెబ్ సర్వీస్ ప్రతినిధులు మారుమూల గ్రామానికి వచ్చి, మన విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పెద్ద ఎత్తున నిధులను కేటాయించడం సంతోషంగా ఉందన్నారు. ఇటీవలే చేవెళ్ల ప్రభుత్వ దవాఖానలోనూ ఆ సంస్థ ప్రతినిధులు ఐసీయూను ఏర్పాటు చేసినట్లు గుర్తు చేశారు. తెలంగాణ ప్రభుత్వం విద్య, వైద్యానికి పెద్దపీట వేసిందన్నారు. ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను మార్చేందుకు మన ఊరు-మన బడి కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా రూ.7300 కోట్లతో పాఠశాలలను అభివృద్ధి చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమం ద్వారా పాఠశాలల్లో మొత్తం 12 అంశాల్లో పనులను చేపట్టడం జరుగుతుందన్నారు. విద్యార్థులు బాగా చదువుకుని తల్లిదండ్రులు, పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని మంత్రి సూచించారు.
త్వరలో జరుగనున్న పదోతరగతి పరీక్షలను విద్యార్థులు బాగా రాయాలన్నారు. ‘మన ఊరు-మన బడి’ లో భాగంగా మొదటి విడుతలో ఎంపికైన పాఠశాలల్లో రూ.3500 కోట్లతో మౌలిక వసతులను కల్పిస్తామని తెలిపారు. జూన్‌లో పాఠశాలలు పునః ప్రారం భం కాగానే 1-8వ తరగతి వరకు ఆంగ్ల మాధ్యమంలో విద్యార్థులకు బోధిస్తామన్నారు. ఇప్పటికే ఉపాధ్యాయులకు ఆంగ్ల మాధ్యమంలో బోధనపై శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు. ప్రపంచంలో తెలంగాణ బిడ్డలు పోటీ పడాలంటే ఇంగ్లిష్ మాధ్యమం ఉండాలని సీఎం కేసీఆర్ చెబుతుంటారని మంత్రి గుర్తు చేశారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత రాష్ట్రంలో 1000 గురుకులాలను ఏర్పాటు చేయడంతోపాటు ఇంటర్ కాలేజీలను 1050 పెంచినట్లు చెప్పారు. ఎస్సీ, ఎస్టీ బాలికల కోసం ప్రత్యేకంగా 53 డిగ్రీ గురుకుల కళాశాలలను త్వరలోనే ప్రారంభిస్తామని మంత్రి సబితారెడ్డి తెలిపారు. రూ. కోటి వరకు పాఠశాలలకు విరాళమిస్తే పాఠశాలలకు వారి పేర్లను పెట్టడం జరుగుతుందన్నారు. చేవెళ్ల నియోజకవర్గాభివృద్ధికి ఎమ్మెల్యే యాదయ్య నిరంతరం కృషి చేస్తున్నారని ప్రశంసించారు. నక్కలపల్లి-హైతాబాద్ ఈసీవాగుపై బ్రిడ్జిని నిర్మించాలని ఎమ్మెల్యే అడిగిన వెంటనే సీఎం కేసీఆర్ నిధులు మంజూరు చేసినట్లు ఆమె తెలిపారు. ఐటీ మంత్రి కేటీఆర్ సహకారంతో షాబాద్‌లో పెద్ద పెద్ద పరిశ్రమలు వెలుస్తున్నట్లు చెప్పారు.
అనంతరం ఎమ్మెల్యే కాలె యాదయ్య మాట్లాడుతూ సీఎం కేసీఆర్ రాష్ర్టాభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారని కొనియాడారు. అమెజాన్ సంస్థ ప్రతినిధులు నియోజకవర్గంలోని అన్ని మండలాల్లోని ప్రభుత్వ స్కూళ్లు, దవాఖానల్లో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టాలని ఆయన కోరారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి నాణ్యమైన బోధనను పొందాలన్నారు.
అనంతరం అమెజాన్ వెబ్ సర్వీస్ డైరెక్టర్ సాజీ పీకే మాట్లాడుతూ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో రంగారెడ్డిజిల్లా విద్యాశాఖ అధికారి సుశీందర్‌రావు, చేవెళ్ల ఆర్డీవో వేణుమాధవ్‌రావు, ఎంపీడీవో అనురాధ, ఎంఈవో శంకర్‌రాథోడ్, పీఆర్ డీఈ విజయ్‌కుమార్, ఏఈ శ్రీదివ్య, సర్పంచులు మల్లేశ్, ప్రభాకర్‌రెడ్డి, నరేందర్‌రెడ్డి, డిప్యూటీ తహసీల్దార్ క్రాంతికిరణ్, మాజీ సర్పంచ్ జనార్దన్‌రెడ్డి, పాఠశాల హెచ్ఏం విజయలక్ష్మి, సుదర్శన్, విద్యార్థులు, కంపెనీ ప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు.