మోమిన్‌పేట/శంకర్పల్లి/మర్పల్లి, ఆగస్టు 30 : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో వికారాబాద్ జిల్లాలో ఆదివారం ఆయా మండలాల్లో కురిసిన కుండపోత వర్షానికి నలుగురు మృతిచెందారు. వరదల్లో కొట్టుకుపోయిన వారి ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. మోమిన్‌పేటకు చెందిన ప్రవళికకు మర్పల్లి మండలం రావులపల్లి గ్రామానికి చెందిన నవాజ్‌రెడ్డితో ఈ నెల 26న వివాహం జరిగింది. ఆదివారం ఉదయం మోమిన్‌పేటకు వెళ్లి తిరిగి రాత్రి 7:30కి నవాజ్‌రెడ్డి ప్రవళికతోపాటు తన అక్కలు రాధ, శ్వేత, అల్లుడు ఇషాంత్‌రెడ్డి, డ్రైవర్ రాఘవేందర్‌రెడ్డితో కలిసి రావులపల్లికి వస్తున్నారు. ఉధృతంగా ప్రవహిస్తున్న తిమ్మాపూర్ వాగును దాటుతుండగా.. వరద ప్రవాహం ఎక్కువై కారు కొట్టుకుపోయింది. నవాజ్‌రెడ్డి, రాధ కారు తలుపులు తెరుచుకుని చెట్ల కొమ్మల సహాయంతో బయటకు రాగా కారులో ఉన్న నలుగురు గల్లంతయ్యారు. సోమవారం ఉదయం పోలీసులు, గ్రామస్తులు వాగులో గాలిస్తుండగా.. కిలోమీటర్ దూరంలో కారు లభ్యం కాగా.. ప్రవళిక, శ్వేత మృతదేహాలు లభ్యమయ్యాయి. రాఘవేందర్‌రెడ్డి సురక్షితంగా బయటపడ్డాడు. ఇషాంత్‌రెడ్డి కోసం రెవెన్యూ అధికారులు, పోలీసులు గజ ఈతగాళ్లతో ముమ్మరంగా గాలిస్తున్నారు. సంఘటన స్థలాన్ని వికారాబాద్ ఎమ్మెల్యే ఆనంద్ ఎస్పీ నారాయణ, డీఎస్పీ సంజీవరావుతో కలిసి పరిశీలించి కుటుంబసభ్యులను పరామర్శించారు. అనంతరం 4 కిలోమీటర్లు కాలినడకన వెళ్లి.. నవ వధువు ప్రవళిక మృతదేహాన్ని ఒడ్డుకు చేర్చేందుకు ఏర్పాట్లు చేసి.. స్థానికులతో కలిసి ఎమ్మెల్యే రెండు కిలోమీటర్లు మోసుకుంటూ ఒడ్డుకు చేర్చారు. మృతదేహాలను మర్పల్లి ప్రభుత్వ దవాఖానకు తరలించి పోస్టుమార్టం త్వరగా నిర్వహించాలని అక్కడి డాక్టర్లను ఆదేశించారు. అలాగే గల్లంతైన వారి కోసం విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టాలని పోలీస్ శాఖ, రెవెన్యూ అధికారులను ఆదేశించారు. డ్రైవర్ అజాగ్రత్త వల్లే ప్రమాదం జరిగిందని ఎస్పీ అన్నారు. ఉధృతంగా పారుతున్న వాగులను దాటవద్దని అధికారులు, ప్రజాప్రతినిధులు సూచిస్తున్నారు.
కొత్తపల్లి శివారులో..
మోమిన్‌పేట మండలం ఎన్కతల గ్రామానికి చెందిన సామల వెంకటయ్య(65) ఆదివారం రాత్రి 7:30కి చేవెళ్ల మండలం కౌకుంట్ల గ్రామంలో విందుకు వెళ్లి తిరిగి కారులో ఎన్కతల గ్రామానికి చెందిన శ్రీనివాస్, సాయితో కలిసి వస్తున్నాడు. కొత్తపల్లి శివారులో వాగు ఉధృతంగా ప్రవహించడంతో కొంతసేపు ఆగి వెళ్లడానికి ప్రయత్నించగా కారు నీటిలో నిలిచిపోయింది. వరద పెరుగడంతో కారులో ఉన్న శ్రీనివాస్, సాయి బయటకు వచ్చారు. వెంకటయ్య బయటకు రాలేక కారులోనే ఉండిపోయాడు. వరద నీటి ప్రవాహంలో కారు నదిలో కొంతదూరం కొట్టుకుపోయింది. ఉదయం పోలీసులు, గ్రామస్తులు కారు ఆచూకీ తెలుసుకుని అందులో ఉన్న వెంకటయ్య మృతదేహాన్ని బయటకు తీశారు. పోస్టుమార్టం నిమిత్తం చేవెళ్ల దవాఖానకు తరలించి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
పులుమామిడి వాగులో..
నవాబుపేట మండలం పులుమామిడి గ్రామానికి చెందిన చాకలి శ్రీను(40) ఆదివారం గ్రామ సమీపంలో ఉధృతంగా ప్రవహిస్తున్న వాగును దాటబోయి బైక్‌తో సహా కొట్టుకుపోయాడు. సోమవారం ఉదయం శ్రీను మృతదేహాన్ని గ్రామస్తులు గుర్తించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని వికారాబాద్ ఏరియా దవాఖానకు తీసుకొచ్చారు. విషయం తెలుసుకున్న చేవెళ్ల ఎమ్మెల్యే యాదయ్య మృతదేహాన్ని పరిశీలించి కుటుంబసభ్యులను పరామర్శించారు. చాకలి శ్రీను మృతిపై స్థానికులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.
కొట్టుకుపోయిన పంటలు
దేవునిపడకల్ గ్రామంలో గల మహ్మద్‌ఖాన్ చెరువు కట్టతెగిపోయి చెరువు కింది భాగంలో రైతులు సాగు చేసిన 25 ఎకరాల వరి, పత్తి, కంది పంటలు కొట్టుకుపోయినట్లు వ్యవసాయ అధికారి విజయ్ తెలిపారు. గట్టుఇప్పలపల్లి, వీరన్నపల్లిలో రెండు ఇండ్లు కూలిపోవడంతో ఎంఆర్ఐ ఆంజనేయులు పరిశీలించి నష్టపరిహారం అంచనావేసి ప్రభుత్వానికి నివేదికలు పంపినట్లు తెలిపారు.