ఇబ్రహీంపట్నంరూరల్, నవంబర్ 5 : దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో అన్నదాతల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తున్నదని ఎంపీపీ కృపేశ్ అన్నారు. ప్రభుత్వ ఆదేశాలతో శుక్రవారం మండల పరిధిలోని ఉప్పరిగూడ, ముకునూరు రైతు వేదికల్లో రైతులకు వరిధాన్యం కొనుగోళ్లపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ.. రైతులు కొనుగోలు కేంద్రాలకు నిబంధనల ప్రకారం ధాన్యాన్ని తీసుకురావాలన్నారు. ముకునూరు రైతువేదికలో నిర్వహించిన అవగాహన సదస్సులో ఏడీఏ సత్యనారాయణ మాట్లాడుతూ.. యాసంగిలో ఆరుతడి పంటలపై దృష్టి సారించాన్నారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి మండల కన్వీనర్ అంజిరెడ్డి, జిల్లా సభ్యులు మోహన్‌రెడ్డి, హైమావతి, ఆదిబట్ల మున్సిపల్ ఛైర్పర్సన్ ఆర్తిక, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బుగ్గ రాములు, ఏవో వరప్రసాద్‌రెడ్డి, ఏఈవోలు శ్రవణ్‌కుమార్, రఘుతో పాటు సర్పంచ్‌లు పాల్గొన్నారు.
యాసంగి పంటలపై అవగాహన
మండల కేంద్రంలోని రైతు వేదిక భవనంలో యాసంగి పంటలపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. యాసంగిలో రైతులు సాగుచేసే పంటలపై వ్యవసాయాధికారి సందీప్ సలహాలు, సూచనలు అందజేశారు. సదస్సుకు హాజరైన ఎంపీపీ సుకన్య మాట్లాడుతూ.. రైతులు వరికి ప్రత్యామ్నాయంగా చిరుధాన్యాల సాగు విస్తీర్ణాన్ని పెంచాలని సూచించారు. కార్యక్రమంలో సహకార సంఘం చైర్మన్ రాజేందర్‌రెడ్డి, రైతుబంధు సమితి మండల కన్వీనర్ జోగిరెడ్డి, జిల్లా నాయకులు వెంకటయ్య పాల్గొన్నారు.
కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి
మూసీ పరీవాహక ప్రాంతంలో వరి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని జడ్పీటీసీ దాస్‌గౌడ్ అన్నారు. అబ్దుల్లాపూర్‌మెట్ మండల కేంద్రంలోని రైతు వేదికలో సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, రైతుబంధు సమితి కోఆర్డినేటర్లు, రైతులకు ప్రత్యామ్నాయ పంటల సాగుపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యాన్ని కొనుగోలు చేయాలన్నారు. రాజేంద్రనగర్ వ్యవసాయ క్షేత్రం సీనియర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ గోవర్దన్ మాట్లాడుతూ మండలంలోని మూసీ ప్రాంత రైతులు వరికి ప్రత్యామ్నాయంగా నేపియర్ పశుగ్రాసం పండించాలని సూచించారు. ఇబ్రహీంపట్నం ఏడీఏ సత్యనారాయణ మాట్లాడుతూ రైతులు వరి పంటకు బదులుగా కూరగాయల పంటలు, మినుములు, పెసర్లు, కందులు, ఆముదం పండించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా కోఆప్షన్ సభ్యుడు అక్బర్ అలీఖాన్, వైఎస్ ఎంపీపీ శ్రీధర్‌రెడ్డి, మండల వ్యవసాయ అధికారి శ్రీఉమ, విస్తరణ అధికారి లక్ష్మణ్, సర్పంచ్‌లు శ్రీనివాస్‌రెడ్డి, మల్లేశ్, లావణ్య, ఎంపీటీసీ బాలలింగస్వామి పాల్గొన్నారు.
ఆరుతడి పంటలతో లాభాలు
రైతులు వరికి ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటలు సాగు చేసి లాభాలు పొందాలని మండల వ్యవసాయాధికారి శిరీష సూచించారు. మండలంలోని అల్వాల రైతువేదికలో శుక్రవారం రైతులకు ఆరుతడి పంటల సాగుపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ దామోదర్‌రెడ్డి, టీఆర్ఎస్ నాయకుడు తిరుమలరెడ్డి శ్రీనివాస్ పాల్గొన్నారు.