రంగారెడ్డి, ఆగస్టు 30, (నమస్తే తెలంగాణ): భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రెవెన్యూ, పోలీసు, నీటిపారుదల శాఖ అధికారులు ముందస్తు ఏర్పాట్లతో అప్రమత్తంగా ఉండాలని, ప్రాణ, ఆస్తి నష్టం జరుగకుండా ఎప్పటికప్పుడు పరిస్థితులను పరిశీలించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ జిల్లా కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లను ఆదేశించారు. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా తీసుకోవాల్సిన చర్యలపై రాష్ట్ర డీజీపీ మహేందర్‌రెడ్డితో కలిసి సీఎస్ సోమేశ్‌కుమార్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాలవారీగా సమీక్షించారు.
గ్రామాలు, మండలాలు, మున్సిపాలిటీల్లో ప్రత్యేక బృందాలు : రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమయ్‌కుమార్
రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమయ్‌కుమార్ మాట్లాడుతూ.. జిల్లాలో వర్షాలు పడుతున్న దృష్ట్యా అధికారులు అప్రమత్తంగా ఉన్నారని, ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పరిస్థితులను పర్యవేక్షిస్తున్నామని వివరించారు. గ్రామాలు, మండలాలు, మున్సిపాలిటీల్లో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి అప్రమత్తంగా ఉంటామని తెలిపారు. భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా కలెక్టరేట్లో కంట్రోల్ రూంను ఏర్పాటు చేశామన్నారు. జిల్లా ప్రజలకు ఎవరికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా 040-23230813, 040-23230817లను సంప్రదించాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర, అదనపు కలెక్టర్లు ప్రతీక్ జైన్, తిరుపతిరావు, జడ్పీ సీఈవో దిలీప్‌కుమార్, డీఆర్డీఏ పీడీ ప్రభాకర్, ఇరిగేషన్ ఎస్ఈ హైదర్‌ఖాన్, ఈఈ బన్సీలాల్, జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్ రెడ్డి, వ్యవసాయాధికారి గీతారెడ్డి పాల్గొన్నారు.
కట్టుదిట్టమైన ఆంక్షలు విధించాం : వికారాబాద్ జిల్లా కలెక్టర్ పౌసుమిబసు
వీడియో కాన్ఫరెన్స్‌లో వికారాబాద్ జిల్లా కలెక్టర్ పౌసుమిబసు మాట్లాడుతూ.. జిల్లాలోని మర్పల్లి, నవాబుపేట మండలాల్లో దురదృష్టవశాత్తు రెండు ఘటనల్లో ముగ్గురు మృతిచెందారని, ఇలాంటి సంఘటనలు జరుగకుండా పూర్తి చర్యలు చేపడుతామన్నారు. అధికారులు అప్రమత్తంగా ఉన్నారని, ట్రాఫిక్‌ను మళ్లించి ఆ మార్గం నుంచి వెళ్లకుండా కట్టుదిట్టమైన ఆంక్షలు విధించామని తెలిపారు. జిల్లా పోలీస్ యంత్రాంగంతోపాటు ఆర్అండ్బీ, ఇరిగేషన్, పంచాయతీరాజ్, రెవెన్యూ, విద్యుత్ శాఖల అధికారులు అందరూ అప్రమత్తంగా ఉన్నారని సీఎస్‌కు కలెక్టర్ తెలియజేశారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా ఎస్పీ నారాయణ, జిల్లా అదనపు కలెక్టర్లు మోతీలాల్, చంద్రయ్య, జడ్పీ సీఈవో జానకీరెడ్డి, వ్యవసాయాధికారి గోపాల్, డీఎంహెచ్‌వో సుధాకర్‌షిండే, ఆర్అండ్బీ ఈఈ లాల్‌సింగ్, పీఆర్ ఇంజినీర్, ఎలక్ట్రిసిటీ ఇంజినీర్ పాల్గొన్నారు.అదేవిధంగా సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ నీటి పారుదల శాఖ చీఫ్ ఇంజినీర్‌తో బీఆర్కేఆర్ భవన్ నుంచి సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వాతావరణ శాఖ జారీ చేసిన సూచనల మేరకు రాష్ట్రవ్యాప్తంగా, ముఖ్యంగా ఉత్తర తెలంగాణ ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తున్నాయన్నారు.