షాబాద్, ఆగస్టు 30 : గ్రామాల్లో పారిశుధ్య పనులు పకడ్బందీగా చేపట్టాలని రంగారెడ్డి జిల్లా పరిషత్తు సీఈవో దిలీప్‌కుమార్ అన్నారు. సోమవారం మండల పరిధిలోని బొబ్బిలిగామ గ్రామాన్ని సందర్శించారు. అనంతరం గ్రామంలో పల్లెప్రగతిలో భాగంగా నిర్మించిన కంపోస్ట్‌యార్డు, వైకుంఠధామం, హరితహారం నర్సరీని, ప్రభుత్వ పాఠశాలలో గదులను, ఆయా కాలనీల్లో సీసీ రోడ్డు, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీలు పరిశీలించి మాట్లాడారు. పల్లెప్రగతి ద్వారా గ్రామాలను స్వచ్ఛంగా మార్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి పాఠశాలలు ప్రారంభమవుతున్నందున పాఠశాల గదులు శుభ్రంగా ఉంచాలన్నారు. పాఠశాలలో మరుగుదొడ్లల్లో నల్లాలు ఏర్పాటు చేయాలని సూచించారు. హరితహారంలో నాటిన మొక్కలను సంరక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉందని చెప్పారు. ప్రజలు సీజనల్ వ్యాధుల బారిన పడకుండా పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఆయన వెంట ఎంపీడీవో అనురాధ, ఎంపీవో హన్మంత్‌రెడ్డి, సర్పంచ్ అర్చన, సుధాకర్‌రెడ్డి తదితరులున్నారు.
పాఠశాల పరిసరాలు శుభ్రంగా ఉంచాలి
సెప్టెంబర్ 1వ తేదీ నుంచి పాఠశాలలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో సర్పంచులు, హెడ్మాస్టర్లు పాఠశాల పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని ఎంపీడీవో సత్తయ్య తెలిపారు. సోమవారం మండలంలోని టంగటూరు జడ్పీ ఉన్నత పాఠశాలను సందర్శించి అక్కడ జరుగుతున్న పారిశుధ్య పనులను పరిశీలించి మాట్లాడారు. విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా ఉపాధ్యాయులు చర్యలు తీసుకోవాలన్నారు. శుభ్రమైన తాగు నీరు అందేలా చూడాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ గోపాల్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
పాఠశాలల్లో శానిటైజేషన్ పనులు
పాఠశాలలు పునః ప్రారంభమవుతున్న నేపథ్యంలో మండలంలోని పాఠశాలల్లో శానిటైజేషన్ పనులు ముమ్మరంగా చేపడుతున్నారు. పాఠశాలల ప్రారంభానికి రెండు రోజులే గడువు ఉండడంతో సర్పంచ్‌లు, పంచాయతీ సిబ్బందితో కలిసి పాఠశాలలను శుభ్రం చేయిస్తున్నారు. మండల కేంద్రంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో సర్పంచ్ల సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకట్‌రెడ్డి శానిటైజేషన్ పనులను చేపట్టారు.