పరిగి, జూన్ 2 : పారిశుధ్యంపై దృష్టిసారించాలని జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య సూచించారు. శుక్రవారం పరిగి మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్‌తో కలిసి పట్టణంలోని పలు వార్డుల్లో పర్యటించారు. ఈ సందర్భంగా పట్టణ ప్రగతిలో చేపడుతున్న పనులను అదనపు కలెక్టర్ పరిశీలించారు. పారిశుధ్యం పనులు మరింత వేగంగా చేపట్టాలన్నారు. అన్ని వార్డుల్లో ఈ పనులు జరిగేలా చూడాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రవీణ్‌కుమార్, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
విద్యుత్ సమస్యలపై ఆరా..
పవర్ డే సందర్భంగా మండలంలోని రంగాపూర్‌లో విద్యుత్ సంబంధిత సమస్యలను ఎంపీపీ అరవిందరావు సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. వేలాడుతున్న విద్యుత్ వైర్ల సరిచేత, తుప్పుపట్టిన విద్యుత్ స్తంభాల తొలగింపు, ట్రాన్స్ఫార్మర్ల మార్పు తదితర అంశాలను అడిగి తెలుసుకోవడంతోపాటు సాధ్యమైనంత త్వరగా పనులు పూర్తయ్యేలా చూడాలని ఎంపీపీ పేర్కొన్నారు.
దోమలో..
దోమ గ్రామంలో పరిశుభ్రతే ప్రధానాంశంగా పనులు జరుగుతున్నాయని సర్పంచ్ రాజిరెడ్డి అన్నారు. దోమ గ్రామపంచాయతీలో అంగన్వాడీ ఆశాకార్యకర్తలతో సర్పంచ్ రాజిరెడ్డి సమావేశం నిర్వహించి పరిశుభ్రత, ప్రజారోగ్యంతో పాటు హరితహారం తదితర అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. పారిశుధ్య కార్మికులతో మురుగు కాల్వలను శుభ్రం చేయించామన్నారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి చంద్రశేఖర్, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
కులకచర్లలో..
కులకచర్ల మండలంలోని గ్రామాల్లో శ్రమదానం నిర్వహించారు. తమ గ్రామాల్లో రహదారులు, ఇతర స్థలాలను శుభ్రం చేశారు. ప్రజలు స్వచ్ఛందంగా శ్రమదానంలో పాల్గొని పిచ్చిమొక్కలు, చెత్తాచెదారం తొలగించారు.
పల్లె ప్రగతితో మారనున్న పల్లెలు
బషీరాబాద్, జూలై 2 : పల్లె ప్రగతితో పల్లెల రూపురేఖలు మారనున్నాయని ఎంపీపీ కరుణ అన్నారు. మండల పరిధిలోని కొత్లాపూర్ గ్రామంలో పర్యటించి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ పథకం ప్రవేశపెట్టినా అది సంచలనం సృష్టిస్తుందన్నారు. ప్రతి పథకం ఆదర్శంగా నిలువడమే కాకుండా ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోతుందని పేర్కొన్నారు. పల్లె ప్రగతితో పల్లెలు పట్టణాలకు దీటుగా మారుతున్నాయన్నారు. పారిశుధ్యం బాగుంటే ప్రజలు ఆరోగ్యవంతులుగా ఉంటారని పేర్కొన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులకు ఎంత బాధ్యత ఉంటుందో ప్రజలకు కూడా అంతే బాధ్యత ఉండాలన్నారు. ప్రతి ఒక్కరూ గ్రామం పట్ల ప్రేమ కలిగి ఉండాలని.. అప్పుడే గ్రామాల అభివృద్ధి సాధ్యపడుతుందని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీడీవో రమేశ్, సర్పంచ్ రవి, ఏపీవో శారద, విద్యుత్ ఏఈ మహిపాల్, టీఏ నారాయణ ఉన్నారు.