కోట్‌పల్లి, నవంబర్ 5 : ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమంతో మండలంలోని కంకణాలపల్లి గ్రామ రూపురేఖలు మారాయి. ప్రతి కాలనీలో విశాలమైన సీసీ రోడ్డు నిర్మాణం పూర్తయింది. రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటడంతో ఊరంతా పచ్చని వనంలా మారింది. ఆహ్లాదకరమైన వాతావరణం సంతరించుకున్నది. కంకణాలపల్లి గ్రామానికి అనుబంధంగా ఉన్న మల్శేట్పల్లితండా ఉండగా, ప్రత్యేక శ్రద్ధ తీసుకుని అభివృద్ధి పనులను చేపడుతున్నారు.
గ్రామంలో పచ్చందాలు..
పల్లె ప్రగతి కార్యక్రమంతో గ్రామంలోని ప్రజల్లో చైతన్యాన్ని పెంచి మంచి వాతావరణం అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నది. గతంలో ఏ ప్రభుత్వమూ గ్రామాల్లోని పరిశుభ్రతను పట్టించుకున్న పాపాన పోలేదు. కానీ తెలంగాణ ప్రభుత్వం పంచాయతీకో ట్రాక్టర్‌ను కేటాయించింది. గ్రామంలోని ఇంటింటికీ వెళ్లి చెత్తను సేకరించి, డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. తడి, పొడి చెత్తను వేరు చేసి, సేంద్రియ ఎరువులను తయారు చేస్తున్నది. గ్రామంలో పరిశుభ్రత ఏర్పడి, కాలానుగుణంగా వచ్చే వ్యాధుల నిర్మూలనకు కృషి చేస్తున్నది. ప్రజల ఆరోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నది.
అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి
ప్రతి గ్రామం హరితమయంగా మార్చేందుకు అధికారులు కృషి చేస్తున్నారు. ప్రతి సంవత్సరం గ్రామాల్లో మొక్కలను యుద్దప్రాతిపదికన నాటి, వాటిని కంటికి రెప్పలా కాపాడుతున్నారు. ప్రభుత్వం మిషన్‌భగీరథ ద్వారా ఇంటింటికీ తాగునీటిని అందిస్తున్నది. గ్రామంలో ప్రతివీధిలో విద్యుత్ స్తంభాలకు లైట్లను బిగించారు.
గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తా
గ్రామాభివృద్ధికి ప్రభుత్వం చేస్తున్న కృషి ఎంతో గొప్పది. పల్లె ప్రగతితో పల్లెలన్నీ పచ్చందాలతో ఆహ్లాదకరంగా మారాయి. ప్రతి నిత్యం చెత్తను ట్రాక్టర్‌తో సేకరించి, డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. అధికారులు, ప్రజల సహకారంతో గ్రామాన్ని చాలా అభివృద్ధి చేసుకున్నాం. మా గ్రామంలోని ఇంటింటికీ మిషన్‌భగీరథ ద్వారా తాగునీరు సరఫరా అవుతున్నది. ప్రజల సహకారంతో మా గ్రామాన్ని మరింత అభివృద్ధి చేస్తాం.
సమస్యలు లేకుండా చేశాం
ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను ప్రజల సహకారంతో గ్రామాన్ని పరిశుభ్రంగా చేశాం. పాడుబడ్డ ఇండ్లు, చెత్త కుప్పలు, పెంట కుప్పలను తొలగించి, గ్రామంలో ప్రశాంత వాతావరణాన్ని నెలకొల్పాం. నర్సరీల్లో మొక్కలను పెంచి, గ్రామంలోని ఖాళీ స్థలాలు, కాలనీల్లో రోడ్డకు ఇరువైపులా నాటినం, గ్రామంలో హరితహారం కార్యక్రమంలో నాటిన మొక్కలతో గ్రామంలో హరితశోభ సంతరించుకున్నది.