కులకచర్ల, నవంబర్ 5: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లెప్రగతి కార్యక్రమంతో గ్రామాలు అభివృద్ధిపథంలో దూసుకెళ్లడంతోపాటు పరిశుభ్రం గా మారుతున్నాయి. గ్రామాలు పరిశుభ్రంగా ఉన్నప్పుడే ప్రజలు రోగాలబారిన పడకుండా ఆరోగ్యం గా ఉంటారని సీఎం కేసీఆర్ భావించి ప్రవేశపెట్టి అమలుచేస్తున్న కార్యక్రమంతో గ్రామాలు శుభ్రంగా మారుతున్నాయి. మండలంలోని ఆయా గ్రామాల సర్పంచ్‌లు పరిసరాల శుభ్రతపై అధిక దృష్టిని సారించారు. అంతేకాకుండా సీఎం కేసీఆర్ పంచాయతీల కు పెద్ద ఎత్తున నిధులను కేటాయిస్తూ గ్రామాల్లో పారిశుధ్య పనులు చేపట్టేలా చర్యలు తీసుకుంటున్నారు. గ్రామాల్లోని చెత్తాచెదారాన్ని ప్రతిరోజూ సేకరించేందుకు పంచాయతీ సిబ్బందిని నియమించుకున్నారు. అంతేకాకుండా చెత్తను డంపింగ్ యార్డులకు తరలించేందుకు ట్రాక్టర్లను కొనుగోలు చేశారు. మం డలంలోని 44 గ్రామ పంచాయతీల్లో ప్రతిరోజూ చెత్తను పంచాయతీ ట్రాక్టర్ల ద్వారా డంపింగ్ యార్డులకు పంచాయతీ సిబ్బంది తరలిస్తున్నారు. ప్రతి పం చాయతీలో డంపింగ్‌యార్డు ఉండాలని ప్రభుత్వం నిబంధన విధించడంతో మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో డంపింగ్ యార్డులను ఏర్పాటు చేశా రు. పల్లె ప్రగతి కార్యక్రమంతో మండలంలోని అన్ని గ్రామాల రూపురేఖలు మారిపోయాయి. ప్రజలు అధికారులు, ప్రజాప్రతినిధులు సహకరిస్తుండటం తో మండలంలోని అన్ని గ్రామాలు పరిశుభ్రంగా కనిపిస్తున్నాయి. ఉమ్మడి కులకచర్ల మండలంలో 44 గ్రామ పంచాయతీలున్నాయి. చౌడాపూర్ మండలా న్ని 24 గ్రామ పంచాయతీలతో ఏర్పాటు చేశారు. ఈ రెండు మండలాల్లో 56 గ్రామ పంచాయతీలున్నాయి.
ఇంటి ముందుకే చెత్తబండి..
కులకచర్ల, చౌడాపూర్ మండలాల్లోని 56 గ్రామ పం చాయతీల్లో చెత్తను డంపింగ్ యార్డులకు తరలించేందుకు ట్రాక్టర్లను కొనుగోలు చేశారు. ప్రతిరోజూ పం చాయతీ సిబ్బంది ఇంటింటి చెత్తను సేకరించి డంపింగ్ యార్డులకు తరలిస్తున్నారు. దీంతో గ్రామా లు పూర్తిస్థాయిలో పరిశుభ్రంగా మారినట్లు స్థాని కులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
విజిల్‌తో సంకేతం..
కులకచర్ల మండలంలోని కామునిపల్లి గ్రామంలో పంచాయతీ సిబ్బంది చెత్తను సేకరించి డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. ఒక విజిల్ వేస్తే చెత్తను తీసుకెళ్లే ట్రాక్టర్ ఇంటి ముందుకొచ్చిందనే సంకేతా న్ని పంచాయతీ సిబ్బంది గ్రామస్తులకు తెలిపారు. ప్రతిరోజూ వీధుల వెంట తిరిగి చెత్తను సేకరించి డం పింగ్ యార్డుకు తరలిస్తున్నారు.
శుభ్రంగా పరిసరాలు
పంచాయతీ సిబ్బంది ప్రతిరోజూ గ్రామంలోని చెత్తాచెదారాన్ని సేకరించేలా చర్యలు తీసుకుంటున్నాం. చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా స్థానికులకు అవగాహన కల్పించడం జరిగింది. గతంలో పరిసరాలు శుభ్రంగా ఉండేవి కావు. ప్రభుత్వం తీసుకున్న చర్యలతో పరిసరాలు శుభ్రంగా మారాయి. – సర్పంచ్ పాల మహిపాల్‌రెడ్డి
తడి, పొడి చెత్త వేరు చేసేలా..
పంచాయతీలోని తడి, పొడి చెత్తను వేరు చేసి డంపింగ్ యార్డుకు తరలించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. పంచాయతీ సిబ్బంది ప్రతిరోజూ సేకరించిన చెత్తాచెదారాన్ని తడి, పొడిగా వేరు చేసి డంపింగ్ యార్డుకు తరలించేలా వారికి అవగాహన కల్పించడం జరిగింది. గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నాం.
– శ్రీనివాస్‌రెడ్డి, పంచాయతీ కార్యదర్శి కులకచర్ల