పెద్దేముల్, ఆగస్టు 30 : తెలంగాణ రాష్ట్రం సిద్ధించి ప్రభుత్వం ఏర్పడిన తరువాత సీఎం కేసీఆర్ వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యతను ఇస్తున్నారు. అందులో భాగంగా రైతుల కోసం కోట్ల రూపాయలను వెచ్చించి ప్రత్యేకంగా రైతు సంక్షేమం కోసం రైతుబంధు, రైతుబీమా వంటి బృహత్తరమైన పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్నది. మరోవైపు రైతులు పండించిన ప్రతి పంటకు ప్రభుత్వం తరఫున మద్దతు ధరను కల్పిస్తున్నది. రైతు స్వయంగా ఎలాంటి రవాణా ఖర్చుల ఇబ్బందులు లేకుండా వారి గ్రామాల్లోనే పండించిన పంటలను విక్రయించేలా వెసులుబాటు కల్పిస్తున్నది. ప్రత్యేకంగా యాసంగి, వానకాలం సీజన్ల వారీగా వివిధ రకాల పంటల కొనుగోలు కేంద్రాలను వ్యవసాయ అధికారుల సహాయ సహకారాలతో ఏర్పాటు చేసింది. రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దూరం చేస్తూ వారిని అన్ని విధాలుగా ఆదుకొంటున్నారు సీఎం కేసీఆర్. మరోవైపు రైతులు పండించిన పంటల వివరాలను ఎప్పటికప్పుడు వ్యవసాయ విస్తరణ అధికారులతో సర్వే చేయించి ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. సీజన్ల వారీగా సేకరించి రైతులకు కొనుగోలు సమయాల్లో కలుగుతున్న ఇబ్బందులను దూరం చేస్తున్నారు. ప్రస్తుతం మండలంలో సుమారు 6 వ్యవసాయ క్లస్టర్ల వారీగా పంటల సర్వే ముమ్మరంగా సాగుతున్నది.
కొనసాగుతున్న పంటల సర్వే
మండలంలో 6 వ్యవసాయ క్లస్టర్ల వారీగా ఆయా గ్రామాల్లో ప్రస్తుతం పంటల సర్వేను వ్యవసాయ విస్తరణ అధికారులు నిర్వహిస్తున్నారు. రైతుల నుంచి పంటల వివరాలను సేకరిస్తున్నారు. మండలంలోని గోపాల్పూర్, ఇందూరు, తట్టేపల్లి, కందనెల్లి, మంబాపూర్, పెద్దేముల్ గ్రామాల్లో పంటల వివరాలను గ్రామాల్లో ఏఈవోలు నమోదు చేస్తున్నారు. ఏ రకం పంటలను పండిస్తున్నారు? ఎంత విస్తీర్ణంలో సాగు చేశారు..? రైతు పూర్తి పేరు, తండ్రి పేరు, పట్ట పాసుపుస్తకం నంబరు, ఆధార్ కార్డు నంబర్లు వంటి తదితర వివరాలను గ్రామాల్లో క్షేత్ర పదర్శనలు చేస్తూ వివరాలు నమోదు చేస్తున్నారు. ఏఈవోలు రైతుబంధు వెబ్సైట్లో పంటల వివరాలను అప్లోడ్ చేయడం వలన కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించడానికి ఇబ్బందులు ఉండవు.
వివరాలు నమోదు చేసుకోవాలి
మండలంలో 6 వ్యవసాయ క్లస్టర్ల వారీగా పంటల సర్వేలో భాగంగా ఆయా గ్రామాల రైతుల నుంచి పంటల వివరాలను సేకరిస్తున్నాం. మండలంలోని అన్ని గ్రామాల రైతులందరూ సంబంధిత ఏఈవోలను సంప్రదించి తమ పంట పొలాల్లో వేసిన పంటల వివరాలను తప్పనిసరిగా నమోదు చేసుకోవాలి. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయాల సమయాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం పంటల వివరాలను నమోదు చేస్తున్నది.