వికారాబాద్ కలెక్టర్ నిఖిల
వికారాబాద్, ఫిబ్రవరి 18 : హరితహారం, నర్సరీల నిర్వహణలో ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదని వికారాబాద్ కలెక్టర్ హెచ్చరించారు. శుక్రవారం పట్టణంలోని డీపీఆర్సీ భవనంలో సంబంధిత శాఖ అధికారులతో హరితహారం, నర్సరీల నిర్వహణ, వైకుంఠధామాలు, కల్లాల నిర్మాణ పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ నిఖిల మాట్లాడుతూ 2022-23 సంవత్సరంలో 8వ విడుత హరితహారంలో భాగంగా నర్సరీల ద్వారా అవసరమైన నాణ్యమైన మొక్కలు అందించేందుకు చిత్తశుద్ధితో పని చేయాలన్నారు. నిర్లక్ష్యం వహించే అధికారులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వారం రోజుల్లో మొలకెత్తని స్థానంలో నారు తెప్పించి నాటాలన్నారు. పనులు ఎంపీడీవోల పర్యవేక్షణలో జరుగాలని తెలిపారు. ముఖ్యంగా యాలాల, నవాబుపేట మండలాల ఎంపీడీవోలు ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. తక్కువ సమయంలో వేగంగా పెరిగే గుల్మోహర్, టెకోమా, మునగ మొక్కలను నాటాలని వివరించారు. జిల్లాలో ఇప్పటి వరకు అనుకున్నంతగా కల్లాల నిర్మాణ పనులు చేపట్టకపోవడంపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. వారం రోజుల్లో ఔత్సాహికులైన రైతులను గుర్తించి గ్రౌండింగ్ పనులను పూర్తి చేయాలని సూచించారు. అసంపూర్తిగా ఉన్న వైకుంఠధామాల నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేసి సంబంధిత కాంట్రాక్టర్‌కు డబ్బులు చెల్లించేందుకు ఎఫ్‌టీవోలు అప్లోడ్ చేయాలని ఆదేశించారు. గ్రామాలకు వెంటనే సీసీ రోడ్ల పనులు పూర్తి చేయాలని తెలిపారు. అన్ని గ్రామాల్లో ఉపాధిహామీ కూలీలు 50 శాతానికి తగ్గకుండా చూడాలన్నారు. ఈ సమీక్ష సమావేశంలో జడ్పీ సీఈవో జానకీరెడ్డి, డీఆర్డీవో కృష్ణన్, పంచాయతీరాజ్ ఈఈ శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీడీవోలు, ఎంపీవోలు, పీఆర్ఈఈలు, గ్రామ కార్యదర్శులు పాల్గొన్నారు.