Vikarabad | జిల్లాలో గనుల తవ్వకాలు ఆగడం లేదు. తాండూరు నియోజకవర్గంలోని విలువైన నాపరాతి గనులను కొందరు వ్యాపారులు అక్రమంగా తవ్వుతూ రూ. వందల కోట్లను కొల్లగొడుతున్నారు. లీజు గడువు ముగిసినా.. గతేడాదిగా ప్రభుత్వం కొత్తగా లీజులకు అనుమతులు ఇవ్వకున్నా తవ్వకాలు మాత్రం ఆగడం లేదు. వ్యాపారులు సిండికేట్‌గా మారి కొంత ప్రాంతంలో లీజు అనుమతి పొంది ప్రభుత్వ భూముల్లోని నాపరాతి గనులనూ కబళిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్నారు. లీజు గడువు ముగిసి రెండేండ్లు దాటినా తాండూరు మండలంలోని ఓగిపూర్, కరన్‌కోట్, మల్కాపూర్‌లలో నాపరాతి గనుల అక్రమ తవ్వకం యథేచ్ఛగా సాగుతున్నది. అధికార పార్టీ నేతల ఒత్తిళ్లు, అక్రమార్కులు ఇచ్చే మామూళ్లు తీసుకుంటూ సంబంధిత మైనింగ్ శాఖ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. అక్రమార్కుల వెనుక స్థానిక ఎమ్మెల్యే అనుచరులు ఉన్నట్లు జిల్లాలో జోరుగా ప్రచారం జరుగుతున్నది.
– వికారాబాద్, డిసెంబర్ 11 (నమస్తే తెలంగాణ)
జిల్లాలో గనుల అక్రమ తవ్వకాలతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడుతున్నది. లీజు ఒక చోట తవ్వకాలు మరోచోట అనేలా సాగుతున్నది. మైనింగ్ వ్యాపారులు లీజుకు తీసుకుంటున్న ప్రాంతంతోపాటు పక్కన ఉన్న ప్రభుత్వ భూముల్లోనూ అక్రమంగా తవ్వకాలు జరుపుతూ ఖజానాకు నష్టం చేకూరుస్తున్నారు. జిల్లాలో భారీగా అక్రమ మైనింగ్ నిర్వహిస్తున్నారు. తాండూరు నియోజకవర్గంలో నాపరాతి, సుద్ద గనులు, ఎర్రమట్టిని అక్రమంగా తవ్వి యథేచ్ఛగా తరలిస్తున్నారు. తాండూరు మండలంలోని మల్కాపూర్, కరన్‌కోట్, ఓగిపూర్ గ్రామాల్లో నాపరాతి నిక్షేపాలు ఉన్నాయి.
ఇక్కడ ఉన్న ఒకట్రెండు గనుల లీజు అనుమతులూ పూర్తైనా తవ్వకాలు మాత్రం ఇంకా సాగుతూనే ఉన్నాయి. కరన్‌కోట్, ఓగిపూర్ పరిధిలో 20-30 వరకు అక్రమ గనుల తవ్వకాలు, బషీరాబాద్ మండలంలోని ఎక్మయి, జీవంగిలలోనూ నాపరాతి గనుల తవ్వకాలు జరుగుతున్నాయి. అయితే రెవెన్యూ, మైనింగ్ శాఖల అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి. ఎవరైనా ఫిర్యాదు చేస్తే తుతూ మంత్రంగా గనుల వద్దకు వెళ్లి అక్కడున్న చిన్న, చిన్న యంత్రాలను సీజ్ చేసి చేతులు దులుపుకోవడం అలవాటుగా మారిందని స్థానికులు ఆరోపిస్తున్నారు.
గతేడాదిగా ఫిర్యాదులు చేసినా తనిఖీలు చేయడం లేదని మండిపడుతున్నారు. కొందరు వ్యాపారులు పట్టాభూముల్లో గనుల తవ్వకానికి లీజు అనుమతి పొంది.. పక్కనే ఉండే ప్రభుత్వ భూముల్లోనూ తవ్వకాలు జరుపుతున్నారు. వీటిని సర్వే చేయడం రెవెన్యూ అధికారులతో కావడంలేదు. అదేవిధంగా కరెంట్ కనెక్షన్లోనూ మోసం జరుగుతు న్నది. సర్వే నంబరు పేరు ఒకటి ఉంటే, మరో చోట కనెక్షన్ తీసుకొని తవ్వకాలు జరుపుతున్నారనే ఆరోపణలున్నాయి. రెవెన్యూ, విద్యుత్తు, మైన్స్, పోలీసు శాఖల అధికారులు సంయుక్తంగా దాడులు చేసి అక్రమ తవ్వకాలను అరికట్టాలని స్థానికులు కోరుతున్నారు.
జిల్లాలో ఎర్రమట్టి, నాపరాతి, పలుగురాయి, సెల్డ్స్పార్, కంకర, గ్రానైట్, సుద్ద గనుల తవ్వకాలు జరుగుతున్నాయి. అదేవిధంగా పెద్దేముల్, మర్పల్లి, వికారాబాద్, పరిగి మండలాల్లో 610 హెక్టార్ల విస్తీర్ణంలో 40 ఎర్రమట్టి గనులు.. తాండూరు మండలంలో 100 హెక్టార్ల విస్తీర్ణంలో 160 నాపరాతి గనులు ఉన్నాయి. పెద్దేముల్, మర్పల్లి, ధారూరు మండలాల్లో 41 హెక్టార్ల విస్తీర్ణంలో 65 సుద్ద.. వికారాబాద్, దోమ మండలాల్లో 86 హెక్టార్లలో 34 కంకర గనులు ఉన్నాయి.
తాండూరు మండలంలో 12 హెక్టార్లలో 6 గ్రానైట్, దోమ మండలంలో 76 హెక్టార్లలో 6 పలుగురాళ్ల గనులు ఉన్నాయి. అయితే గనులను లీజుకిచ్చే విధానంతో ప్రభుత్వ ఖజానాకు భారీగా నష్టం చేకూరుతున్నది. లీజు ఒక చోట తవ్వకాలు మరోచోట అనే విధంగా జరుగుతున్నది. ఇలా వందల ఎకరాల్లో ఎలాంటి అనుమతుల్లేకుండా అక్రమంగా గనుల తవ్వకాలకు పాల్పడుతున్నారు. జిల్లాలో గనుల తవ్వకాల కోసం గత రెండేండ్లుగా వెయ్యికిపైగా దరఖాస్తులు రాగా అవి పెండింగ్‌లోనే ఉన్నాయి. గనుల లీజు విధానంతో ప్రభుత్వానికి రూ. వందల కోట్లలో నష్టం జరుగుతుందనే ఆలోచనతో ఈ-వేలం విధానానికి గత ప్రభుత్వం ప్రతిపాదించినా ఇప్పటివరకు అమల్లోకి రాలేదు.