పరిగి, అక్టోబర్ 30: స్వయం ఉపాధి కోసం కూలీల కుటుంబ సభ్యులకు డీఆర్డీఏ ఆధ్వర్యంలో ప్రభుత్వం శిక్షణ ఇస్తున్నది. ఉపాధి హామీ కింద వంద రోజులు పని పూర్తి చేసిన కుటుంబ సభ్యులు దీనికి అర్హులు. కూలీల పిల్లలు కూలీలుగానే ఉండకూడదన్నది రాష్ట్ర సర్కార్ సదుద్దేశం. వికారాబాద్ సమీపంలోని శివారెడ్డిపేట్‌లోని ఈడబ్ల్యూఆర్‌సీ, ఎన్ఏసీ హైదరాబాద్, చిల్కూరులోని ఆర్ఎస్ఈటీఐ ద్వారా టైలరింగ్, స్టోర్ కీపర్, ల్యాండ్ సర్వేయర్, హౌజ్ వైరింగ్ తదితర వాటిలో శిక్షణ ఇస్తున్నారు. వికారాబాద్ జిల్లాలో గత ఏడాది 96 మందికి వివిధ రకాల అంశాల్లో శిక్షణ ఇవ్వగా, ఈసారి 200 మందికి శిక్షణ ఇవ్వాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రస్తుతం 72 మందికి శిక్షణ ఇస్తూ రోజుకు రూ.257 చొప్పున కనీస వేతనం చెల్లిస్తుండడం విశేషం.
జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకంలో పనిచేసే కూలీల కుటుంబ సభ్యులు వారి కాళ్లపై వారు నిలబడేలా ప్రభుత్వం ఉన్నతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ప్రత్యేక శిక్షణా తరగతులను నిర్వహిస్తున్నది. కూలీల పిల్లలు స్వయం ఉపాధితో ఆర్థికంగా ఎదుగాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. ఇందులో అర్హులైన నిరుద్యోగులను ఎంపిక చేసి వారికి ప్రత్యేక శిక్షణ ఇప్పిస్తున్నది. వికారాబాద్ జిల్లా పరిధిలో 2018-19 ఆర్థిక సంవత్సరంలో జాతీయ గ్రామీణ ఉపాధిహా మీ పథకం ద్వారా 14,325 మంది కూలీలు వంద రోజుల పని దినాలను పూర్తి చేసుకోగా.. 6,200 కుటుంబాలు శిక్షణ పొందేందుకు అర్హత సాధిం చినట్లు అధికారుల తెలిపారు.
ఈఏడాది 200 మందికి శిక్షణే లక్ష్యంగా..
2018-19 ఆర్థిక సంవత్సరంలో వంద రోజుల పనిదినాలను పూర్తిచేసిన 6,200 కుటుంబాల నుం చి 200 మంది అర్హులను ఎంపిక ఈ ఏడాది వివిధ రకాల శిక్షణ ఇవ్వాలని అధికారులు లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. కాగా ఇప్పటికే 72 మందికి ప్రత్యేక శిక్షణ కొనసాగుతుండగా.. మిగిలిన 128 మంది అర్హులకు వికారాబాద్ సమీపంలోని శివారెడ్డిపేటలో ఉన్న ఈడబ్ల్యూఆర్‌సీ, ఎన్ఏసీ హైదరాబాద్, చిల్కూరులోని ఆర్ఎస్ఈటీఐ ద్వారా వివిధ రకాల శిక్షణ ఇవ్వనున్నారు. కాగా అర్హుల విద్యార్హతలను బట్టి శిక్షణ ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు. ఇప్పటికే ప్రతి గ్రామం నుంచి వంద రోజుల పని దినాలు పూర్తి చేసిన కుటుంబాల నుంచి అర్హుల జాబితాలను ఏపీవోలు సేకరించారు. వారికి శిక్షణ కాలంలో రోజుకు రూ.257 చొప్పున కనీస వేత నం చెల్లించనున్నారు. అర్హత సాధించిన 72 మం దిలో 37 మందికి నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ ఆధ్వర్యంలో శిక్షణ సాగుతున్నది. ఇందులో వారికి స్టోర్ కీపర్, ల్యాండ్ సర్వేయర్, హౌజ్ వైరింగ్పాటు పలు అంశాల్లో శిక్షణ ఇస్తున్నారు.
ఎన్ఏసీ, ఈడబ్ల్యూఆర్‌సీ శివారెడ్డిపేట్లలో 90 రోజులపాటు శిక్షణ పొందిన వారికి వివిధ సంస్థల్లో డీఆర్డీఏ ఆధ్వర్యం లో ఉద్యోగావకాశాలను కూడా కల్పించనున్నారు. అలాగే ధారూరు మండలంలోని నాగసముందర్ గ్రామంలో 35 మంది మహిళలకు కుట్టు శిక్షణా శిబిరం కొనసాగుతున్నది. ఇక్కడ 120 మంది అర్హులుండగా వారిలో శిక్షణ పొందేందుకు 35 మంది మహిళలు మాత్రమే ముందుకు రావడంతో వారికి గ్రామంలోనే శిక్షణ ఇస్తున్నారు. చిల్కూరులోని ఆర్ఎస్ఈటీఐ ద్వారా ప్రతి ఏడాది వికారాబాద్ జిల్లా లో రెండు, రంగారెడ్డి జిల్లాలో రెండు చొప్పున మొ త్తం నాలుగు ప్రాంతాల్లో శిక్షణా తరగతులను నిర్వహిస్తారు. అయితే వికారాబాద్ డీఆర్డీవో కృష్ణన్ ప్రత్యేక శ్రద్ధతో నాగసముందర్లో కుట్టు శిక్షణా శిబి రం కొనసాగుతున్నది. మరింత మంది ముందుకొ స్తే చిల్కూరులోనూ శిక్షణ ఇవ్వనున్నారు. వారం రోజుల క్రితం ఈ శిక్షణ ప్రారంభం కాగా నెల రోజులపాటు కొనసాగునున్నది. అనంతరం టైలరింగ్‌లో పరీక్ష నిర్వహించి మహిళలకు అధికారులు సర్టిఫికెట్లను అందిస్తారు. టైలరింగ్ యూనిట్ల ఏర్పాటు కోసం యువతులకు బ్యాంకు లింకేజీతో రుణ సదుపాయం కూడా కల్పించనున్నారు.
72 మందికి సాగుతున్న శిక్షణ
జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకంలో భాగం గా 2018-19 ఆర్థిక సం వత్సరంలో వంద రోజుల పని దినాలను పూర్తి చేసిన కుటుంబాల్లోని నిరుద్యోగులకు ‘ఉన్నతి’ ద్వారా ప్రత్యేక శిక్షణ ఇప్పిస్తు న్నాం. గతేడాది 96 మందికి శిక్షణ ఇవ్వగా ఈ ఏడాది 200 మందికి శిక్షణ ఇప్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. కాగా ఇప్పటికే 72 మందికి వివిధ అంశాల్లో శిక్షణ సాగుతున్నది. వారికి రోజుకు రూ. 257 చొప్పున చెల్లిస్తున్నాం. మిగిలిన 128 మంది అర్హులను ఎంపిక చేసి వారికి కూడా శిక్షణ ఇస్తాం.
–కృష్ణన్, డీఆర్డీవో, వికారాబాద్ జిల్లా