ఐక్యతను చాటుతున్న లింగారెడ్డిగూడ గ్రామస్తులు
41 ఏండ్లుగా ఒకే మండపంలో వినాయక విగ్రహ ప్రతిష్ఠ
షాద్‌నగర్ రూరల్, ఆగస్టు 28 : చిన, చిన్న గ్రామాల నుంచి పట్టణాల వరకు గల్లీకొక్క గణేశ్ మండపాన్ని ఏర్పాటు చేస్తున్నారు. కానీ ఒక గ్రామంలో మాత్రం 41 ఏండ్లుగా ఒకే మండపంలో కులమతాలకు అతీతంగా గ్రామంలో ఒకే వినాయకుడిని ఏర్పాటు చేసి కలిసికట్టుగా 11 రోజులు వినాయక ఉత్సవాలను నిర్వహించి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు ఫరూఖ్‌నగర్ మండలంలోని లింగారెడ్డిగూడ గ్రామస్తులు. 41 ఏండ్లుగా కులం, మతం, తారతమ్యం లేకుండా గణేశ్ ఉత్సవాలను కలిసికట్టుగా నిర్వహించడం ఇక్కడ సంప్రదాయంగా మారింది. చందాలను వేసుకొని గణపయ్య ఉత్సవాలను అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తారు.
గతంలో కమిటీ అధ్యక్షుడిగా మైనార్టీ నాయకుడు
ప్రతి సంవత్సగ్రామపెద్దలు 15 మంది సభ్యులతో ప్రతి సంవత్సరం కమిటీని ఎన్నుకుంటారు. గతంలో ఏర్పాటు చేసిన కమిటీలో అధ్యక్షుడిగా గ్రామానికి చెందిన గఫూర్ ఎన్నికై గణపయ్య ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. అదేవిధంగా గణపయ్య చేతిలోని లడ్డూ వేలం పాటలో మైనార్టీ యువకుడు మేరాజ్ రూ 1,06,500లకు లడ్డూను దక్కించుకున్నాడు. ప్రతి సంవత్సరం గణేశ్ ఉత్సవాల్లో భాగంగా ఇక్కడ నిర్వహించే అన్నదాన కార్యక్రమాల్లో గ్రామానికి చెందిన మైనార్టీలు పాల్గొంటారు.
మిగులు నగదు దేవాలయ అభివృద్ధికి
గణేశ్ ఉత్సవాలు, లడ్డ్డూ వేలం పాటలో వచ్చిన నగదును ఉత్సవాల కోసం వెచ్చించిన ఖర్చు, తదితర ఉత్సవ లెక్కలను గ్రామపెద్దల ముందు కమిటీ సభ్యులు వివరిస్తారు. మిగులు నగదును దేవాలయ అభివృద్ధ్దికి వినియోగిస్తారు. గత సంవత్సరం శివాజీ యూత్ సభ్యులు లడ్డూ వేలం పాటలో రూ.2 లక్షలకు పైగా చెల్లించి దక్కించుకున్నారు.
భజన మండలికి ప్రత్యేక గుర్తింపు
నియోజక వర్గంలోనే లింగారెడ్డిగూడ భజన మండలికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఎక్కడ భగవతుండి భజన కార్యక్రమాలు ఉంటే అక్కడ లింగారెడ్డిగూడ గ్రామ భజన మండలికి ప్రథమ స్థానం ఇస్తారు. గణేశ్ ఉత్సవాల సందర్భంగా గ్రామంలో అనునిత్యం భజనమండలి ఆధ్వర్యంలో భజన క్యాక్రమాలు నిర్వహిస్తుడటంతో గ్రామంలో భక్తి భావం పెరిగింది. ఏది ఏమైనా లింగారెడ్డిగూడ గ్రామంలో ప్రతి సంవత్సరం ఒకే మండపంలో కలిసికట్టుగా గణేశ్ ఉత్సవాలను నిర్వహిస్తుండటంతో నియోజక వర్గ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.