అలవి కాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అన్నదాతను నిలువునా ముంచుతున్నది. వచ్చి 12 నెలలు దాటిన తర్వాత రైతుబంధు పెట్టుబడి సాయాన్ని అందించగా.. అది కూడా అరకొర పంపిణీ చేయడంతో అర్హులైన వేలాది మంది రైతన్నలు పంటల సాగు కోసం వడ్డీ వ్యాపారుల వద్ద అప్పుల చేయాల్సిన దుస్థితి నెలకొన్నది. అధిక వడ్డీకి తీసుకొచ్చిన రుణాలను చెల్లించలేక కర్షకులు బల వన్మరణాలకు పాల్పడుతున్నారు. ఇలా జిల్లాలో 18 నెలల కాంగ్రెస్ పాలనలో 55 మంది రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతోనే అన్నదాతకు కష్టాలు ప్రారంభమయ్యాయని.. బీఆర్ఎస్ హయాంలోనే వ్యవసాయం పండుగలా సాగి అన్నదాత సంతోషంగా ఉన్నాడని పలువురు పేర్కొంటున్నారు.
వికారాబాద్, మే 23 (నమస్తే తెలంగాణ) : ఆరుగాలం కష్టపడే అన్నదాతను ఆదుకునే వారు లేక.. ఎవుసం చేయలేక మధ్యలోనే కాడి వదిలేస్తున్నాడు. దేశానికి వెన్నుముక అంటూ నాయకులు తమ ప్రసంగాల్లో గొప్పగా చెప్పడం తప్పా.. రైతన్నను పట్టించుకున్న పాపాన పోవడం లేదు. పంటల సాగుకు తీసుకొచ్చిన అప్పులను తీర్చలేక.. కుటుంబాన్ని పోషించే మార్గం కనిపించక చాలామంది అన్నదాతలు తనువు చాలిస్తున్నారు. బీఆర్ఎస్ హయాంలో వ్యవసాయాన్ని బలోపేతం చేసేలా, రైతు ఆర్థికంగా వృద్ధి చెందేలా తోడ్పాటునందిస్తే.. 18 నెలల కిందట అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ వ్యవసాయాన్నే నమ్ముకున్న రైతన్నను నట్టేట ముంచుతున్నది.
అలవి కాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. ఏ ఒక్క హామీని కూడా సక్రమంగా అమలు చేయకపోవడంతో.. ఏడాదిన్నరలో చాలామంది అన్నదాతల ఆత్మహత్యలకు కారణమయ్యింది. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలతో మెజార్టీ ఓటైర్లెన రైతులు ఓటేసి గెలిపిస్తే పవర్లోకి వచ్చిన తర్వాత రేవంత్ ప్రభుత్వం రైతులను మోసం చేస్తూనే ఉన్నది. గతంలో సీజన్‌కు ముందే విత్తనాలు, ఎరువుల నిమిత్తం కేసీఆర్ ప్రభుత్వం పెట్టుబడి సాయాన్ని అందజేస్తే.. 18 నెలల కాంగ్రెస్ పార్టీ ఒక్క సీజన్‌కు కూడా రైతులందరికీ పంటల సాగుకు పెట్టుబడి సాయం అందించకపోవడం శోచనీయం.
ఓ వైపు అతివృష్టి, మరో వైపు అనావృష్టితో అన్నదాత ఆగమవుతున్నా సర్కార్ పట్టించుకోవడం లేదు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నకిలీ విత్తనాలతో రైతులు నష్టపోవడం.. సకాలంలో అందని ఎరువులు, విత్తనాలు, ఎరువుల కోసం ఉమ్మడి రాష్ట్రంలో క్యూలైన్లలో నిరీక్షించిన విధంగా మళ్లీ ఇప్పుడు ఉండాల్సిన దుస్థితి నెలకొన్నది. అదేవిధంగా అరకొర సరఫరా అవుతున్నా విద్యుత్తుతో అన్నదాత అవస్థలు పడుతున్నాడు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతోనే అన్నదాతకు కష్టాలు మొదలయ్యాయి. పదేండ్ల బీఆర్ఎస్ హయాంలో వ్యవసాయం పండుగలా సాగితే.. ప్రస్తుతం దండుగలా మారింది. కేసీఆర్ హయాంలో అప్పుల కోసం చూడని అన్నదాత.. ఇప్పుడు పంటల సాగు కోసం వడ్డీ వ్యాపారుల వద్ద అధిక వడ్డీకి అప్పులు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. బీఆర్ఎస్ హయాంలో సీజన్ ప్రారంభానికి ముందే విత్తనాలు, ఎరువులను కొనేందుకు రైతుబంధు సాయాన్ని పంపిణీ చేయగా.. రేవంత్ సర్కార్ అధికారంలోకి వచ్చిన ఏడాదికి రైతుభరోసాను అమల్లోకి తీసుకొచ్చి.. కొంతమందికే పెట్టుబడి సాయాన్ని అందించి చేతులు దులుపుకొన్నది.
దీంతో అర్హులైన చాలామంది అన్నదాతలు అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాష్ట్రం ఏర్పాటైన తర్వాత రైతును రాజుగా చేసే ఆలోచనతో రైతుల ఆర్థిక పరిస్థితిని మెరుగుపర్చేలా కేసీఆర్ ప్రభుత్వం చర్యలు చేపట్టడంతోపాటు రైతుబంధు పథకాన్ని తీసుకొచ్చింది. సీజన్‌కు ముందే పెట్టుబడి సాయాన్ని అందించడంతో పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో పంట రుణాలు తీసుకునే రైతుల సంఖ్య సగానికిపైగా తగ్గిపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా అమలు చేస్తామంటూ హామీనిచ్చి మోసం చేయడంంతోపాటు బ్యాంకర్లు పంట రుణాలనూ మంజూరు చేయకపోవడంతో అన్నదాతలు వడ్డీ వ్యాపారుల వద్ద అప్పులు చేయాల్సిన దయనీయ పరిస్థితి నెలకొంది.
ఎక్కువ వడ్డీకి తీసుకున్న అప్పు చెల్లించకపోవడంతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. కరెంట్ కోతలు, పెట్టుబడి సాయం, మద్దతు ధర అందకపోవడంతో రైతులు బలవన్మరణాలను పాల్పడుతున్నారు. 18 నెలల కాంగ్రెస్ పాలనలో జిల్లాలో 55 మంది రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. కుటుంబ యజమాని ఆత్మహత్యతో సంబంధిత రైతుల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. దీంతో నేడు పల్లెపల్లెన కేసీఆర్ పాలనను గుర్తు చేసుకుంటున్నారు. అడగడుగునా కష్టాలపాలు చేస్తున్న కాంగ్రెస్‌ను దుమ్మెత్తి పోస్తున్నారు.