గురువారం 02 జూలై 2020
Rajanna-siricilla - Apr 10, 2020 , 02:08:45

నిత్యపూజలు.. నైవేద్యాలు..

నిత్యపూజలు.. నైవేద్యాలు..

  • లాక్‌డౌన్‌ ఉన్నా ఆలయాల్లో  నిరాటంకంగా సేవలు
  • వేములవాడ, ధర్మపురి, కొండగట్టు, గూడెంలో యథావిధి ధూపదీప నైవేద్యాలు
  • జాగ్రత్తలు పాటిస్తున్న అర్చకులు
  • షిఫ్టుల వారీగా సిబ్బంది విధులు

లాక్‌డౌన్‌తో అన్నీ మూతపడ్డా ఆలయాల్లో మాత్రం నిత్య పూజలు సాగుతున్నాయి.. భక్తుల సందడి లేకున్నా అర్చకుల సమక్షంలో ధూపదీప, నైవేద్యాలు యథావిధిగా అందుతున్నాయి.. వేములవాడ శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామి, ధర్మపురి లక్ష్మీనర్సింహస్వామి, కొండగట్టు ఆంజనేయస్వామి, గూడెం సత్యనారాయణస్వామి క్షేత్రాల్లో దేవుళ్లకు సేవలు నిరాటంకంగా ముడుతున్నాయి.. కరోనా నేపథ్యంలో అర్చకులు జాగ్రత్తలు పాటిస్తూ, రోజువారీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. షిఫ్టుల వారీగా సిబ్బంది విధులు నిర్వర్తిస్తూ, ఆలయాలను శుభ్రంగా ఉంచుతున్నారు. 

- వేములవాడ కల్చరల్‌/ధర్మపురి, నమస్తే తెలంగాణ/ మల్యాల/దండెపల్లి

వేములవాడ రాజన్న సన్నిధిలో..

వేములవాడ క్షేత్రాన్ని గతంలో పలుసార్లు మూసివేసిన సందర్భాలున్నాయి. 1950లో ప్లేగు వ్యాధి ప్రబలినప్పుడు 3 నెలల నుంచి 6 నెలల వరకు, 1971లో ఆలయ జీర్ణోద్ధరణ సమయంలో 3 నెలలు, 1992లో కలరా వచ్చినప్పుడు నెలపాటు గుడిని మూసివేసినట్లు వేద పండితులు చెబుతున్నారు. ప్రస్తుతం కరోనా నేపథ్యంలో మార్చి 19 నుంచి  ఆలయాన్ని మూసివేసినా స్థానాచార్యులు అప్పాల భీమాశంకర్‌ ఆధ్వర్యంలో నిత్య పూజలు సాగుతున్నాయి. ఉదయం 4.15 గంటలకు మంగళవాయిద్యాల నడుమ సుప్రభాత సేవతో పూజలు ప్రారంభమవుతాయి. 4.25 గంటలకు గోపూజ, 5 నుంచి 6 గంటల వరకు ప్రాతఃకాల పూజ, 7గంటలకు నిత్యం జరిగే చండీ, రుద్రయాగాలు,10 గంటలకు నిత్యకల్యాణం, 11.30 నుంచి 12.15 వరకు స్వామివారికి మహానివేదన, సాయంత్రం 6 గంటలకు ప్రదోష పూజ, 7 గంటలకు పత్రి పూజ, రాత్రి నిశీ పూజ, అనంతరం జోలపాటతో దేవుడి కైంకర్యాలను నిర్వహిస్తున్నారు. మార్చి 25న ఉగాది పంచాంగ పఠనం, ఏప్రిల్‌ 2న శ్రీరామనవమి సందర్భంగా సీతారామ కల్యాణం, ఏప్రిల్‌ 8న హనుమాన్‌ జయంతి కార్యక్రమాలను ఆలయ అర్చకులతో శాస్ర్తోక్తంగా నిరాడంబరంగా జరిపించారు. 

ధర్మపురి నర్సన్న క్షేత్రంలో.. 

ధర్మపురి లక్ష్మీనర్సింహస్వామి వారి దేవస్థానాన్ని గత నెల 20న మూసేశారు. అప్పటి నుంచి భక్తులను అనుమతించకుండా ఆలయ అర్చకులు, పండితుల మంత్రోచ్ఛారణల మధ్య నిత్యపూజలు, కైంకర్యాలు నిరాడంబరంగా నిర్వహిస్తున్నారు. దేవాలయంలో 45 మంది రెగ్యులర్‌ ఉద్యోగులు, 45 మంది ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు మొత్తం 90 మంది నిత్యం విధులకు హాజరవుతున్నారు. అర్చకులు పూజలు నిర్వహిస్తుండగా.. మిగతా సిబ్బంది ఆలయ ప్రాంగణంలో నిత్యం పరిశుభ్రత పనులు చేపడుతున్నారు. కొందరు సిబ్బంది దేవాలయానికి సంబంధించిన మామిడి తోటలో పనులు చేస్తున్నారు. 

కొండగట్టు అంజన్న ఆలయంలో..

ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామి సన్నిధిలో నిత్యం స్వామి వారికి ఆరాధన, పంచామృతాభిషేకం, మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రత్యేక నివేదన, సాయంత్రం 6.30గంటలకు ఆరాధన, నివేదన కార్యక్రమాలను అంతరాలయంలో అర్చకులు మాత్రమే నిర్వహిస్తున్నారు. సాధారణ పరిస్థితుల్లో 21మంది అర్చకులకు గానూ మూడు షిఫ్టులుగా విభజించి, ఒక్కో షిఫ్టులో ఏడుగురు ఆలయ గర్భగుడిలో, ఏడుగురు ఆలయ వాహన పూజలో, మరో ఏడుగురు షిఫ్టు రొటేషన్‌ చేసేందుకు గానూ వేచి ఉండేవారు. ప్రస్తుత పరిస్థితుల్లో మూడు షిఫ్టులుగా విభజించి, ఒక్కో షిఫ్టులో ఒక్కో అర్చకుడు స్వామి వారికి ధూప దీప, నైవేద్య కార్యక్రమాలు, ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహిస్తున్నారు. లాక్‌డౌన్‌తో ఆలయంలోకి భక్తుల ప్రవేశం నిషేధించడంతో నూతన వాహన పూజ, సత్యనారాయణ వ్రతం, అష్టోత్తర శతనామావళి పూజ, పల్లకీ సేవ, కుంకుమార్చన, ఆంజనేయ స్వామి వారికి అభిషేకం, తదితర ప్రత్యేక కార్యక్రమాలను ఆలయ అధికారులు రద్దు చేశారు. ఏటా లక్ష మందికి పైగా హాజరయ్యే చిన్న జయంత్యుత్సవాలను కూడా ఈ సారి భక్తులు లేకుండా నిరాడంబరంగా జరిపారు. 


logo