Air Passengers | న్యూఢిల్లీ, ఏప్రిల్ 22: దేశంలో విమాన ప్రయాణీకుల రద్దీ సరికొత్త రికార్డుకు చేరింది. ఒక్కరోజే దాదాపు 5 లక్షల మంది ప్యాసింజర్లు నమోదయ్యారు. ఆదివారం దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల మధ్య నడిచిన 6,128 విమాన సర్వీసుల్లో ఏకంగా 4,71,751 మంది ప్రయాణించినట్టు తేలింది. ఈ మేరకు కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ తాజాగా తెలియజేసింది. కరోనాకు ముందున్న రోజుల్లో ప్రయాణీకుల సగటు (3,98,579)తో పోల్చితే ఇది 14 శాతం అధికమని స్పష్టం చేసింది. కాగా, నిరుడు ఏప్రిల్ 21న 5,899 విమాన సర్వీసుల్లో 4,28,389 మంది ప్రయాణించారు. ‘భారతీయ విమానయాన రంగంలో మునుపెన్నడూలేని వృద్ధి నమోదవుతున్నది.
ఆర్థికాభివృద్ధి, ప్రభుత్వ విధానాలు, అందుబాటు ధరల్లో విమాన సేవలందించే సంస్థల విస్తరణ ఇందుకు కలిసొస్తున్నది. పెరుగుతున్న విమాన ప్రయాణీకులే దీనికి నిదర్శనం. రోజురోజుకూ సరికొత్త స్థాయికి ప్యాసింజర్ల సంఖ్య చేరుతున్నది. మున్ముందూ ఈ జోరు కొనసాగగలదని ఆశిస్తున్నాం’ అని ఎక్స్‌లో విమానయాన మంత్రిత్వ శాఖ పోస్ట్ చేసింది. ఈ ఏడాది జనవరి-మార్చిలో దేశీయ విమానయాన సంస్థల సర్వీసుల్లో ప్రయాణించినవారు 391.46 లక్షలుగా ఉన్నట్టు గత వారం భారతీయ విమానయాన నియంత్రిత సంస్థ డీజీసీఏ తెలిపింది. గత ఏడాది ఇదే వ్యవధిలో ప్యాసింజర్లు 375.04 లక్షలుగా ఉన్నారు. దీంతో వార్షిక వృద్ధి 4.38 శాతంగా నమోదైందన్నది. నెలవారీ వృద్ధిరేటూ 3.68 శాతంగా ఉన్నట్టు డీజీసీఏ వెల్లడించింది.