1940-41లో హైదరాబాద్ కేంద్రంగా నిజాం ప్రభుత్వం చేపట్టే ప్రజాహిత కార్యక్రమాలను ప్రజలకు తెలుపాలనే ఉద్దేశంతో హైదరాబాద్ సమాచారం అనే సచిత్ర మాసపత్రికను స్థాపించారు. ఇది నిజాం ప్రభుత్వ ప్రకటనల శాఖ తరఫున వెలువడేది. దీన్ని ప్రభుత్వ సెంట్రల్ ప్రెస్‌లో ప్రచురించేవారు.
-1937లో ఎంఎస్ రాజలింగం, నరసయ్య, రంగారెడ్డి తదితరులు స్నేహలత అనే పత్రికను వరంగల్ నుంచి నడిపారు.
-తరువాత నిజాం కాలేజీలోని తన తోటి విద్యార్థులతో కలిసి ఎంఎస్ రాజలింగం ఆంధ్ర సారస్వత సంచికను తన బంధువు ముదిగొండ బుచ్చయ్య లింగశాస్త్రి సహకారంతో ప్రచురించారు.
-సనాతనవాది అయిన చివుకుల అప్పయ్యశాస్త్రి దివ్యవాణి అనే పత్రికను 1937లో ప్రారంభించారు. సామాజిక, ఆర్థిక వ్యవహారాల్లో అంతగా ఆధునిక భావనలను ప్రచారం చేయకపోయినా, రాజకీయ వ్యవహారాల్లో మాత్రం పురోగామి భావనలను ఈ పత్రిక ప్రచారం చేసింది.
-బొంగులూరి నరసింహశర్మ నిర్వహణలో మాడపాటి హన్మంతరావు సహకారంతో విజయవాడ నుంచి 1938లో ఆంధ్రవాణి పత్రిక ప్రారంభమైంది.
-ఈ పత్రికను స్టేట్ కాంగ్రెస్ సత్యాగ్రహం కారణంగా ఏర్పడిన నిర్బంధ పరిస్థితుల్లో రాజకీయంగా ఒక పత్రిక అవసరాన్ని గుర్తించి ప్రారంభించారు. హైదరాబాద్ రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల్లో పత్రికను స్వేచ్ఛగా నడపలేమనే ఉద్దేశంతో విజయవాడ నుంచి నిర్వహించారు. అయితే వార్తలన్నీ హైదరాబాద్ రాష్ర్టానికి సంబంధించినవే ఉండేవి.
-తెలంగాణలో తొలిసారిగా 1939లో రాచమళ్ల సత్యవతిదేవి సంపాదకత్వంలో తెలుగుతల్లి పేరుతో ఒక మాసపత్రిక వెలువడింది. ఇది అభ్యుదయ భావాలను ప్రోత్సహించిన పత్రికగా పేరుగాంచింది. ఇది స్త్రీల సమస్యలను పరిష్కరించడానికి కంకణం కట్టుకున్న పత్రిక అని మీజాన్ పత్రిక వర్ణించింది.
-1939, ఫిబ్రవరిలో శైవమత ప్రచారం కోసం చిదిరేమఠం వీరభద్రశర్మ విభూతి అనే ధార్మిక సాహిత్య మాసపత్రికను నెలకొల్పాడు.
-1940లో అడుసుమిల్లి వెంకట దత్తాత్రేయశర్మ ఆంధ్రశ్రీ అనే సాహిత్య వార్షిక పత్రికను స్థాపించి సంపాదకులుగా పనిచేశారు.
-1940-41లో హైదరాబాద్ కేంద్రంగా నిజాం ప్రభుత్వం చేపట్టే ప్రజాహిత కార్యక్రమాలను ప్రజలకు తెలుపాలనే ఉద్దేశంతో హైదరాబాద్ సమాచార్ అనే సచిత్ర మాసపత్రికను స్థాపించారు. ఇది నిజాం ప్రభుత్వ ప్రకటనల శాఖ తరఫున వెలువడేది. దీన్ని ప్రభుత్వ సెంట్రల్ ప్రెస్‌లో ప్రచురించేవారు.
-క్రైస్తవ మత ప్రచారం కోసం మహబూబ్‌నగర్ మిషన్ ప్రెస్ నుంచి 1940లో మెన్నోనైట్ వర్తమాని అనే మాసపత్రిక వెలువడింది.
-ఇదేకాలంలో ఖాజా అబ్దుల్ గఫార్ సంపాదకత్వంలో పయాం అనే ఉర్దూ దినపత్రిక వెలువడింది. 1941లో సందేశం అనే పేరుతో తెలుగు దినపత్రికను స్థాపించారు.
-ఉర్దూలో వచ్చిన విప్లవాత్మక పత్రిక రయ్యత్. దీన్ని 1927లో మందుముల నర్సింగరావు ప్రారంభించారు. నిజాం ప్రభుత్వాన్నే కాకుండా దాన్ని పొగిడే పత్రికలను కూడా రయ్యత్ విమర్శించేది.
-జాతీయవాద జర్నలిస్టు షోయబుల్లాఖాన్ ఇమ్రోజ్ అనే పత్రికను ప్రారంభించారు. దీని తొలి ప్రతి 1947, నవంబర్ 15న మార్కెట్లోకి వచ్చింది.
-ఇందులో ఆయన హైదరాబాద్ రాజ్యం భారతదేశంలో విలీనం కావాలంటూ సంపాదకీయాలు రాసేవారు.
-ఇదేకాలంలో వెలువడిన ఉర్దూ పత్రిక సుబే దక్కన్ నిజాం ప్రభుత్వాన్ని ప్రశంసిస్తూ వార్తలు ప్రచురించి రాజుల అభిమానం పొందింది.
-1941, ఫిబ్రవరిలో కమ్యూనిస్టు నాయకుడు గుండవరం హనుమంతరావు సంపాదకత్వంలో ఆంధ్రకేసరి అనే మాసపత్రిక వెలువడింది.
-1941లో కమ్యూనిస్టులు ప్రారంభించిన వార పత్రిక ప్రజాశక్తి. 1945లో ఇది దినపత్రికగా రూపొందింది. 1948 తరువాత కొంతకాలం అంతరాయమేర్పడి, మళ్లీ 1951 నుంచి మద్దుకూరి చంద్రశేఖర్‌రావు సంపాదకత్వంలో విశాలాంధ్రగా ప్రారంభమైంది.
-1941లో ఆయుర్వేద కళ అనే మాసపత్రిక ప్రారంభమైంది. ఆయుర్వేద వైద్యానికి ప్రచారం కల్పించడం కోసం వేదాల తిరుమల వేంకట రామానుజ స్వామి సంపాదకులుగా వెలువడింది. ఇందులో వైద్యులు, సామాన్య ప్రజలకు అవసరమైన సమాచారం ప్రచురించేవారు.
-1941లో దారశథి వెంకటాచార్యులు దాశరథి అనే ఒక ధార్మిక మాసపత్రికను ప్రచురించారు. వైష్ణవ మత ఉద్ధరణే ప్రధాన ఉద్దేశంగా ఈ పత్రిక వెలువడింది.
-సంప్రదాయ పరిరక్షణకోసం పంచాంగకర్త చిల్లా సుబ్బరాయ సిద్ధాంతి సంపాదకత్వంలో తరణి అనే మాసపత్రిక 1942లో ప్రారంభమైంది. ఇందులో వార్తలు, వ్యంగ్య నాటికలు, గేయాలు, విజ్ఞానశాస్త్ర చర్చలు, సారస్వత వ్యాసాలను ప్రచురించేవారు.
-అయితే మొదటి దినపత్రిక పేరు విషయంలో పరిశోధకులు భిన్నాభిప్రాయాలు వెలిబుచ్చారు. కొందరు పరిశోధకులు సందేశం పత్రికను తెలంగాణలో వచ్చిన మొదటి దినపత్రిక అని రాస్తున్నప్పటికీ తగిన ఆధారాలు లేవు. అయితే, తెలంగాణ నుంచి వెలువడ్డ తొలి దినపత్రికగా 1942లో వెలువడిన తెలంగాణను ప్రకటించడానికి కొన్ని ఆధారాలు ఉన్నాయి.
-మీజాన్ దినపత్రికను 1944లో తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్ భాషల్లో కలకత్తాకు చెందిన గులాం అల్లావుద్దీన్ ప్రారంభించారు.
-దేశంలోనే మొదటిసారిగా మూడు భాషల్లో ప్రారంభించిన ఈ పత్రిక మూడు భాషల్లో మూడు విధానాలు అవలంబించింది.
-ఇంగ్లిష్ పత్రిక నిజాంకు అనుకూలంగా ఉండేది. ఉర్దూ పత్రిక మజ్లిస్, ముస్లింలీగ్, ఖాసీంరజ్వీ విధానాలను సమర్థించేది. తెలుగు పత్రిక కమ్యూనిస్టులను, ఇతర అభ్యుదయ వాదులను సమర్థించేది.
-మీజాన్ అంటే అరబిక్ భాషలో తర్రాజు (త్రాసు) అని అర్థం. జనరల్ ఎడిటర్‌గా పత్రికాధిపతి గులాం అల్లావుద్దీన్ ఉండేవారు. వ్యాపార మెలకువలు తెలిసిన ఈయన పత్రికల ద్వారా పలుకుబడినే కాకుండా డబ్బు కూడా సంపాదించారు.