బ్రిటిష్ పాలనలో భారతీయులకు జరుగుతున్న అన్యాయాలను గుర్తించిన నాటి మేధావులు ఎవరికివారు అనే రాజకీయ, ప్రజా సంస్థలను స్థాపించి పోరాటాలు సాగించారు. 1885లో భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పాటుతో మేధావుల్లో సంఘటిత భావన ఏర్పడి ప్రజాపోరాటాలు తీవ్రమయ్యాయి. ఈ పరిణామాలే తదనంతరం దేశానికి స్వాతంత్య్రం తెచ్చిపెట్టాయి.
-ప్రారంభంలో జాతీయ కాంగ్రెస్ పూర్తిగా మితవాద సంస్థ. దాని లక్ష్యాలు మితమైనవి. నాయకులు మితవాదులు. వారు అనుసరించిన పద్ధతులు మితవాద పద్ధతులు. ఆనాటి కాంగ్రెస్ లక్ష్యాల్లో ముఖ్యమైనవి దేశ ప్రజల్లో స్నేహం, అన్యోన్యం పెంచడం, ప్రజల్లో జాతి, కుల, మత ప్రాంతీయ విభేదాలను తొలగించడం, ప్రజాభిప్రాయాలను సేకరించి ప్రభుత్వానికి తెలపడం.
-1885-1947 వరకు మూడు దశల్లో భారత జాతీయోద్యమం జరిగింది.
ఎ. 1885-1905 వరకు – మితవాద దశ
బి. 1905-1919 వరకు- అతివాదదశ
సి. 1919-1947 వరకు- గాంధీయుగం
-ఈ కాలంలో మితవాదులు భారతపాలనా యంత్రాంగంలో అంచెల వారి సంస్కరణలు ప్రవేశపెట్టాలని అర్థించారు.
-మితవాద నాయకుల్లో సురేంద్రనాథ్ బెనర్జీ, దాదాభాయ్ నౌరోజీ, బద్రుద్దీన్ త్యాబ్జీ, ఫిరోజ్‌షా మెహతా, గోపాలకృష్ణ గోఖలే, ఆనందాచార్యులు ముఖ్యులు.
-ఈ కాలంలో జాతీయ కాంగ్రెస్ తమ కోరికలను తీర్మానాల ద్వారా ప్రభుత్వానికి తెలిపింది. ఉద్యోగుల వద్దకు అర్జీలతో తమ ప్రతినిధివర్గాలను పంపేవారు. ఇవన్నీ వినయపూర్వంగా ఉండేవి. వారి కార్యక్రమాలు కేవలం ప్రార్థన, విజ్ఞప్తి, నిరసనలకు పరిమితమయ్యాయి.
-ప్రభుత్వం వీరి విన్నపాలను పెద్దగా పట్టించుకునేది కాదు. ప్రతి ఏడాది డిసెంబర్ చివరి వారంలో ఏదో ఒక పెద్ద నగరంలో మూడురోజుల పాటు జరిగే వార్షిక సమావేశాల్లో దేశానికి సంబంధించిన అనేక విషయాలు చర్చించి తీర్మానాలు చేసేవారు. అయితే కాంగ్రెస్ వార్షిక సమావేశాలకు హాజరయ్యేవారి సంఖ్య క్రమంగా పెరుగుతూ ఉండేది.
-మితవాద నాయకులందరికీ బ్రిటిష్‌వారి ప్రజాస్వామ్య వ్యవస్థ మీద, వారి ప్రభుత్వం పట్ల సదభిప్రాయం ఉండేది. వారు దేశ ప్రజలకు బ్రిటిష్ ప్రభుత్వం నుంచి న్యాయపరమైన హక్కులు కోరేవారేకాని స్వరాజ్యాన్ని కోరలేదు.
-తమ ప్రసంగాలు, రచనల ద్వారా దేశ ప్రజల్లో రాజకీయ చైతన్యం కలిగించడంలో కొంతవరకు విజయం సాధించారు. ముఖ్యంగా మధ్యతరగతి ప్రజల్లో ప్రాంతీయ, జాతి, మత, కుల సంకుచిత భావాలను తొలగించి జాతీయ, ప్రాంతీయ భావాలను వ్యాపింపజేశారు. అందుకే ఈ మితవాదకాలాన్ని జాతీయోద్యమంలో బీజదశగా వర్ణిస్తారు.
-1892లో ప్రభుత్వం బ్రిటిష్ ఇండియా కౌన్సిల్ చట్టాన్ని ప్రవేశపెట్టి కేంద్ర, ప్రాంతీయ శాసనమండలిలో సభ్యుల సంఖ్యను పెంచింది. మితవాద కాంగ్రెస్ నాయకులు రాజ్యాంగ సంస్కరణల కోసం చేసిన ప్రయత్నాలవల్ల ఆ చట్టాన్ని బ్రిటిష్ ప్రభుత్వం అమలుపరిచింది.
-ఈ చట్టంవల్ల కేంద్ర, రాష్ట్ర శాసనసభల్లో సభ్యుల సంఖ్య పెరిగింది. బడ్జెట్‌ను చర్చించే హక్కు, కొన్ని విషయాల గురించి ప్రశ్నలడిగే హక్కులు సభ్యులకు ఈ చట్టంవల్ల లభించాయి.
-1905 వరకు జాతీయవాదులు ప్రతినిధివర్గాలను తీసుకెళ్లి, విజ్ఞాపన పత్రాలను సమర్పించి ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేసి తమ కోర్కెలు సహజమైనవని మెప్పించడానికి ప్రయత్నించారు. ఈ పద్ధతిని రాజకీయ యాచకత్వం అని కొందరు ఎగతాళి చేశారు.
-ఈ కాలంలో వీరు చట్టబద్ధమైన పద్ధతులను అనుసరించి, సంస్కరణలను సాధించడానికి ప్రయత్నించారు.