శనివారం 23 జనవరి 2021
Peddapalli - Nov 26, 2020 , 00:37:35

యాక్సిడెంట్‌ చేసి ఆగకుండా వెళ్లి..

యాక్సిడెంట్‌ చేసి ఆగకుండా వెళ్లి..

  • అతివేగంతో మరో రెండు ప్రమాదాలు 
  •  చివరగా గోడను ఢీకొని బొలెరో వాహనం డ్రైవర్‌ మృతి
  • ధర్మారం మండలం ఎర్రగుంటపల్లిలో ఘటన
  • మృతుడు ఆర్జీ-2లో కాంట్రాక్ట్‌ కార్మికుడు

ఎర్రగుంటపల్లి శివారులో ఆంజనేయ స్వామి ఆలయంలోకి దూసుకెళ్లిన వాహనంపై సుద్దాల క్రాంతి

ధర్మారం: యాక్సిడెంట్‌ చేసి ఆగకుండా వెళ్తూ మరో రెండు ప్రమాదాలకూ కారణమై చివరకు తన బోలెరో వాహనంతో గోడను ఢీకొట్టి డ్రైవర్‌ మృతిచెందిన సంఘటన ధర్మారం మండలం ఎర్రగుంటపల్లిలో జరిగింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. రామగుండం ఆర్జీ-2 పరిధిలోని ఓసీపీ-3లో కాంట్రాక్ట్‌ పద్ధతిలో బొలేరో వాహనం డ్రైవర్‌గా సుద్దాల క్రాంతి 12 ఏళ్లుగా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో బుధవారం కరీంనగర్‌ నుంచి పెద్దపల్లి జిల్లా ధర్మారం వైపు వస్తున్నాడు. అతివేగంగా వాహనం నడుపుతూ మార్గం మధ్యలో చొప్పదండి మండలం రుక్మాపూర్‌ వద్ద లక్కరుసు కనకవ్వ (60) అనే వృద్ధురాలిని ఢీకొట్టాడు. ఆమె రెండు కాళ్లు విరగడంతో స్థానికులు దవాఖానకు తరలించారు. అయితే ఆమెను ఢీకొట్టిన తర్వాత ఆగకుండా వచ్చాడు. ఈ క్రమంలో ఆర్నకొండ వద్ద రోడ్డు పక్కన నిలిపిన ఓ కారును స్వల్పంగా ఢీకొట్టాడు. సమాచారం మేరకు చొప్పదండి పోలీసులు వాహనాన్ని వెంబడించినా చిక్కలేదు. అప్పటికే రెండు ప్రమాదాలు జరుగడంతో ఆందోళన చెందిన డ్రైవర్‌ వాహన వేగాన్ని మరింత పెంచాడు. ఈ క్రమంలో ధర్మారం మండలం ఎర్రగుంటపల్లి వద్ద రోడ్డుపై వెళ్తున్న బైక్‌ను ఢీకొట్టగా, అదే గ్రామానికి చెందిన సముద్రాల సతీశ్‌, ధర్మారం మండల కేంద్రానికి చెందిన తోకల సంజీవ్‌ తీవ్రంగా గాయపడ్డారు. 108 అంబులెన్స్‌లో దవాఖానకు తరలించారు. కాగా, ఇక్కడ బైక్‌ను ఢీకొట్టిన వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కన ఓ ఇంటి ప్రహరీని ఢీకొట్టి పక్కన ఉన్న అంజన్న ఆలయం వైపు చొచ్చుకొని వెళ్లింది. దీంతో వాహనం అద్దాలు ధ్వంసమై డ్రైవర్‌ క్రాంతి ఎగిరి వచ్చి వాహనం బ్యానట్‌పై పడి అక్కడిక క్కడే మృతి చెందినట్లు తెలిపారు. ధర్మారం, చొ ప్పదండి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం కరీంనగర్‌కు తరలించినట్లు హెచ్‌సీ అంజయ్య తెలిపారు. కాగా, గోదావరిఖని ప్రాంతానికి చెందిన క్రాంతి ధర్మారం వైపు ఎందుకు వచ్చాడో తెలిసిరాలేదు. క్రాంతికి భార్య లత, ఇద్దరు కొడుకులు ఉన్నారు.logo