‘వానిదంతా ఒజ్జల పుచ్చకాయ యవ్వారం! చెప్పుడే కానీ.. చేసుడుండదు’ అంటుంటారు. ఈ పదబంధంలో ‘ఒజ్జల పుచ్చకాయ’ అనేది పాతకాలపు మాట. జానపదుల స్వచ్ఛమైన పలుకుబడి. ఇందులో ‘ఒజ్జ’ అంటే గురువు. ఈ పదబంధం ఎలా పుట్టిందంటే.. పూర్వం ఓ గురువుగారు శిష్యులకు ఉపదేశం చేస్తూ.. ‘పుచ్చకాయ తినడం మహాపాపం. పొరపాటున తిన్నా.. కావాలని తిన్నా.. నేరుగా నరకానికి పోతారు’ అంటూ ఉపన్యాసం ఇచ్చారట. ఆ తర్వాత ఓ శిష్యుడిని పుచ్చకాయ తెమ్మని పురమాయించారట. అతగాడు తెల్లబోయి చూస్తూ.. ‘గురువుగారూ.. పుచ్చకాయ తింటే మహాపాపం అని మీరే అన్నారు.
ఇప్పుడేమో..’ అని గొణుగుతుంటే.. ‘మీరు తినగూడదు అన్నానే కానీ.. నేను తినకూడదని అనలేదే’ అంటూ సమాధానం ఇవ్వడంతో కిక్కురుమనకుండా పుచ్చకాయ కోసం వెళ్లాడు శిష్య పరమాణువు. ఇప్పటికీ ఎంతోమంది తాము చెప్పే నీతులు ఇతరులకే కానీ.. తాము పాటించడానికి కాదన్నట్లు వ్యవహరిస్తుంటారు. తాము కోరుకునేవి, ఇతరులకు నిషిద్ధమైనవీ ‘ఒజ్జల పుచ్చకాయలు’గా ప్రాచుర్యం పొందాయి.