సావిత్రీబాయి ఫూలే… కొత్తగా పరిచయం అక్కర్లేని పేరు. దేశంలోని ప్రముఖ సంఘ సంస్కర్తల్లో ఆమె ఒకరు. ఆధునిక భారతదేశంలో తొలి ఉపాధ్యాయినిగా పేరు గడించిన వనిత. ఆ మహనీయురాలి జయంతి రోజున కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఘనంగా నివాళులర్పిస్తాయి. అయితే, సావిత్రీబాయికి అండదండలు అందించిన ఫాతిమా షేక్ గురించి ఎక్కడా మనకు కానరాదు. 19వ శతాబ్దంలోనే బాలికల విద్య కోసం కృషిచేసి, ఆ ఉద్యమానికి పూర్తి మద్దతిచ్చిన ఫాతిమా షేక్ గురించి, ఆమె జయంతి సందర్భంగా తెలుసుకుందాం.
1848లో పూణాలోని ఓ దళితవాడలో మహాత్మా జ్యోతిబాఫూలే బాలికల కోసం పాఠశాలను ప్రారంభించారు. ఆ పాఠశాలలో ముందుగా తన భార్య సావిత్రీబాయి ఫూలేకు చదవడం, రాయడం నేర్పించారు. కోడలు చదువుకోవడం జ్యోతిబా తండ్రికి నచ్చలేదు. బాలికలకు, స్త్రీలకు చదువు చెప్పడం మానుకోవాలని, లేదంటే ఇంటినుంచి వెళ్లిపోవాలని ఆయన కొడుకును హెచ్చరించారు. గత్యంతరం లేక కట్టుబట్టలతో దంపతులిద్దరూ ఇంటిని వదిలిపెట్టి బయటకు వచ్చారు. జ్యోతిబా మిత్రుడు ఉస్మాన్ షేఖ్.. పూనాలోని గంజ్పేట్లో ఉండేవారు. ఆయన ఆ దంపతులిద్దరికీ తన ఇంటిలో ఆశ్రయం ఇచ్చారు. స్త్రీ విద్య ప్రాధాన్యాన్ని అర్థం చేసుకున్న ఉస్మాన్ షేక్ తన ఇంటిలోనే పాఠశాలను ప్రారంభించటానికి జ్యోతిబా దంపతులకు అనుమతి ఇచ్చారు. తన చెల్లెలు ఫాతిమా షేక్‌ను కూడా చదువుకోవాల్సిందిగా అదే పాఠశాలలో చేర్పించారు. ఫాతిమా షేక్ రోజంతా సావిత్రీబాయి సాంగత్యంలో ఉంటూ చాలా తొం దరగానే చదవడం, రాయడం నేర్చుకున్నారు.
ఆ కాలంలో బాలికల కోసం పాఠశాలను నడపడం అంటే ప్రాణాలను పణంగా పెట్టడమే. దళితులకు, బహుజనులకు అందులోనూ బాలికలకు చదువు చెప్పడం ఆ కాలంలో పాపంగా భావించేవారు. కేవలం కొన్ని అగ్రవర్ణాలకే చదువుకొనే హక్కు ఉండేది. ఈ అస్పృశ్యతా అడ్డుగోడలను కూల్చినందుకు ఫాతిమా షేక్ సామాజిక శతృత్వాన్ని సైతం కొనితెచ్చుకోవాల్సి వచ్చింది. అయినా ఆమె బెదరలేదు. చదువుకు కులమతాలు, లింగబేధాలు అడ్డుకావని ఆమె నిరూపించారు. ఉస్మాన్ షేక్ ఇంట్లో ప్రారంభమైన పాఠశాలకు విద్యార్థుల ఆదరణ పెరగటంతో మరిన్ని పాఠశాలలను చుట్టుపక్కల ప్రాంతాల్లో నెలకొల్పారు. వాటిల్లో సావిత్రీబాయి, ఫాతిమా షేక్.. ఇద్దరూ కలిసి చదువు చెప్పేవారు. అనేక అవాంతరాలను ఎదుర్కొంటూ వాళ్లు ఆ పని చేసేవారు. సమాజం నుం చి ఎన్నో వెక్కిరింతలు, అవహేళనలు ఎదురయ్యేవి. కొంద రు దుర్మార్గులు వారిపై రాళ్లు వేసేవారు. మహిళలకు చదువులెందుకు అనే ధోరణి ఆ కాలంలో ఉండేది. అందులోనూ అట్టడుగు వర్గాల ప్రజలు చదువుకోవడానికి వీలులేని దురాచారం. దీంతో సావిత్రి, ఫాతిమా ఎన్నో అవమానాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. పాఠశాలకు వెళ్తుంటే వారిపై దుమ్మెత్తిపోసేవారు. పేడ నీళ్లు చల్లేవారు. దుస్తులన్నీ తడిచిపోయి, దుర్గంధభరితమయ్యేవి. అయినప్పటికీ, భవిష్యత్ తరాల కోసం వాళ్లు ఆ అవమానాలను, దాడులను ఎంతో సహనంతో భరించారు. అమ్మాయి చదువు అవనికి వెలుగు అని చాటిచెప్పారు. ఒక అమ్మాయి చదువుకుంటే ఆ కుటుం బం మొత్తం చదువుకున్నట్లన్న నానుడిని నిజం చేసి చూపించారు.
ఇంటింటికీ వెళ్లి బాలికా విద్య ప్రాముఖ్యం గురించి చెప్పేవారు. అమ్మాయిలను స్కూలుకు పంపేలా తల్లిదండ్రులకు నచ్చజెప్పేవారు. వారిరువురూ చేసిన శ్రమ వృథా కాలేదు. ప్రజల ఆలోచనా విధానం మారింది. దళిత, బహుజన బాలికలతోపాటు, ముస్లిం అమ్మాయిలు కూడా పాఠశాలకు ఎం తో ఉత్సాహంగా వచ్చి చదువుకునేవారు. ఈ విధంగా ఫాతి మా షేక్ ఈ దేశ తొలి ముస్లిం మహిళా ఉపాధ్యాయురాల య్యారు. దళిత, బహుజన-ముస్లింల ఐక్యతకు శతాబ్దాల చరిత్ర ఉన్నదని చెప్పటానికి సావిత్రి-ఫాతిమా స్నేహమే గొప్ప నిదర్శనం.
బాలికల విద్య కోసం కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో పథకాలు ప్రవేశపెడుతున్నాయి. దేశం అన్నిరంగాల్లో పురోగమించాలంటే మహిళలు చదువుకోవటం ఎంతో ముఖ్యమని గ్రహించిన ప్రభుత్వాలు మహిళా విద్యకు పెద్దపీట వేస్తున్నాయి. కానీ, సుమారు 170 ఏండ్ల కిందట బాలికల విద్య కోసం పరిశ్రమించిన ఫాతిమా షేక్ గురించి ఎక్కడా చర్చ జరగకపోవడం విచారకరం. అణగారిన వర్గాలు, స్త్రీలు చదువుకోవడానికి పాఠశాలలు లేని ఆ కాలంలో 1848లో స్కూలును ప్రారంభించేందుకు ఫూలే దంపతులకు తోడ్పడిన అన్నాచెల్లెళ్లు ఉస్మాన్-ఫాతిమాషేక్ గురించి కూడా విస్తృత ప్రచారం జరగాలి. సావిత్రీబాయి ఫూలేకు లభించిన ప్రాచుర్యం ఫాతి మా షేక్‌కు కూడా లభించాలి. ఆమె జీవిత విశేషాలను పాఠ్యాంశాలుగా చేర్చాలి. ఆమె జీవితంపై, పోరాటంపై పరిశోధనలు జరగాలి. అప్పుడే ఆమెకు సరైన నివాళి అర్పించినట్లు అవుతుంది
(రేపు ‘ఫాతిమా షేక్’ జయంతి)
-ముహమ్మద్ ముజాహిద్ , 96406 22076