ప్రతిష్ఠాత్మక ఉస్మానియా విశ్వవిద్యాలయం 105వ వ్యవస్థాపక సంవత్సరం ఇది. బ్రిటిష్ వాళ్లు మొదటి దశలో నెలకొల్పిన వర్సిటీలతో సమానంగా హైదరాబాద్ పాలకులు ఎంతో బాధ్యతగా ఏర్పాటుచేసిన చారిత్రక విద్యాలయం ఓయూ. ఈ వర్సిటీ ఒక్క తెలంగాణకే కాదు, హైదరాబాద్ రాష్ర్టానికి, దక్కన్ ప్రాంతానికి, దేశానికే సేవలందించిన సంస్థ. జనవరి 3, 4 తేదీల్లో ఈ విశ్వవిద్యాలయం ‘గ్లోబల్ అలుమ్ని మీట్’ పేరుతో విశ్వవ్యాప్తంగా ఉన్న తమ పూర్వవిద్యార్థుల సమాగమం నిర్వహించింది. ఇందులో రెండు అంశాలు కనిపించాయి. ఒకటి, తమ గతకాలపు ఘనతను తమ పూర్వవిద్యార్థులు సాధించిన విజయాలతో ప్రపంచానికి చాటడం. రెండోది భవిష్యత్ కార్యాచరణలో వారిని భాగస్వాములు చేసి పునర్నిర్మాణ ప్రణాళిక రూపొందించుకోవడం. అందులో ఓయూ సంపూర్ణంగా విజయవంతమైందనే చెప్పాలి. అందుకు వర్సిటీ వీసీ, రిజిస్ట్రార్, ఇతర అధికారులను అభినందించాలి.
ఉస్మానియా యూనివర్సిటీలో రెండురోజుల పాటు జరిగిన ‘గ్లోబల్ అలుమ్ని మీట్’ ఉత్సవాలు వర్సిటీకి కొత్త కళను తీసుకువచ్చాయి. ప్రముఖుల ప్రసంగాలు, చర్చాగోష్టులు, వితరణలకు తోడు సవాళ్లు, సమస్యలను కూడా ఈ వేడుకలు వేదికమీదికి తెచ్చాయి. ఒక్క ఓయూకే పరిమితం కాకుండా మొత్తం తెలంగాణ ఉన్నత విద్యారంగం మీద ఈ సమాగమం సమాలోచన చేసింది. నిజానికి తెలంగాణ ఏర్పాటైన తర్వాత ఉన్నత విద్యారంగం స్థూలంగా గణనీయమైన విజయాలు సాధించింది. ఉన్నత విద్య వికాసానికి కొలమానంగా భావించే స్థూల నమోదు నిష్పత్తిలో 2021నాటికి 36 శాతం నమోదు చేసుకొని జాతీయ సగటు 26 కంటే 10 పాయింట్లు ముందుకువెళ్లింది. దేశంలో అత్యంత ప్రాధాన్యం కలిగిన మెడికల్, బయో మెడికల్, ఇంజినీరింగ్, టెక్నాలజీ రంగాల్లో అనూహ్యమైన విజయాలు సాధించింది. మరీ ముఖ్యంగా మహిళల నమోదు విషయంలో విప్లవాత్మక ప్రగతి కనిపిస్తున్నది. కొన్ని వర్సిటీల క్యాంపస్‌లలో మహిళల నిష్పత్తి 70 దాటింది. ఇవన్నీ ఆనందించే విషయాలే అయినా వర్సిటీల్లో అధ్యాపకుల అందుబాటు విషయంలో ఆందోళన వ్యక్తమవుతున్నది. రెగ్యులర్ అధ్యాపకుల నియామకం దాదాపుగా 20 ఏండ్లుగా లేకపోవడంతో దాదాపు మూడింట రెండు వంతుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అనేక శాఖల్లో ఒక్కరూ లేకపోవడంతో, బోధనా పరిశోధన పూర్తిగా కుంటుబడిపోయింది. తాత్కాలిక అధ్యాపకులతో కాలం వెళ్లదీసే పరిస్థితి దాదాపుగా అన్ని వర్సిటీల్లో ఉండటం ఆందోళనకు కారణమవుతున్నది.
ప్రామాణిక పద్ధతి లేకపోవడం
నిజానికి అధ్యాపకుల భర్తీలో జాప్యం తెలంగాణ ప్రభుత్వానిది కాదు. జాప్యానికి కారణాలేమిటన్న విషయాలను బహిరంగపరచకపోవడం వల్ల రాష్ట్ర ప్రభుత్వాన్ని కొందరు బదనాం చేస్తున్నారు. అధ్యాపక నియామకాలకు ప్రభుత్వం వ్యతిరేకం కాదు. ఖాళీలను భర్తీ చేయడమే కాదు, అనేక రంగాల్లో కొత్త పోస్టులను కూడా వేలాదిగా సృష్టించిన ప్రభుత్వం వర్సిటీల నియామకాల విషయంలో కేంద్రం, యూజీసీ చేసిన పొరపాట్లకు బాధ్యత వహిస్తున్నది. రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ప్రభుత్వం ప్రాధాన్య క్రమంలో అనేకరంగాల్లో నియామకాలను చేపట్టింది. ఇప్పటికే కనీసం లక్షా నలభై వేల నియామకాలు పూర్తయినట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఇటీవల దాదాపు 60 వేల కొత్త ఉద్యోగాల నియామకానికి అనుమతినిచ్చింది. ఇప్పటికిప్పుడు ప్రతిష్ఠాత్మకమైన గ్రూప్-1 మొదలు, గ్రూప్-2, 3, 4తో పాటు పోలీసు, కళాశాలల లెక్చరర్ వంటి అనేక రంగాల్లో నియామకాల ప్రక్రియ ఏకకాలంలో విడివిడిగా సాగుతున్నది. కానీ వర్సిటీల ఖాళీలు మాత్రం నియామకానికి నోచుకోవడం లేదు. ఇది సహజంగానే విద్యావేత్తలు, విద్యార్థులను కలవరానికి గురిచేయడంతో పాటు నిరుద్యోగుల్లో నైరాశ్యానికి కారణమవుతున్నది. అన్నిటికంటే మించి విద్యా ప్రమాణాల మీద ప్రభావం చూపుతున్నది. దీనికి కారణమెవరు? ఎవరైనా సహజంగానే ప్రభుత్వాన్ని వేలెత్తి చూపిస్తారు. ప్రభుత్వం మాత్రం ఎప్పటికప్పుడు తమ ప్రయత్నం తాము చేస్తున్నట్టు చెప్తున్నది.
అందుకు సాక్ష్యంగా వర్సిటీ అధ్యాపకుల నియామకం కోసం ప్రత్యేక బోర్డు ఏర్పాటుచేస్తూ ఆమోదించిన బిల్లును చూపెడుతున్నది. మూడు నెలల కిందటే దీన్ని గవర్నర్ ఆమోదం కోసం పంపించారు. దానిపై అధ్యయనం సాగుతున్న దరిమిలా అది అక్కడే పెండింగ్‌లో ఉన్నది. ఇదొక రాజకీయ సాకుగా కనిపించవచ్చు. కానీ వర్సిటీ నియామకాల జాప్యం వెనుక లోతుగా వెతికితే తప్ప కనిపించని అనేక చిక్కుముడులున్నాయి. అందులో మొదటిది నియామక విధానం. ఈ దేశంలో అన్ని నియామకాల్లోకి అత్యంత అస్పష్టమైన విధానం అధ్యాపకులది. ఈ దేశంలో ఒక ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుల నియామకానికి అనేక అర్హతలు, పరీక్షలు పద్ధతులున్నాయి. కానీ, పేరుకు పెద్ద ఉద్యోగమైన వర్సిటీ ప్రొఫెసర్ల ఎంపికకు ఒక ప్రామాణికమైన పద్ధతి లేకపోవడం సమస్యలకు మూలం అవుతున్నది. సాదా సీదా బడిపంతులు కావాలంటే కనీస డిగ్రీ అర్హతతో పాటు బోధనకు సంబంధించి ప్రత్యేక శిక్షణ పొంది ఉండాలి. బీఎడ్, డీఎడ్ వంటి డిగ్రీలుండాలి, ఆ తర్వాత జాతీయ, రాష్ట్రస్థాయిలో టెట్ పాసై ఉండాలి. ఇందులో తాము బోధించే విషయంతో పాటు, బోధనా పద్ధతుల మీద పరిజ్ఞానాన్ని, విద్యా విషయాల మీద అవగాహననూ పరీక్షిస్తారు.
ఆ అర్హత ఉన్నవాళ్లే అప్లికేషన్ చేసుకోవడానికి అర్హులు. అప్లికేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత నియామక సంస్థలు ఎంపిక పరీక్షలు నిర్వహిస్తాయి. ఆ పరీక్షలో కనబరిచిన ప్రతిభ, టెట్‌లో సాధించిన మార్కుల ఆధారంగా మెరిట్ లిస్ట్ తయారుచేసి ఒక బడి పంతులును ఎంపిక చేస్తారు. కానీ వర్సిటీ అధ్యాపకులకు మాత్రం ఇన్ని షరతులు, పద్ధతులు, ప్రామాణిక పరీక్షల్లేవు.
పీజీ చేసి జాతీయ, రాష్ట్రస్థాయి అర్హత పరీక్ష ఉత్తీర్ణులై ఉంటే చాలు. నేరుగా ఇంటర్వ్యూకు వెళ్లిపోవచ్చు. అదీ లేకపోతే పీహెచ్డీ డిగ్రీ ఉంటే సరిపోతుంది. ఆర్టికల్స్, అకడమిక్ స్కోర్ కోసం ఇతర జోడింపులుంటాయి. ఈ మధ్యకాలంలో డబ్బు చెల్లిస్తే ఆర్టికల్స్ ప్రచురించే విధానం కూడా వచ్చింది కాబట్టి ఇవన్నీ తూతూ మంత్రం తతంగంగా మారిపోయాయి. ఇది దశాబ్దాలుగా ఎలాంటి మార్పు లేకుండా కొనసాగుతున్నది. విశ్వవిద్యాలయాల గ్రాంట్ల సం ఘం (యూజీసీ) కూడా విద్యార్హతలు, ఎంపిక కమిటీల గురించి మాట్లాడి చేతులు దులుపుకొన్నదే తప్ప, ఎక్కడా ప్రమాణాలకు, ఎంపిక ప్ర క్రియలకు ఎటువంటి నిబంధనలు రూపొందించడం లేదు. దీంతో వర్సిటీ అధ్యాపకుల ఎంపిక దేశవ్యాప్తంగా వివాదాస్పదమవుతున్నది.
పారదర్శకత లోపించడం
ఉద్యోగ నియామకాల్లో ఎంపిక విధానం పారదర్శకంగా, ప్రామాణికతతో లేకపోతే వివాదాలు, విమర్శలు తప్పవు. వర్సిటీలలో అదే జరుగుతున్నది. దీనివల్ల మెరిట్ ప్రమేయం లేకుండా ఎక్కడ చదివినవాళ్లు అక్కడే ఎంపిక కావడం జరిగి వేరే వర్సిటీలో చదివిన, పరిశోధనలు చేసిన ప్రతిభావంతులైన వారికి అవకాశాలు రాలేదన్న విమర్శలు వచ్చాయి. ప్రతిభావంతులైన అధ్యాపకులు ఉండాల్సిన వర్సిటీలలో అక్కడే చదువుకొని అక్కడే, పరిశోధన పూర్తిచేసి, అక్కడివారితోనే ఎంపిక కావడం వల్ల వర్సిటీల్లో వైవిధ్యం కొరవడిందనే నిర్ధారణకు ప్రభుత్వాలు వచ్చాయి. అంతేకాకుండా వీసీ లాంటి అత్యున్నత పదవుల్లో ఉన్న ఆచార్యులు ఇలాంటి ఆరోపణలు, కోర్టు కేసులు ఎదుర్కోవడంతో వర్సిటీల అభివృద్ధి మీద, విద్యా ప్రమాణాల మీద దృష్టిపెట్టే అవకాశం రాకుండాపోయింది. మరోవైపు ఏటా పదవీ విరమణలు యథావిధిగా జరిగిపోవడంతో వర్సిటీలు వెలవెలబోతున్నాయి. నియామక ప్రక్రియలో మరో ప్రధానాంశం ఎంపిక కమిటీ కూర్పు అన్ని సబ్జెక్టుల నియామకాలకు వీసీ చైర్మన్‌గా ఉంటారు. కమిటీలో రిజిస్ట్రార్, ఆయా ఫ్యాకల్టీ డీన్లు, హెచ్ఓడీ, బోర్డు ఆఫ్ స్టడీస్ చైర్మన్ కూడా సభ్యులుగా ఉంటారు. వీరితో పాటు మరో ముగ్గురు విషయ నిపుణులుంటారు. అంటే దాదాపు సగానికంటే ఎక్కువమంది వర్సిటీకి చెందినవారే. దీనివల్ల కూడా ఆశ్రిత పక్షపాతం ఉండే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. అంతేకాదు, ప్రతి ఇంటర్వ్యూలో వీసీ, రిజిస్ట్రార్ ఇతర అధికారులు తప్పనిసరిగా ఉండవలసి రావడం మూలంగా నెలల తరబడి విశ్వవిద్యాలయ అధికారులంతా మిగతా విషయాలు వదిలేసి బోర్డులోనే కూర్చోవలసి వస్తున్నది. గతంలో జరిగిన నియామకాలు దాదాపు ఏడాదిన్నర పాటు సాగడంతో ఒక ప్రధాన వర్సిటీ వీసీ తన పదవీ కాలంలో సగభాగం ఇంటర్వ్యూలతో సరిపెట్టారన్న విమర్శ ఉన్నది.
ఇకపోతే కనీస అర్హత ఉన్న ప్రతి అభ్యర్థిని ఇంటర్వ్యూ చేయడం మూలంగా కొన్నిసార్లు ఒక్క పోస్టుకు వందలాది మందిని ఇంటర్వ్యూ చేస్తూ పోతున్నారు. దీనికి బదులు కేంద్ర, రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ల మాదిరిగా ఒక పటిష్ఠమైన స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించి ఒక్కో పోస్టుకు మెరిట్ ప్రాతిపదికన ఇద్దరినో, ముగ్గురినో ఎంపిక చేసి ఇంటర్వ్యూలు నిర్వహించాలనే సూచన కూడా కొందరు చేస్తున్నారు. ఈ పద్ధతి డిగ్రీ, జూనియర్ కళాశాలల అధ్యాపకుల నియామకాల్లో ఉన్నది. దీనివల్ల నియామక ప్రక్రియ వేగవంతమయ్యే అవకాశం ఉంటుం ది. వర్సిటీల ఎంపికలో ఉన్న లోపాలవల్ల గడిచిన 20 ఏండ్లలో ఉమ్మడి రాష్ట్రంలో అనేక సమస్యలు తలెత్తాయి. అవకతవకలు జరిగాయని పత్రికల్లో కథనాలు వచ్చాయి. అప్పుడు పనిచేసిన వీసీలు అవినీతికి, బంధుప్రీతికి, ఆశ్రిత పక్షపాతానికి పాల్పడి తమవారికే ఉద్యోగాలన్నీ ఇచ్చుకున్నారని, అమ్ముకున్నారని, రాజకీయ జోక్యం, ఒత్తిళ్లతో ఎంపిక చేశారని కోర్టుల్లో కేసులు నమోదయ్యాయి. ప్రభుత్వానికి, గవర్నర్లకు ఫిర్యాదులో అందాయి. కొందరు వీసీల మీద విచారణ జరిగింది, విజిలెన్స్ నివేదికలు అందాయి. ఒకరిద్దరు ఒత్తిళ్లకు లోనై రాజీనామాలు చేయవలసి వచ్చింది.
కాంట్రాక్టు అధ్యాపకుల సమస్య
ఇది ఒకప్పటి ఏపీకే పరిమితం కాదు. దేశవ్యాప్తంగా వర్సిటీ అధ్యాపకుల ఎంపిక ప్రక్రియ ప్రహసనంగా మారిపోయింది. ఆ పరిస్థితుల్లోనే బీహార్, జార్ఖండ్ వంటి రాష్ర్టాల్లో ఎంపిక ప్రక్రియ పూర్తిగా రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్లకు అప్పగించారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర విభజన జరిగింది. రెండు రాష్ర్టాల్లోనూ కొత్తగా ఏర్పడిన ప్రభుత్వాలు ఈ పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని ఇక్కడ కూడా రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్లకు అధ్యాపకుల ఎంపిక బాధ్యత అప్పగించే ప్రయత్నం చేశాయి. తెలంగాణ ప్రభుత్వం ఈ పరిస్థితిని గమనించి వర్సిటీల నియామకాలను రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు అప్పగించాలని 2017లోనే ఆలోచన చేసింది. సీఎం కేసీఆర్ ఈ నిర్ణయాన్ని సూచనప్రాయంగా అధికారులతో చర్చించారు. తొలి విడతగా అటవీ, మెడికల్ కాలేజీలలో ఉన్న ఖాళీలను టీఎస్పీఎస్సీకి అప్పగించారు. అవి పకడ్బందీగా పూర్తయ్యాయి. మిగిలిన అన్ని వర్సిటీల్లో కూడా ఇదే పద్ధతిలో నియామకాలు పూర్తిచేయాలని భావించినప్పటికీ వర్సిటీల్లో దీనిపై కొందరు నిరసనలు తెలిపారు. మరోవైపు ఏపీలో అప్పటి టీడీపీ ప్రభుత్వం కూడా ఏపీపీఎస్సీ ద్వారా స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించి వడపోసి ఇంటర్వ్యూలు పెట్టాలని భావించింది. పరీక్షలు కూడా నిర్వహించిం ది. కోర్టు కేసులతో ఆ ఫలితాలు ఇప్పటికీ రాలే దు. అందుకు రెండు కారణాలు, ఒకటి వర్సిటీ స్వయం ప్రతిపత్తికి ఇది విఘాతం కలిగిస్తుందని కొందరు వాదించారు. నిజానికి స్క్రీనింగ్ పరీక్షకు స్వయం ప్రతిపత్తికి నేరుగా ప్రత్యక్ష సంబం ధం లేకపోయినా మెరిట్‌ను ప్రాతిపదిక చేసుకుంటే అక్కడే చదివి నిరుద్యోగులుగా విశ్వవిద్యాలయాల్లో పాతుకుపోయి ఉన్నవారికి ఉద్యోగాలు రావేమోననే భయం వల్ల కొన్ని విద్యార్థి సంఘాలు కూడా దీన్ని వ్యతిరేకించాయి.
(వ్యాసకర్త: ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి డైరెక్టర్ (అకడమిక్), డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం)
(మిగతా రేపు)