చంద్రబాబు మాటలు విన్నప్పుడల్లా కొలంబస్ గుర్తుకువస్తాడు. 15వ శతాబ్దంలో స్పానిష్ రాజుల పనుపున ’కొత్త భూభాగాలను కనుగొన్న ఇటాలియన్ నావికుడు కొలంబస్ మాత్రమే కాదు. ప్రపంచంలోని 85 శాతాన్ని 500 ఏండ్లపాటు వలసలుగా పాలించి, వాటిని ఎంతగానో అభివృద్ధి చేసిన ‘యూరోపియన్ రాజ్యాలూ గుర్తుకువస్తాయి. అంతేకాదు. వారు ప్రపంచ ప్రజలకు తమ మతాన్ని, భాషలను, సంస్కృతిని, జీవన విధానాలను ‘నేర్పి, శ్వేతజాతి దురహంకారాన్ని కూడా పరిచయం చేసి, ‘నాగరికులుగా మార్చటం కూడా గుర్తుకువస్తుంది. ఇది రాయటం ప్రత్యేకంగా చంద్రబాబును విమర్శించేందుకు కాదు.
తమను తాము అధికులమని, నాగరికులమని, తమకు సంబంధించిన అంశాలు, లక్షణాలు అన్నీ గొప్పవని భావించేవారు ఇతరులను చిన్నచూపు చూడటం, దురహంకారంతో మాట్లాడటం మొదటి నుంచి ఉన్నదే. అయితే ఈ చరిత్ర, క్రిస్టఫర్ కొలంబస్‌తో ఆరంభించి చూడటానికి కారణాలున్నాయి. అప్పటి నుంచి మొదలుకొని దాదాపు ప్రపంచమంతా మానవజాతి చరిత్రలోనే మొదటిసారిగా ‘వలసవాదం’ అనే కొత్తదశలోకి ప్రవేశించింది. అది రెండు పార్శాలుగా పనిచేసింది. వలసలతో భూభాగాలను ఆక్రమించి అక్కడి సహజ వనరులను, మానవ వనరులను, మార్కెట్లను దోచుకొని రాజకీయంగా నియంత్రించే మెటీరియల్ పార్శం ఒకటి. అక్కడి ప్రజల మతాలు, భాషలు, సంస్కృతులు, జీవన విధానాలు, భావజాలాలను హీనమైనవంటూ కొట్టివేసి, కించపరచి, తమ వాటిని నేర్పటం, బలవంతంగా రుద్దటం ద్వారా ఆ ప్రజలను తమకు తాము కాకుండా చేయటం, వలస పాలకుల మూసలోకి మార్చే సాంస్కతిక పార్శం రెండవది.
ఈ రెండు పార్శాలలో కనిపించే ఫిలసాఫికల్ సూత్రం ఒకటే. మేము అభివృద్ధి చెందాము. అభివృద్ధికి తగిన సాధనాలు మా వద్ద ఉన్నాయి.. ఆ కారణంగా మాకు సహజమైన రీతిలో కొన్ని హక్కులు, అధికారాలు లభిస్తాయి. ఇతరులు వెనుకబడిన వారు. వారిని దోపిడీ చేయడం మాకు సహజమైన రీతిలో లభించే హక్కు, అధికారం. అక్కడ దోపిడీ కోసం వనరులను వెలికితీయటం, అవసరమైన నిర్మాణాలు చేపట్టటం, తమ ఉత్పత్తులకు మార్కెట్లు తయారు చేయటం, మనుషులను మాకు ఉపయోగపడేటట్లు మార్చటం వల్ల ఆ వలస దేశాలు ’అంతకుముందు కన్నా అభివృద్ధి చెందుతాయి.’ కనుక ’మా వల్లనే మీరు అభివృద్ధి చెందారు సుమా’ అని థియరీలు రాస్తారు. అక్కడి ప్రజలకు వివరించి నమ్మించజూస్తారు. ఇదంతా మొదటి పార్శంలో ఇమిడి ఉన్న సూత్రం. ఇది 500 సంవత్సరాల వలస పాలనాచరిత్ర పొడవునా, అన్ని వలస రాజ్యాలు, అన్ని వలస దేశాలలో పాటించిన సూత్రమే. ఇదే సూత్రానికి, వలస సంప్రదాయానికి ఒక వర్తమాన వారసుడు చంద్రబాబు. ఆయనది అంతర్గత వలససూత్రం.
రెండవ పార్శానికి వస్తే ఇదే సూత్రీకరణను వలసవాదులు వర్తింపజేశారు. మీ మతాలలో అన్నీ లోపాలే ఉన్నాయి. మా మతం అన్ని విధాలా ఉత్కృష్టమైనది. మీవి మొరటుభాషలు, మావి నాగరికమైనవి కావటమే కాదు. ఇవి నేర్చుకుంటేనే మీకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి.. మా భాష మాట్లాడితే సమాజంలో గౌరవం ఉంటుంది. మా భాషలలో గొప్ప సాహిత్యం ఉంది. తత్వశాస్ర్తాలు ఉన్నాయి. ఇవి నేర్చుకుంటే ఉన్నత విద్యావకాశాలు, మా దేశాలలో విద్యా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. వస్త్రధారణ, ఆహార విహారాలు, నలుగురిలో నడుచుకునే తీరు వంటివి కూడా మావే మెరుగైనవి.. అందువల్ల వాటిని అనుసరించండి.. మా నుంచి నేర్చుకోండి.. లేనట్టయితే మిమ్ములను హేళన చేస్తాము.. అవమానాలకు గురి చేస్తాం అనే రీతిలో వ్యవహరిస్తారు.
ఈ విధమైన రెండవ పార్శం కూడా వలస పాలకుల నుంచి వలస దేశాలు అన్నిటా కనిపించింది. ఇందులో అతిశయోక్తి ఎంతమాత్రం లేదు. అన్నీ చరిత్రలో నమోదైనవే. చంద్రబాబు ఈ విధమైన వలస సంప్రదాయానికి కూడా ఒక వర్తమాన వారసుడు. గమనించవలసిందేమంటే, యూరోపియన్ వలస పాలకులు తాము అనుసరించిన ఈ రెండు పార్శాల గురించి ఎంత మాత్రం దాపరికం లేకుండా మాట్లాడారు, పుస్తకాలు రాశారు, చట్టాలను సైతం చేశారు. ఇటలీ, స్పెయిన్, పోర్చుగల్, ఇంగ్లాండ్, నెదర్లాండ్స్, ఫ్రాన్స్ ఎవరూ ఇందుకు మినహాయింపు కారు. కొలంబస్ కాలంలో మొట్టమొదటి వలసగా మారిన కరీబియన్ దీవుల నుంచి మొదలుకొని ఉత్తర, దక్షిణ అమెరికాలు, ఆఫ్రికా, ఆసియా, తూర్పు ఆసియా వరకు ఇదే కనిపిస్తుంది. అన్ని చోట్లా దోచుకోవటం మిమ్మల్ని అభివృద్ధి చేశామనటం, అందరి మతాలు, భాషలు, సంస్కృతులను దెబ్బతీసి కించపర్చటం, మిమ్ములను నాగరికులు చేశామనటం.. ఈ రెండు విధాలైన వలసవాద, సామ్రాజ్యవాద సంప్రదాయాలకు వారసుడు చంద్రబాబు. తనతోపాటు అదే విధంగా మాట్లాడే మరికొందరి గుంపు. అదే భావజాలాన్ని తమ ప్రాంతపు సామాన్య ప్రజలలోకి కూడా కొంతవరకు ఎక్కించగలిగారు.
బయటి పాలకులు 500 ఏండ్లలో ఇంతకన్నా తీవ్రమైన దుర్మార్గాలకు కూడా తలపడ్డారు. ఎన్నోచోట్ల, ముఖ్యంగా చిన్న సమాజాలలో, వారి స్వంత స్థానిక భాషలు అన్నవే లేకుండా చేశారు. ఆ భాషలలో విద్యాబోధనలు ఆపటం, ఇతరత్రా కమ్యూనికేషన్ సదుపాయాలు, ప్రచురణలు లేకుండా చేయటం, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు నిలిపివేయటంతో కొత్త తరాలు వచ్చే కొద్దీ ప్రజల సొంత భాషలు, సంస్కృతులు లేకుండాపోయాయి. ఈ ప్రభావం ఎంత తీవ్రంగా పని చేసిందో తెలుసుకోవాలంటే ఆఫ్రికాను ఉదాహరణగా తీసుకోవాలి. ఆ సువిశాల ఖండంలో వేలాది తెగలు, భాషలు ఉండేవి. వలస కాలంలో తెగలు కొనసాగినా భాషలు మాయమవుతుండటంతో భాషా వలసవాదానికి వ్యతిరేకంగా మేధావులు, రచయితలు ఉద్యమాలు చేశారు. దానిని ఆఫ్రికన్ సంస్కృతులు, స్వాతంత్య్రాల పరిరక్షణలో భాగంగా మార్చారు.
తెలంగాణ భాషా సంస్కృతుల విషయంలో చంద్రబాబు వంశస్తులైన కోస్తా వలస పాలకులు అనుసరిస్తూ పోయింది కూడా ఈ విధమైన అంతర్జాతీయ వలస పాలనా సంప్రదాయాన్నే…, ఆధిపత్య ధోరణినే. కనుక, తెలంగాణను, హైదారాబాద్‌ను అభివృద్ధి చేసింది తానేనని సగటున వారానికొకసారి ప్రకటించుకునే చంద్రబాబు నుంచి మొదలుకొని, ఇక్కడి వారికి వరిసాగు, వరి అన్నం, భాషతీరు, పిండివంటలు, పచ్చళ్లు, పండుగలు, కట్టుబాట్లు తామే నేర్పామని, సాహిత్యం తమదే తప్ప ఇక్కడేమీ లేదనే దురహంకారుల వరకు అందరినీ 500 ఏండ్లుగా వలస చరిత్రకు, సంప్రదాయానికి కొనసాగింపుగానే చూడాలితప్ప.. విడిగా కాదు. ఇతర దేశాల ప్రజలకు నాగరికత లేదని, వారిని నాగరికులుగా మార్చటం తమ గురుతర బాధ్యత అని పాశ్చాత్యులు కొందరు నిజంగానే నమ్మారు. దానితో ఆ బాధ్యతను నిర్వర్తించటాన్ని వైట్ మ్యాన్స్ బర్డెన్ అని పేరు పెట్టుకున్నారు. అదే పద్ధతిలో తెలంగాణను అభివృద్ధి పరచటం, ఇక్కడి వారిని నాగరికులుగా చేయడం కోస్తా మ్యాన్స్ బర్డెన్‌గా చంద్రబాబు వంశస్తులు భావిస్తున్నట్టు కనిపిస్తున్నది.
ఒక విచిత్రమేమిటంటే, ఆర్థికశాస్త్రంలో ఎంఏ చదివిన చంద్రబాబుకు కొన్ని ఆర్థిక సూత్రాలు బోధపడినట్టు లేవు. లేదా తెలియనట్టు నటిస్తున్నారు. పెట్టుబడిదారులు ఎక్కడికో వెళ్లి ఆ ప్రాంతాలను అభివృద్ధి చేయాలనే సదుద్దేశంతో పోరు. అక్కడి వనరులను, ఇతర అవకాశాలను ఉపయోగించుకుని లాభపడేందుకు మాత్రమే పోతారు. యూరోపియన్లు ప్రపంచమంతటికి పోయినా, కోస్తా వారు తమిళనాడు, కర్ణాటక వెళ్లినా, తెలంగాణకు వచ్చినా, హైదరాబాద్‌లో ఏదైనా చేసినా అంతేతప్ప మరొకటి కాదు. కోస్తా ధనిక వర్గాల ఈ విధమైన లాభాలవేట వల్లనే వారి స్వస్థలమైన కోస్తా అభివృద్ధిని గాలికి వదలటంతో వక్రీకృత అభివృద్ధి (Lopsided development) జరిగిందని అక్కడి ఉద్యమకారులు స్పష్టంచేస్తున్నారు.
మరి తెలంగాణను ఎంతగానో అభివృద్ధి చేశామని చెప్పే తాము కోస్తాను, ఇతర ఆంధ్రా ప్రాంతాలను నిర్లక్ష్యం చేయటంలో పని చేసిన వలస సంప్రదాయ ఆర్థిక సూత్ర రహస్యాలేమిటో ఆర్థికశాస్త్ర అధ్యయనం చేసిన చంద్రబాబు వివరించాలి. తాము మద్రాసుతో విడిపోయిన తర్వాత తెలంగాణతో విలీనాన్ని, రాజధానిగా హైదరాబాద్‌ను కోరుకున్నదే వాటిని అంతర్గత వలసలుగా మార్చుకునేందుకే కదా.
వలసవాదులకు ఆ దోపిడీ ఫలితాలను తగినంతకాలం అనుభవించిన మీదట.. ఒక మానసిక స్థితి ఏర్పడుతుంది. అది తమ వలసలను కోల్పోయిన తర్వాత కూడా వదలిపోదు. గతం గుర్తుకువచ్చి బా ధ కలుగుతూ ఉంటుంది. వలస రాజ్యంలో తాము చేసిన ‘అభివృద్ధి’ తరచూ రాత్రి కలలోకి వచ్చి అ య్యో అదంతా కోల్పోయామే అని కలవరిస్తుంటా రు. మరునాడు పలవరిస్తుంటారు. ఆ మానసిక వ్యా ధికి ఒక చికిత్స ఉన్నది. అది, అటువంటి కలలు వ చ్చినా కనీసం మరునాడు పలవరింతలు ఆపి, తమ రాష్ట్రం అభివృద్ధిపై దృష్టిని కేంద్రీకరించుకోవటం, అందుకు ధ్యానయోగాన్ని అనుసరించడం.
టంకశాల అశోక్