రాజ్యాంగబద్ధంగా అందాల్సిన ప్రయోజనాల కోసం దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న దళిత ఉపకులాలకు ఊరటనిస్తూ స్టేట్ ఆఫ్ పంజాబ్ వర్సెస్ దవీందర్ సింగ్ కేసులో ఆగస్టు ఒకటిన భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఏడుగురు న్యాయమూర్తుల ధర్మాసనం 6:1 నిష్పత్తితో తీర్పు ఇచ్చింది. ఎస్సీ వర్గీకరణకు పరిష్కారం చూపుతూ ‘ఆఖరి మనిషి ఆవేదనే వర్గీకరణకు పునాది కావాల’నే తలంపుతో దళితుల్లో అత్యంత వెనుకబడిన వర్గాలకే మొదటి ప్రాధాన్యం దక్కాలని స్పష్టంచేసింది. వీరిని ప్రత్యేక క్యాటగిరీగా గుర్తించి సముచిత రిజర్వేషన్లు కేటాయించాలని తీర్పునిచ్చి నిరుపేద దళిత కులాలకు అండగా నిలిచింది.
సామాజిక అణచివేతకు, వివక్షకు గురైన వర్గాలకు సమాన అవకాశాలు కల్పించేందుకు రాజ్యాంగం కల్పించిన హక్కే రిజర్వేషన్లు. అయితే ఈ దేశంలో అట్టడుగు స్థానంలోఉండి, సామాజిక వివక్ష, అణచివేతకు గురవుతున్న దళిత వర్గాల్లోనూ అంతర్గతంగా అసమానతలుండటం బాధాకరం. ఒకే జాతి అనే సాకుతో దళితుల్లోని ఒకటి, రెండు కులాలే ఇప్పటివరకు మొత్తం రిజర్వేషన్ ఫలాలను అనుభవిస్తూ వస్తున్నాయి. సుప్రీంకోర్టు తాజా తీర్పుతో ఈ అన్యాయానికి ఇకపై అడ్డుకట్ట పడనున్నది.
తెలంగాణలో మొత్తం 59 దళిత కులాలున్నాయి. ఈ కులాల సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, కట్టుబాట్లు వేర్వేరు. వీటిలో ఏ ఒక్క కులం కూడా మరో కులానికి ఉపకులం కానే కాదు. కానీ, సమాజంలో మాత్రం దళితులు అంటే మాల, మాదిగలు మాత్రమే అనే ప్రచారం ఉన్నది. ఈ కులాల జనాభా అధికంగా ఉండటమే అందుకు ప్రధాన కారణం. అంతేకాదు, విద్య, ఉద్యోగ, రాజకీయం సహా అన్ని రంగాల్లోనూ ఈ కులాలే అభివృద్ధి చెందాయి. మాల, మాదిగలతో పాటు మోచి, చిందు, డక్కలి, హోలియదాసరి, మష్టిన్, బైండ్ల, కొలుపుల, సమగర, బేడ(బుడగ) జంగం తదితర మరో 57 కులాలు కూడా దళిత వర్గానికి చెందినవే. చేతివృత్తులు చేస్తూ, సంచార జీవనం సాగిస్తున్న ఈ కులాలవారు విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో మాల, మాదిగలతో పోలిస్తే అత్యంత వెనుకబడి ఉండటం గమనార్హం.
2014లో అప్పటి బీఆర్ఎస్ సర్కార్ నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం.. తెలంగాణలో దళితుల జనాభా 64.44 లక్షలు. రాష్ట్ర జనాభాలో ఇది సుమారుగా 17.48 శాతం. వీరిలో మాదిగలు 34.87 లక్షలు (9.45 శాతం), మాలలు 14.35 లక్షలు (3.89 శాతం) ఉండగా.. మిగతా 57 దళిత కులాల జనాభా 15.21 లక్షలు (4.12 శాతం). అయితే ప్రస్తుతం ఈ కులాల జనాభా 30 లక్షలకుపైనే ఉన్నట్టు అంచనా.
జస్టిస్ రామచంద్రరాజు కమిషన్ సిఫారసుల ప్రకారం.. రెండు దశాబ్దాల కిందట ఏ, బీ, సీ, డీ వర్గీకరణ జరిగిన విషయం విదితమే. దాని ప్రకారం.. ఏ వర్గంలో 11 కులాలు, బీ వర్గంలో 18, సీ వర్గంలో 24, డీ వర్గంలో 6 కులాలను చేర్చారు. నాటి నుంచి బీ వర్గంలో మాదిగలతో పాటు ఉన్న కులాలు మాదిగ ఉపకులాలని, సీ వర్గంలోని కులాలు మాల ఉపకులాలని ప్రచారం ఊపందుకున్నది. దాంతో మాల, మాదిగ కులాల ఆధిపత్యం కొనసాగుతూనే మిగతా కులాల అణచివేత మొదలైంది. అప్పటికే విద్య, ఉద్యోగ, ఉపాధి, రాజకీయ పరంగా చైతన్యం కలిగిన మాల, మాదిగ కులాలు మరింతగా అభివృద్ధి చెందగా.. మిగతా 57 కులాలు మరింత వెనకబడ్డాయి.
2004లో ఈ వర్గీకరణను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ తర్వాత కేంద్రం నియమించిన జస్టిస్ ఉషామెహ్రా కమిషన్ 59 దళిత కులాల స్థితిగతులపై అధ్యయనం చేసింది. ఎస్సీ వర్గీకరణ వల్ల మాదిగల కంటే మాలలు ఎక్కువ ప్రయోజనం పొందారని చెప్పింది. మిగతా 57 కులాలు తమ జనాభా నిష్పత్తి కంటే అత్యంత తక్కువ ప్రయోజనాలు పొందినట్టు స్పష్టం చేసింది. అంతేకాదు, ఈ కులాలకు రిజర్వేషన్ ఫలాలు అందాలంటే రాజ్యాంగ సవరణ చేసి ఆయా కులాలను ప్రత్యేక క్యాటగిరీలో ఉంచేలా ఆర్టికల్ 341కు క్లాజ్ (3)ని చేర్చాలని కమిషన్ ప్రభుత్వానికి సిఫారసు చేసింది. దీన్ని వక్రీకరించిన కొందరు మాదిగ నాయకులు.. మాదిగలకు మాలలు అన్యాయం చేశారని, మాదిగల కోసమే వర్గీకరణ చేయాలని ఉషా మెహ్రా కమిషన్ చెప్పిందని ప్రచారం చేశారు. ఎస్సీ వర్గీకరణ అంశాన్ని మాల-మాదిగల పంచాయితీగా చిత్రీకరించారు.
దేశానికి స్వాతంత్య్రం వచ్చి 78 ఏండ్లు గడుస్తున్నా నేటికీ బడిమెట్లు ఎక్కని కులాలు దళితుల్లో ఉన్నాయి. చాలా కులాలు చట్టసభల మొఖం చూడలేదు. అయినప్పటికీ వర్గీకరణకు అనుకూల, వ్యతిరేక ఉద్యమాలతో మాల, మాదిగ కులాలు అందర్నీ తప్పుదోవ పట్టిస్తున్నాయి. ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ, ఇతర నామినేటెడ్ పదవులు రెండు కులాలే దక్కించుకుంటున్నాయి. కనీసం సర్పంచ్ పదవులు కూడా మిగతా కులాలకు దక్కనివ్వడం లేదు. ఎస్సీ ఉపకులాలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామన్న హామీని కాంగ్రెస్ అటకెక్కించింది. ఇలా అన్ని రకాలుగా ఉపకులాలు నష్టపోతున్నాయి.
ప్రస్తుత డాటా ఆధారంగా వర్గీకరణ చేయాలని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. అలా జరగాలంటే జనగణన చేయడం తప్పనిసరి. రాష్ట్రంలో దళితుల జనాభా 20 శాతానికి పైగా ఉండొచ్చని ఒక అంచనా. కానీ, 2011 జనాభా లెక్కల ఆధారంగా వర్గీకరణ చేయాలని, గతంలో అమలుచేసిన ఏ, బీ, సీ, డీ విధానాన్నే కొనసాగించాలని కొంతమంది మాదిగ నాయకులు పట్టుబడుతున్నారు. ఆ లెక్కల ప్రకారం వారి జనాభా ఎక్కువ ఉండటమే అందుకు కారణం. పాత విధానాన్ని అమలు చేస్తే మిగతా ఉప కులాలకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. అదే కనుక జరిగితే మరో ఉద్యమం తప్పదు.