రాష్ట్ర ఉన్నత విద్యా వ్యవస్థను నడిపించడంలో కీలక పాత్ర పోషిస్తున్న డిగ్రీ గెస్ట్ లెక్చరర్లు నేటికీ ఉద్యోగ భద్రత, ఆర్థిక భద్రత లేకుండా జీవనం సాగిస్తున్నారు. ఇది ఆధునిక వెట్టి చాకిరీ నిదర్శనంగా నిలిచింది అనడానికి ఒక ఉదాహరణ. ప్రస్తుతం రాష్ట్రంలోని సుమారు 150 ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో బోధన చేస్తున్న 1940 మందిలో సగం మందికి పైగా డాక్టరేట్, నెట్, సెట్, పీజీ లాంటి ఉన్నత విద్యార్హతలు ఉన్నవారే. డిగ్రీ కళాశాలల్లో శాశ్వత అధ్యాపకుల కొరత కారణంగా విద్యార్థులకు బోధన అందించడంలో గెస్ట్ లెక్చరర్ల సేవలు అత్యంత కీలకంగా మారాయి. అమూల్యమైన సేవలు అందిస్తున్నప్పటికీ డిగ్రీ గెస్ట్ లెక్చరర్లు ఏటా అనిశ్చితి ఎదుర్కొంటున్నారు.
రాష్ట్రంలో జూన్ 8 నుంచి డిగ్రీ రెండవ, మూడవ సంవత్సరం విద్యార్థులకు తరగతులు ప్రారంభమయ్యాయి. జూలై 1 నుంచి ప్రథమ సంవత్సరం విద్యార్థులకు తరగతులు ప్రారంభం కానున్నాయి. కానీ గెస్ట్ లెక్చరర్ల కొనసాగింపు విషయంలో ఇప్పటికీ స్పష్టత లేదు. ఇది కేవలం ఉద్యోగుల సమస్య మాత్రమే కాదు… విద్యార్థులది కూడా. తరగతులు ప్రారంభమైన తర్వాత అధ్యాపకుల నియామకాల్లో ఆలస్యం జరిగితే బోధనపై ప్రతికూల ప్రభావం చూపుతుంది.
ప్రభుత్వ రెగ్యులర్ అధ్యాపకులు, కాంట్రాక్ట్ లెక్చరర్లతో సమానంగా డిగ్రీ గెస్ట్ లెక్చరర్లు కూడా ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ ద్వారా హాజరు నమోదు చేసుకోవడంతోపాటు రోజూ ఉదయం పది గంటల నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు నిర్దేశిత కళాశాల పని వేళలను పాటిస్తూ విధులు నిర్వహిస్తున్నారు. అందువల్ల గత విద్యా సంవత్సరంలో పనిచేసిన గెస్ట్ లెక్చరర్లందరినీ త్రీమెన్ కమిటీ, డెమో వంటి అనవసర, అసంబద్ధ విధానాలు లేకుండా కొనసాగించాలి. ఎన్నో ఏండ్లుగా మంచి సేవా రికార్డు కలిగి ఉన్న అధ్యాపకులను ఏటా మళ్లీ డెమో పేరుతో పరీక్షించడం ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే అంశంగా మారుతున్నది.
ప్రస్తుతం గెస్ట్ లెక్చరర్లకు పీరియడ్‌కు రూ.390 ప్రాతిపదికన వేతనం చెల్లిస్తున్నారు. యూనివర్సిటీల అల్మానక్ ప్రకారం రెండు సెమిస్టర్లలో కలిపి సుమారు 180 నుంచి 190 రోజుల వరకు మాత్రమే బోధన రోజులు ఉంటాయి. ఫలితంగా సంవత్సరమంతా కళాశాలకు పని చేస్తున్నప్పటికీ వారికి వేతనం మాత్రం పరిమిత కాలానికే అందుతున్నది. దసరాకు, సంక్రాంతి, విద్యార్థుల ప్రిపరేషన్ సెలవులు, 2 సెమిస్టర్ల పరీక్షల కాలం, వేసవి సెలవులు కలిపి గెస్ట్ లెక్చరర్లు ఐదు నెలల వేతనాన్ని కోల్పోతున్నారు. ఒక నెలలో 22 రోజులు కాలేజీ పని దినాలు ఉంటే, ప్రతిరోజూ 3 లేదా 4 క్లాస్‌లు చెప్తే ఆ నెలకు రూ.28,080 వేతనం అందుతుంది. కొన్ని నెలలలో మూడు నుంచి పది రోజులు బోధన మాత్రమే జరిగితే ఆ పది రోజులకు రూ.4,000 నుంచి రూ.15 వేల వేతనం మాత్రమే అందుతుంది. యూజీసీ 2018 ప్రకారం ప్రతి పీరియడ్కూ రూ.1500 లేదా నెలకు కన్సాలిడేటెడ్ పే రూ.50 వేలు ఇవ్వాలని నిబంధన ఉన్నది.
గెస్ట్ లెక్చరర్లు కేవలం తరగతులు మాత్రమే నిర్వహించడం లేదు. విద్యార్థుల అడ్మిషన్ల కోసం గ్రామాలు, పట్టణాల్లో 40 రోజులు ఎలాంటి వేతనం లేకుండా విద్యా వ్యవస్థ పరిరక్షణలో భాగంగా ప్రచారం చేస్తున్నారు. కానీ ఈ అదనపు సేవలకు ప్రత్యేక పారితోషికం కూడా అందడం లేదు. కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం ప్రతి నెలకూ రూ.50 వేల వేతనం చెల్లించాలి. ప్రస్తుతం పీరియడ్ ఆధారిత వేతన విధానాన్ని రద్దు చేసి, అకడమిక్ ఇయర్ 11 నెలలకు కన్సాలిడేటెడ్ పే విధానాన్ని అమలు చేయాలి. ఇది కేవలం వేతన పెంపు కోసం చేసే డిమాండ్ కాదు. ఇది కనీస జీవన భద్రత కోసం చేసే రాజ్యాంగబద్ధమైన, న్యాయమైన విజ్ఞప్తి.
దేశ నిర్మాణంలో భాగమైన అధ్యాపకులను ప్రభుత్వం పట్టించుకోవడంలేదు. డిగ్రీ వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న అధ్యాపకులు కనీస ఆర్థిక భద్రత లేకుండా జీవించడం అభివృద్ధి చెందిన సమాజానికి శోభనీయమైన విషయం కాదు. ‘విద్యపై పెట్టే ఖర్చు వ్యయం కాదు; అది భవిష్యత్తు తరాల ఉత్తమమైన పౌరులను తయారు చేస్తూ దేశ భవిష్యత్ నవనిర్మాణానికి పెట్టుబడి. ‘కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి 40 సార్లు వినతి పత్రాలు, సీఎం ఇంటిదగ్గర ఐదుసార్లు, సెక్రటేరియట్లో సీఎం పేరు మీద ఓ 35 సార్లు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు మరో 40 వినతి పత్రాలు సమర్పించాం. అలాగే ప్రభుత్వ ఉన్నత అధికారులు చీఫ్ సెక్రటరీ , సీఎం సెక్రటరీకి ,ఉన్నత విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీలకు, కమిషనర్లకు కూడా ఓ నలభై వినతి పత్రాలు అందజేశాం. అయినా నేటికీ సమస్యలు తీరలేదు.
మన విద్యార్థులు ప్రపంచంతో పోటీ పడాలి అనీ ప్రవచనాలు చెప్తున్న ముఖ్యమంత్రి మాటలు ఉత్తముచ్చట్లుగానే మిగిలిపోతున్నాయి. ఇలాంటి ఉద్యోగుల సమస్యలను కూడా పరిష్కరిస్తే భరోసాతో నాణ్యమైన , శాస్త్రీయమైన విద్య అందజేయడానికి సదాసిద్ధమై ఉంటారు. కళాశాలలను నడపడంలో కీలకంగా వ్యవహరిస్తున్న గెస్ట్ లెక్చరర్ల సమస్యలను సానుభూతితో, మానవతా దృక్పథంతో పరిశీలించి, పరిష్కరించి, భరోసా నింపాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నది.
– (వ్యాసకర్త: డిగ్రీ కాలేజీ గెస్ట్ లెక్చరర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు )
డాక్టర్ కొర్ర ఈశ్వర్‌లాల్ 9491111983