దేశంలో కాలక్రమంలో విద్యాప్రమాణాలు పడిపోతున్నాయి. అంతర్జాలం, సామాజిక మాధ్యమాలు, మాస్ మీడియా ప్రభావంతో నాణ్యత పలుచనవుతూనే ఉన్నది. స్వాతంత్య్రం పొందిననాడు 18.33 శాతం ఉన్న అక్షరాస్యత, 79 సంవత్సరాలు గడిచినా నేటికి 80.90 శాతం మాత్రమే ఉన్నది. ఏటా కనీసం ఒక్క శాతం అక్షరాస్యత లక్ష్యంగా పెట్టుకొని పెంచినా ఈ పాటికి దేశం యావత్తు నూరు శాతం అక్షరాస్యత సాధించేది. ఇక సర్కారీ విద్య విషయానికి వస్తే సరేసరి. నాలుగేండ్లుగా దేశంలో సగటున రోజుకు 25 ప్రభుత్వ పాఠశాలలు మూతపడుతున్నాయి. ఇందులో తెలంగాణ అగ్రభాగాన ఉండడం ఇప్పుడు ఆలోచించాల్సిన విషయం.
తెలంగాణలో కాంగ్రెస్ పాలనలో ప్రభుత్వ బడుల్లో ప్రమాణాలు పడిపోతున్నాయి. సర్కార్ తన బాధ్యతను విస్మరించి.. స్వచ్ఛంద సంస్థలకు పెద్దపీట వేయడం వల్ల విద్యారంగ ఉనికికే ప్రమాదం వాటిల్లుతున్నదని నిపుణులు చెప్తున్నారు. ఇంజినీరింగ్ పిల్లలకు సెలవు పత్రం, దరఖాస్తు నింపడం రావడం లేదంటున్న ముఖ్యనేత తన బాధ్యతల నుంచి తప్పుకొని చేతులు దులుపుకొంటున్నారు. ప్రభుత్వం కనీసం ప్రత్యేకంగా విద్యాశాఖకు మంత్రిని కూడా నియమించలేదు. ఈ శాఖ ముఖ్యమంత్రి ఆధీనంలోనే ఉన్నా.. విద్యాశాఖలో వైఫల్యాలు, పటిష్టత కోసం తీసుకోవాల్సిన చర్యలపై సమీక్ష చేసిందీ లేదు. మంత్రి లేకపోవడంతో ప్రభుత్వానికి, అధికారులకు సమన్వయం కొరవడిందని విద్యాశాఖలో చర్చ జరుగుతున్నది. రోజుకో కాగితం పుట్టగొడుగులా వెల్లువెత్తుతుండగా, ఉపాధ్యాయులు అయోమయంలో బిక్కుబిక్కుమంటున్నారు. ఇప్పటివరకు యూనిఫారాలు, షూస్, ఎడ్యుకేషన్ కిట్లు పూర్తిగా అందలేదు. పదహారు లక్షల మంది మందికి బ్రేక్‌ఫాస్ట్ పెట్టలేని పెద్దమనిషి ప్రచార ఆర్భాటానికి పరిమితమయ్యారు. కేవలం సిబ్బంది హాజరు నమోదు కోసం ఏటా రూ.63 కోట్లు ప్రైవేట్ కంపెనీలకు చెల్లిస్తున్నారంటే పెద్దల ప్రాధాన్యతలేమిటో అర్థమవుతూనే ఉన్నది.
మరోవైపు విద్యాశాఖలో అవినీతి పట్ల ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ శాఖతో అనుసంధానమై ఉన్న సెంట్రల్ స్కేర్ అనే స్వచ్ఛంద సంస్థ విద్యాశాఖనే శాసిస్తున్నది. అయితే విద్యాశాఖలో పనిచేసిన కొంత మంది డైరెక్టర్లు, సెక్రటరీ స్థాయి అధికారులు ఏటా నాలుగైదు సార్లు విదేశీ పర్యటనలు ఎలా చేయగలుగుతున్నారు? వారికి స్పాన్సర్ చేస్తున్నది ఎవరు? సమాచార హక్కు చట్టం కింద అడిగినా, ఎందుకు వివరాలు బయటకు రావడం లేదు? శిశు సంరక్షణ సెలవు పెట్టి బాహాటంగా ఉన్నతాధికారి విదేశాలు తిరిగినట్టుగా వార్తలు ఎందుకు బయటకు వచ్చాయి?
సదరు స్వచ్ఛంద సంస్థకు ఉన్న విశ్వసనీయత ఎంత? ఆ సంస్థలో ఎలాంటి ఉపాధ్యాయ శిక్షణ లేక కేవలం డిగ్రీ చదివిన పిల్లలు ఏకంగా జిల్లా విద్యాధికారులను, రాష్ట్రస్థాయి అధికారులను కూర్చోబెట్టి ఇలా చేయాలి, అలా చేయాలి అని ఎలా చెప్తారు? మీ జిల్లా పరిస్థితి ఇది, ఆ విద్యార్థి గతి ఇది, ఈ టీచర్ పనిచేయడం లేదని ఎలా ముద్రలు వేయగలుగుతున్నారు? అని ఉపాధ్యాయుల్లో ఆవేదన వ్యక్తమవుతున్నది.
కర్ణాటక, తమిళనాడు వంటి రాష్ర్టాల్లో స్వచ్ఛంద సంస్థల జోక్యాన్ని, ప్రమేయాన్ని తొలగించగా, తెలంగాణలోనూ బీఆర్ఎస్ ప్రభుత్వంలో రద్దయిన ఈ సంస్థలు మళ్లీ ఎలా మొలకెత్తాయి అనేదే ప్రశ్న. అటు సీఎం వర్గానికి చెందినదిగా చెప్తున్న ఓ సంస్థకు ఏకంగా విద్యా కమిషన్, విద్యా పాలసీ, ఉన్నత విద్యా మండలిలో చోటు కల్పించిన తీరుపై విద్యాశాఖలో విస్తృత చర్చ జరుగుతున్నది. కమీషన్ల కోసమే ఇవన్నీ వచ్చి చేరుతున్నాయేమో అనే అనుమానాలు రోజురోజుకూ బలపడుతున్నాయి. ఇంగ్లిషు కోసం ఒకటి, ఫిజిక్స్ కోసం ఒకటి, గణితం కోసం ఒకటి, డిజిటల్ విద్య కోసం ఒకటి, ఏఎక్స్ఎల్ కోసం మరొకటి ఇలా బాధ్యతలను ప్రైవేట్ సంస్థలకు అప్పగించి నేటి ప్రభుత్వ విద్య నుంచి ప్రభుత్వం పారిపోతున్నది. పాలక పెద్దలు ప్రభుత్వ విద్యను అనామకుల చేతుల్లో పెట్టి భావితరాల జీవితాలు, ఉపాధ్యాయుల ఆత్మగౌరవంతో ఆటలాడుతున్నారు.
విద్యాశాఖ విధించిన షరతులు ఆశ్చర్యకరంగా ఉన్నాయి. విదేశీ విద్యా విధానాలను ఆకలింపు చేసుకొని, మన దేశీయ కాలమాన పరిస్థితులకు ఎలా అనువదించాలన్న లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఈ టూర్ అడ్డగోలు ఆలోచనలతో పక్కదారి పట్టింది. కనీసం ఇక్కడ అమలవుతున్న విద్యా విధానం మీద, జాతీయ విద్యా విధానాల మీద అవగాహన లేకపోయినా, కనీస కమ్యూనికేషన్ నైపుణ్యాలు, రచన సామర్థ్యాలు, డిజిటల్ లిటరసీ, కనీసం ఒక ప్రజెంటేషన్ చేయలేకున్నా, పాఠశాలలో 100 విద్యార్థుల సంఖ్య అదృష్టవశాత్తు ఉంటే ఆ ఉపాధ్యాయులను ఎంపిక చేయడం ఒక దౌర్భాగ్యం. కనీసం ప్రస్తుత రాష్ట్ర విద్యా విధానం ఎలా ఉన్నదన్న ఒక ప్రజెంటేషన్ గానీ, డాక్యుమెంట్ గానీ వారిని రూపొందించి చూపించమని అడుగకపోవడం బాధాకరం. ఇది కేవలం విదేశీ పర్యటనగా మాత్రమే భావించాలి. ఎడ్యుకేషన్ ఎక్స్పోజర్ అని భావించడానికి వీల్లేదు. కోట్లల్లో ప్రభుత్వానికి లెక్కలు రాసుకోవడానికి మినహా ఈ విజిట్ ఎలాంటి ఫలితాలను ఇవ్వదన్న చర్చ ఉన్నది. ఇది ఇలా ఉంటే.. కాంపిటెంట్ స్కూళ్ల అమల్లోనూ అనేక లోపాలున్నాయి. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు విద్యార్థి ఉపాధ్యాయ నిష్పత్తి ఆశించిన మేర లేదు. ఆఖరి విద్యా సంవత్సరం అన్ని బడుల్లో ఎఫ్ఎల్ఎన్ సాధించాలని తెలిసినా, కాంపిటెంట్ స్కూళ్ల పేరిట 28 శాతం బడుల్లో 58 శాతం పిల్లల్ని కవర్ చేయాలని ఆదరాబాదరగా ఆ సంస్థ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ ఆదేశాలను విద్యాశాఖ గుడ్డిగా అనుసరించింది. ఎవరైనా కొందరు ఉపాధ్యాయులు అడిగితే హూంకరించి, భారాన్ని నెత్తినెత్తడం ఓ వింతగా మారిపోయింది. కాంపిటెంట్ స్కూళ్లుగా ప్రకటించిన మెజారిటీ స్కూళ్లలో అధికంగా ఇద్దరే టీచర్లు ఉన్నారు.
విద్యార్థి హాజరు 85 శాతం దాటాలన్న బాధ్యత ఉపాధ్యాయుడిపై పెట్టడం వెనుక మతలబు, ఆ సంస్థ బాధ్యత నుంచి పారిపోవడమే అనే విమర్శలున్నాయి. విద్యా సంవత్సరం పూర్తయ్యాక సర్కారీ విద్య ఇలాగే ఉంటుందని శాశ్వత ముద్ర వేయడమే ఇందులో లక్ష్యంగా కనిపింస్తుదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రాథమిక విద్యను ప్రభుత్వంతోపాటుగా లోపాలను, అసంబంద్ధ నిర్ణయాలను ప్రశ్నించి అడ్డుకోవాల్సిన చాలా ఉపాధ్యాయ సంఘాలు సైతం తమ బాధ్యతలను ఏనాడో విడిచిపెట్టాయన్న చర్చ ప్రస్తుతం ఉపాధ్యాయుల్లో నడుస్తున్నది. ఇప్పటికైనా భవిష్యత్తు మరింత ప్రమాదకరంగా మారకుండా ఉండాలంటే.. సంస్కరణలకు శ్రీకారం చుట్టాల్సిన అవసరం ఉన్నది. సర్కార్ పాఠశాలలపై నమ్మక పెంచాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నది. అప్పుడే వాటి మనుగడ ఉంటుంది. లేకపోతే ప్రభుత్వ బడుల మనుగడే ప్రశ్నార్థకంగా మారనున్నది.
కడపత్రి ప్రకాశ్‌రావు
8096677022