1975, సిటీ కళాశాలలో అంతర్ కళాశాలల కబడ్డీ టోర్నమెంట్ జరుగుతున్నది. గ్రామీణ ప్రాంతం నుంచి హైదరాబాద్‌కు ఉన్నత చదువుల కోసం వచ్చిన విద్యార్థి, ఖద్దర్ బనియన్ ధరించి ప్రత్యర్థి జట్టుకు ముచ్చెమటలు పట్టించాడు. చెరువులో చేప వలె ఎవరికీ చిక్కకుండా చిచ్చర పిడుగుగా ఆడిన ఆ విద్యార్థి ఎవరో కాదు, తాటికొండ వెంకటరాజయ్య. తాటికొండ మల్లయ్య-యశోద పుణ్య దంపతులకు నాలుగవ సంతానం. వీరి స్వస్థలం మారుమూల ప్రాంతమైన అంకుశాపురం, తరిగొప్పుల మండలం, జనగామ జిల్లా.
వెంకట రాజయ్య పుట్టుకతోనే నాయకుడు. జడ్పీహెచ్ఎస్ తరిగొప్పుల పాఠశాల విద్యార్థి నాయకుడిగా ఏకగ్రీవ ఎన్నికే అందుకు తార్కాణం. పదిలో ఉత్తమ శ్రేణితో ఉత్తీర్ణుడై ఉన్నత చదువుల కోసం హైదరాబాద్‌కు పయనమయ్యారు. 1975-77 ఎమర్జెన్సీ కాలం తర్వాత ప్రస్తుత ఎంపీ ఆర్.కృష్ణయ్య కలిసి స్కాలర్‌షిప్‌ల పెంపు కోసం ఉద్యమించారు. ఒక పక్క జీవనోపాధికి ట్యూషన్లు చెప్తూనే, మరో పక్క విద్యార్థుల సమస్యల పరిష్కారానికి ఉద్యమించిన వెంకటరాజయ్య అలుపెరుగని విద్యార్థి నాయకుడిగా అతితక్కువ కాలంలోనే గుర్తింపు పొందారు. అఖండ విజయంతో సిటీ కళాశాల విద్యార్థి సంఘ ప్రెసిడెంట్‌గా ఎన్నికవడం ఆయన నాయకత్వ లక్షణానికి ప్రతీక. కళాశాల గ్రంథాలయానికి సొంత డబ్బులతో సామాజిక స్పృహ కలిగించే అనేక పుస్తకాలను దానం చేసి విద్యార్థి లోకానికి స్ఫూర్తినిచ్చారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎంఏ తెలుగు, ఆంగ్లం పట్టాలు, తర్వాత ఎంఫిల్-పీహెచ్డీ పట్టాలు హస్తగతం చేసుకున్నారు. వాటితో పాటు బీఈడీ, ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం, యోగా టీచర్ ట్రైనింగ్, డిప్లొమా ఇన్ స్పోకెన్ ఇంగ్లీష్ పట్టాలను అందుకొని నిత్య విద్యార్థిగా నిరూపించుకున్నారు. విశ్వవిద్యాలయంలో విద్యార్థి సమస్యల పరిష్కారానికి, స్కాలర్‌షిప్‌ల పెంపునకు ఎల్లప్పుడూ ఉద్యమించారు.
మొదలు ఏపీపీఎస్సీలో జూనియర్ అసిస్టెంట్‌గా, సూర్యాపేట ప్రభుత్వ జూనియర్ కాలేజీలో జూనియర్ లెక్చరర్‌గా, డిగ్రీ లెక్చరర్‌గా, చివరగా ఉస్మానియా యూనివర్సిటీ ఇంగ్లీష్ ప్రొఫెసర్‌గా బాధ్యతలను నిర్వహించారు. తోటి ఉద్యోగుల హక్కులను పరిరక్షిస్తూ, సమస్యల పరిష్కారానికి అహర్నిశలు శ్రమించేవారు. ఉస్మానియా వర్సిటీ చరిత్రలో మొట్టమొదటి బీసీ వైస్ ఛాన్స్‌లర్‌ను నియమించడం వీరి ఉద్యమ పర్యవసానమే. బీసీ ప్రొఫెసర్‌ను వీసీగా నియమించాలని ప్రొఫెసర్ జేడీ గౌడ్‌తో కలిసి ట్యాంక్‌బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఆమరణ నిరాహారదీక్ష చేపట్టారు. దీంతో ఆనాటి ప్రభుత్వం దిగివచ్చింది. దాని పర్యవసానంగానే వరుసగా బీసీ ప్రొఫెసర్లు రామకిష్టయ్య, అనంతస్వామి, సత్యానారాయణ్ వీసీలుగా నియామకమయ్యారు. తోటి బోధనా సిబ్బందిని, విద్యార్థులను పురిగొల్పే వారి గంభీర ఉపన్యాసాలు తెలంగాణ ఉద్యమానికి ఆజ్యం పోశాయి. బీసీవాదం వారి నరనరాల్లో నిండి ఉం డేది. ప్రముఖ బీసీ వ్యక్తుల సభ్యత్వంతో చైతన్య మిత్రమండలిని స్థాపించి, ఫౌండర్ ప్రెసిడెంట్‌గా ఎన్నో సామాజిక కార్యకలాపాల్లో ఈ వేదిక ద్వారా పాలుపంచుకున్నారు.
అంతర్జాతీయ యోగా గురువుగా దేశ విదేశాల్లో ఎన్నో క్యాంప్‌లను నిర్వహించారు. ప్రతి అంతర్జాతీయ యోగా డే రోజు తాను ముఖ్య భూమికను పోషించి ఆరోగ్య భారత్‌కు దోహదపడ్డారు. వెంకటరాజయ్య ప్రేరణ ఉపన్యాసాలు వినని ఇంజినీరింగ్, డిగ్రీ విద్యార్థులు తెలంగాణ, ఏపీలలో లేరంటే అతిశయోక్తి కాదు.
ప్రతి సంవత్సర ప్రారంభంలో ప్రతి ఇంజినీరింగ్ కళాశాల యాజమాన్యం పోటీ పడి మరీ వీరి మోటివేషన్ లెక్చర్‌ను ఏర్పాటుచేసేవారు. రాజయ్య ఆంగ్లభాషలో చేసిన 20కి పైగా రచనలు గ్రామీణ విద్యార్థులకు చాలా ఉపయోగపడుతున్నాయి. ఉస్మానియా యూనివర్సిటీలో సీఈఎల్‌టీ- సెంటర్ ఫర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ ట్రైనింగ్ (సెల్ట్) ఫౌండర్ డైరెక్టర్‌గా సేవలందించారు. ఎందరో గ్రామీణ విద్యార్థులు ఆంగ్లభాషలో పట్టుసాధించేందుకు ఈ సెంటర్ చాలా దోహదపడింది. పదవీ విరమణ పొందిన తర్వాత ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా పోటీచేశారు. ఆరోగ్యాన్ని పణంగా పెట్టి భావజాల వ్యాప్తికి పాటుపడిన స్వామి వివేకానంద కోవకు చెందినవాడిగా వెంకటరాజయ్య నిరూపించుకున్నారు. సమాజ సమస్యలపై తన హృదయాన్ని వెచ్చించి చివరికి, హృదయ సంబంధిత సమస్యతో 2025 ఆగస్టు 24న తన సహచర, అనుచరుల హృదయాలను బరువెక్కించి దివికేగినారు. వారి సామాజిక స్పృహకు, సేవాతత్వానికి యూనివర్సిటీ తరఫున ఇవే ఘన నివాళులు.
(వ్యాసకర్త: కెమిస్ట్రీ ప్రొఫెసర్ (రి), ఓయూ)
-ప్రొఫెసర్ పార్థసారథి తీగుళ్ల
99496 52118