వేములవాడ అభివృద్ధిలో భాగంగా శ్రీరాజరాజేశ్వరస్వామివారు కొలువైన ప్రధాన దేవాలయాన్ని పునర్నిర్మిస్తామని చెప్పి, సమీపంలో ఉన్న భీమేశ్వరాయంలో ఉత్సవ విగ్రహాలను ఏర్పాటు చేసి, ఆలయ నిర్మాణం పూర్తయ్యే వరకు భక్తులు అక్కడే మొక్కులు చెల్లించాలని స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ప్రధాన ఆలయంలో పూజలను మొత్తంగా నిలిపివేయలేదని చెప్పి ఆలయ ప్రాంగణంలో ఓ స్క్రీన్‌ను ఏర్పాటు చేసి, దాని ద్వారా భక్తులకు పూజా కార్యక్రమాలను చూపిస్తున్నారు. అయితే, జనవరి 27 నుంచి 29వ తేదీ వరకు తెలంగాణలో సమ్మక్క-సారక్క జాతర జరగనున్నది. ఉత్తర తెలంగాణకు చెందిన భక్తులు చాలామంది వేములవాడలో రాజన్నను దర్శించుకున్న తర్వాతనే సమ్మక్క-సారక్క జాతరకు వెళ్తారు. ఎంతో కాలంగా ఇది ఆనవాయితీగా వస్తున్నది.
తెలంగాణలో దేవాలయాల అభివృద్ధిపై రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఉన్న సంకల్పం అందరికీ తెలిసిందే. యాదగిరిగుట్ట, వేములవాడలను అద్భుతంగా తీర్చిదిద్దుతామని ఆయన గతంలోనే ప్రకటించారు. చెప్పినట్టుగానే యాదగిరిగుట్ట పనులను పూర్తిచేశారు. వేములవాడ అభివృద్ధి పనులను కూడా ప్రారంభించారు.
నేను ఇటీవల వేములవాడకు వెళ్లినప్పడు అక్కడ మీడియా సమావేశం ద్వారా ఇదే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాను. సమ్మక్క-సారక్క జాతర పూర్తయ్యేవరకు వేములవాడలో పనులను ఆపాలని, భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా యథావిధిగా దర్శనాలు కల్పించాలని కోరాను. కానీ, ప్రభుత్వం స్పందించలేదు. భక్తుల విశ్వాసాలను దృష్టిలో పెట్టుకోకుం డా మొండిగా ముందుకువెళ్లడం భావ్యం కాదు.
గుడిని తప్పకుండా మూసివేయాలా?: వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయాన్ని చాళుక్యుల కాలంలో క్రీ.శ.750-973 మధ్యకాలంలో నిర్మించారు. ఇది దక్షిణకాశీగా పేరుగాంచింది. ఎంతో ప్రశస్తి కలది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుత ప్రభుత్వం ఆలయ పనుల కోసం గుడిని మూసివేయడంపై, భీమేశ్వరాలయంలో దర్శనాలు, కోడె మొక్కులు చెల్లించడానికి ఏర్పాట్లు చేయడంపై విస్తృతమైన చర్చ జరుగుతున్నది. ఆలయాన్ని అభివృద్ధి చేయాలంటే తప్పకుండా గుడిని మూసివేయాలా? అన్న ప్రశ్న తలెత్తుతున్నది. గతంలో కాశీ, అయోధ్య అంతకు పూర్వం సోమనాథ, పద్మనాభస్వామి, తిరుపతి దేవాలయాల అభివృద్ధి, క్షేత్ర విస్తరణ జరిగినప్పుడు ఆలయాలను మూసివేయలేదన్న, భక్తులను దర్శనానికి అనుమతించారన్న అనుభవాలు మనముందున్నవి. అయితే, రాష్ట్రంలో కొత్తగా నిర్మించిన యాదాద్రిలో మాత్రం 2016 నుంచి 2022 వరకు దర్శనాలను పూర్తిగా నిలిపివేశారు. కానీ, యాదగిరిగుట్టలో పరిస్థితులు వేరు, వేములవాడలో పరిస్థితులు వేరు. యాదాద్రిలో ఆలయాన్ని పూర్తిగా కొత్తగా నిర్మించాల్సిన పరిస్థితి. వేములవాడలో అలా కాదు. ఇప్పటికే ప్రధానాలయం దర్శనాలకు పూర్తిగా అనుకూలంగా ఉంది. ఆలయ పరిసరాలే ఇరుకుగా, భక్తులకు ఇబ్బందికరంగా ఉన్నాయి. వాటిని అభివృద్ధి చేసి భక్తులకు సౌకర్యాలు కల్పించాల్సి ఉంది.
వేములవాడ అభివృద్ధి కేసీఆర్ సంకల్పమే: తెలంగాణలో దేవాలయాల అభివృద్ధిపై రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఉన్న సంకల్పం అందరికీ తెలిసిందే. యాదగిరిగుట్ట, వేములవాడలను అద్భుతంగా తీర్చిదిద్దుతామని ఆయన గతంలోనే ప్రకటించారు. చెప్పినట్టుగానే యాదగిరిగుట్ట పనులను పూర్తిచేశారు. వేములవాడ అభివృద్ధి పనులను కూడా ప్రారంభించారు. అయితే, వేములవాడలో ఆలయం 23 గుంటల విస్తీర్ణంలో ఉంది. ఎంతో ప్రశస్తి కలిగిన ఈ ఆలయానికి భక్తుల తాకిడి ఎక్కువ. అందుకు అనుగుణంగా వసతులు కల్పించడానికి ఆలయ పరిసరాల్లో స్థలం లేదు. గుడి పక్కన ఓ వైపు చెరువు ఉంది. మరోవైపు కొంత దూరంలో మూలవాగు ఉంది. ఈ నేపథ్యంలో ఆలయ పరిసరాలను అభివృద్ధి చేయాలంటే చెరువును పూడ్చటం తప్ప మరో మార్గం లేని పరిస్థితుల్లో బీఆర్ఎస్ హయాంలో చెరువును మెల్లమెల్లగా మట్టితో నింపారు. మట్టి నింపిన దాదాపు 35 ఎకరాల విస్తీర్ణం మేరకు చెరువుకు మరోవైపున భూమిని సేకరించి చెరువును తవ్వించారు.
గత ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన వేములవాడ టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర తొలి సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు అప్పటి 36వ శృంగేరి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ భారతీ తీర్థ మహాస్వామి వారి ఆమోదానుసారం, అప్పటి దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, స్థానిక పార్లమెంట్ సభ్యుడినైన నేను, శాసనసభ్యుడు చెన్నమనేని రమేష్, స్థపతి, ఆర్కిటెక్ట్‌లు సంవత్సర కాలం పాటు చర్చలు జరిపి వేములవాడ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్‌ను రూపొందించాం.
ప్రధాన సవాళ్లు నాలుగు: ఈ మాస్టర్ ప్లాన్ రూపకల్పనలో నాలుగు ప్రధానమైన సవాళ్లను పరిగణనలోకి తీసుకున్నాం. అవి… 1. దేవాలయం వేములవాడ పట్టణం నడిబొడ్డున ఉన్నది. అంటే దేవాలయ అభివృద్ధి, పట్టణాభివృద్ధి కాడెడ్లలాగా సాగాలి. 2. కోట్లాది భక్తులకు అంచెలంచెలుగా మెరుగైన సౌకర్యాలు కల్పించాలి. క్షేత్ర విస్తరణ కూడా అదే లక్ష్యంతో సాగాలి. దీనర్థం ఆలయ అభివృద్ధి క్రమంలో భక్తులకు సౌకర్యాలను ఒక్కొక్కటిగా మెరుగుపరుస్తూ ముందుకుపోవాలి. 3. వేములవాడలో దక్షిణాన 160 ఎకరాల గుడి చెరువు, ఉత్తరాన 9 కిలోమీటర్ల మూలవాగు, ఆ మధ్యలో దేవాలయం ఉన్న కారణంగా దేవాలయం పరిసరాల్లో భూమి లభ్యత అత్యంత సమస్యాత్మకంగా మారింది. ఈ సవాల్‌ను అధిగమించడానికి ప్రత్యేక వ్యూహరచన చేయాలి. 4. అధిక శాతం వేములవాడ పట్టణ ప్రజలకు దేవాలయమే కీలకమైన ఉపాధి, ఆదాయ వనరు. దేవాదాయ శాఖకు కూడా అత్యధిక ఆదాయం వచ్చే ఆలయాల్లో వేములవాడ మొదటిస్థానంలో ఉంది. అంటే ప్రజల ఉపాధి దెబ్బతినకుండా, దేవాదాయ శాఖకు ఆదాయం పడిపోకుండా అభివృద్ధి జరగా లి. ఈ నాలుగు సవాళ్లను పరిగణనలోకి తీసుకొని శృంగేరి పీఠంవారు కేసీఆర్ ఆదేశాలతో ఆలయ అభివృద్ధిలో ప్రధాన లక్ష్యమైన భక్తుల సౌకర్యాలు, క్షేత్ర విస్తరణ కార్యక్రమాలను ప్రారంభించారు.
బీఆర్ఎస్ హయాంలోనే రూ.280 కోట్ల పనులు: 2016లో రూపొందించిన మాస్టర్ ప్లాన్ ప్రకారం బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిచేసిన పనులు ఇవి. 1. రూ.110 కోట్లతో డబుల్ రింగ్ రోడ్డు నిర్మించారు. దీంతో తిప్పాపురం, కోరుట్ల, జగిత్యాల బస్‌స్టాండ్ నుంచి రాజన్న గుడికి వచ్చే లక్షలాది భక్తులకు ప్రయాణం సులభతరమైంది. అంతేకాదు ఈ రోడ్డు నిర్మాణం కోసం ధోబీ ఘాట్ల వద్ద రజక సోదరుల గుంటన్నర భూమి పోతే వీటీడీఏ నుంచి వారికి రూ.56 లక్షల నష్టపరిహారం అందించారు. రూ.22 కోట్లతో వేములవాడ బస్టాండ్ నుంచి నాంపల్లి గుట్ట వరకు డబుల్ రోడ్డు, సెంట్రల్ లైటింగ్, ఆహ్వాన తోరణాలు ఏర్పాటు చేశారు. రూ.90 కోట్లతో గుడి చెరువును అభివృద్ధి చేశారు. ఒకవైపు ఆలయం కోసం చెరువును పూడ్చడంతో పాటు అందుకు సమానంగా మరోవైపు భూమిని చెరువు కోసం సేకరించారు.
ఇందుకోసం రైతులకు రూ.30 కోట్ల పరిహారం చెల్లించారు. ఆలయం వద్ద నీటి సమస్య రాకుండా రూ.17.50 కోట్లతో మధ్యమానేరు నుంచి గుడి చెరువుకు లిఫ్టు ఏర్పాటు చేశారు. దీంతో 2018 నుంచి చెరువు నిండుకుండలా ఉంటోంది. ఆలయానికి తాగునీటి సరఫరా కోసం రూ.5 కోట్లతో మిషన్ భగీరథ పైపులైను ఏర్పాటు చేశారు. లక్షలాది మంది మహిళలు బోనంతో ఎండనక, వాననక గంటల పాటు రోడ్డుపై ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో రూ.17.50 కోట్లతో బద్దిపోచమ్మ ఆలయం దగ్గర సుమారు ఎకరం భూమి కొనుగోలు చేశారు. రెండు సంవత్సరాల సుదీర్ఘ సంప్రదింపులతో 200 మంది ఏకగ్రీవ తీర్మానంతో ఇది సాధ్యమైంది. ఒక్క నోటీసు లేకుండా, పోలీసుల అవసరం రాకుండా ఇంటి యజమానులు స్వయంగా బద్దిపోచమ్మ తల్లి కోసం తమ ఇండ్లను స్వయంగా తీసివేసుకున్న అరుదైన ఘటన ఇక్కడ జరిగింది.
రూ.15 కోట్లతో నూతన సత్రాలు,సముదాయాలు, రూ.2 కోట్లతో ఎంఆర్వో ఆఫీస్ కాంప్లెక్స్‌లో పార్క్(వీటీడీఏ), రూ.1.3 కోట్లతో 2018 నుంచి 600 మంది కళాకారులతో ప్రతి శివరాత్రికి 32 గంటల పాటు గుడి చెరువు ప్రాంగణంలో వేలాది భక్తుల జాగరణ సందర్భంగా ‘శివార్చన’ సాంస్కృతిక కార్యక్రమాలు.. ఇలా చాలా పనులు చేశారు. ఈ విధంగా వేములవాడ అభివృద్ధి పనులకు గత ప్రభుత్వ హయాంలో మొత్తం రూ.280.50 కోట్లను పారదర్శకంగా ఖర్చు చేశారు.
మాస్టర్ ప్లాన్‌లో ఇంకా మిగిలిన పనులివీ: మాస్టర్ ప్లాన్‌లోని ఇంకా అమలు కావలసిన పనుల ప్రాధాన్యాలు ఇలా ఉన్నాయి. 1. బోనాల సందర్భంగా లక్షలాది మంది మహిళలు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో అత్యంత వేగంగా బద్ది పోచమ్మ దేవాలయ పరిసరాల అభివృద్ధి, సౌకర్యాలు కల్పించడం. 2. ఆధునిక వసతులతో క్యూ కాంప్లెక్స్ నిర్మాణం (షిరిడీలో లాగా కూర్చునే సౌకర్యం, టాయిలెట్లు, వైద్య సదుపాయాలు) 3. ఈశాన్యం నుంచి లక్షలాది భక్తులు ఆలయానికి సులభంగా రావడానికి ప్రస్తుతం దూరంగా, అసౌకర్యంగా ఉన్న తిప్పాపురం బస్ స్టాండ్ బదులు కొత్త బస్టాండ్ నిర్మాణం. కరీంనగర్, కోరుట్ల, నిజామాబాద్ నుంచి వచ్చే అందరికి దేవాలయం దగ్గర 5 ఎకరాల్లో ఒకే చిన్న బస్టాండ్ ఉంది. అక్కడే పది ఎకరాల్లో బస్టాండ్ నిర్మాణం చేయాలి. అక్కడే పదివేల మంది భక్తులకు సరిపోయేలా సత్రాలు కట్టాలి.
బస్టాండ్ వద్దనే 5 ఎకరాల్లో పార్కింగ్ స్థలం కేటాయించాలి. మొత్తం 20 ఎకరాల సమీకరణకు రెండుసార్లు గతంలో నోటిఫికేషన్ ఇచ్చారు. వెంటనే మళ్లీ నోటిఫికేషన్ ఇచ్చి ఈ స్థలాన్ని సేకరించాలి. అంతేకాదు వేములవాడ కొత్త రైల్వేస్టేషన్ కూడా ఇక్కడి నుంచి 700 మీటర్ల దూరంలో రాబోతున్నది. రాజన్న దర్శనం తర్వాత భక్తులు ఇక్కడి నుంచే కొండగట్టుకి, ధర్మపురికి ప్రయాణిస్తారు. అందుకే ఈ స్థల సేకరణ అత్యంత కీలకం. ఇక చెరువు స్థలంలో ఈశాన్యంలో రెండవ పుష్కరిణి (రెండవ గుండం), కల్యాణకట్ట (కేశఖండన), నిత్య నివేదన సత్రాలు, ప్రసాదం కాంప్లెక్స్, శివ, శ్రీరామ కల్యాణోత్సవ మండపం, గుడి చెరువు ఘాట్ వద్ద తెప్పోత్సవ ఏర్పాట్లు చేయాల్సి ఉంది. ఘనమైన చరిత్ర ఉన్న శ్రీరాజరాజేశ్వర ఆలయం లోపలి ప్రాంగణంలో క్రిష్ణ శిలలతో మాత్రమే నిర్మాణాలు జరగాలి. పైన వివరించిన ప్రాధాన్యతా పనులను ప్రారంభించిన పిదప, అవన్నీ పురోగతిలో లేక చివరి దశలో ఉన్నప్పుడు గుడి లోపలి పనులు (ఇంటీరియర్) చేపట్టడం అత్యంత ఉపయుక్తమైన మార్గం.
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక 2025 అక్టోబర్ 19 నాడు శృంగేరి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ విధుశేఖర భారతీ మహాస్వామివారు వారి విజయయాత్ర సందర్భంగా వేములవాడకు విచ్చే సి రాజరాజేశ్వర స్వామివారిని దర్శించుకొని, దే వాలయ అభివృద్ధిపై రాష్ట్ర దేవాదాయ అధికారులతో, జిల్లా మంత్రివర్యులు, స్థానిక శాసనసభ్యు లు, పట్టణ ప్రముఖులు, స్థానిక అర్చకులతో సమాలోచనలు జరిపారు. అన్ని వర్గాల ప్రజలు కలిసికట్టుగా ఒక మంచి కార్యక్రమమైన ఆలయ అభివృద్ధికి తమ వంతు సహకారాన్ని అందించాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. వారి వం దన భాష్యంలో తొలుత ఆలయ అభివృద్ధి లక్ష్యా న్ని చాలా స్పష్టంగా తెలియపరిచారు. ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే.. గత ప్రభుత్వ హయాంలో అప్పటి 36వ శృంగేరి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ భారతీ తీర్థ మహాస్వామివారు కూడా ఇదే పంథాను సూచించారు. ఆ ప్రకారమే క్షుణ్ణంగా పైన వివరించిన మాస్టర్ ప్లాన్ తయారు చేశారు.
మొదట సౌకర్యాలపైన దృష్టిపెట్టాలి: కొత్తగా గుడి కట్టాల్సిన అవసరం గాని, దేవుడిని కొత్తగా ప్రతిష్ఠించాల్సిన అవసరం గాని వేములవాడలో లేనే లేదు. శృంగేరి పీఠాధిపతులవారు సూచించినట్టుగా ప్రస్తుత భక్తుల సౌకర్యాలు, భవిష్యత్తులో ఇంకా పెరిగే భక్తుల సంఖ్యను దృష్టిలో పెట్టుకొని శాస్ర్తోక్త విధానంలో వసతులతో పాటు దేవాలయ క్షేత్రాన్ని అభివృద్ధి చేయాలి. అందుకు అనుగుణంగానే గత బీఆర్ఎస్ ప్రభుత్వం మాస్టర్ ప్లాన్‌ను రూపొందించింది. పైన వివరించిన విధం గా ప్రాధాన్యతాపరంగా కార్యక్రమాలను చేపట్టినట్టయితే భక్తుల సౌకర్యాలు అంచెలంచెలుగా మెరుగుపడతాయి. అవి వెంటనే భక్తులకు అందుబాటులోకి వస్తాయి. కాబట్టి, గుడిని మూసివేయవలసిన అవసరం ఏర్పడదు. భక్తుల దర్శనాలు, మొక్కులు నిరంతరంగా కొనసాగించవచ్చు, వారి మనోభావాలు దెబ్బతినవు. అంతేకాదు, వేములవాడ పట్టణంలోని అన్ని రకాల చిన్న, పెద్ద వ్యాపారులు, సామాన్య ప్రజలు వారి జీవనోపాధిని కోల్పోయే ప్రమాదం ఉండదు. దీంతోపాటు దేవాలయ ఆదాయం నిర్విరామంగా కొనసాగుతూ భవిష్యత్తులో ఈ క్షేత్రాన్ని, వేములవాడ పట్టణాన్ని మరిం త గొప్పగా మార్చడానికి దోహదపడుతుంది.
(వ్యాసకర్త: పార్లమెంట్ మాజీ సభ్యులు, కరీంనగర్)
-బోయినపల్లి వినోద్‌కుమార్