ఎట్టకేలకు అమెరికా-ఇరాన్ యుద్ధం నిర్ణాయకంగా ఆగిపోయే సూచనలు వెలువడటం ముదావహం. కాల్పుల విరమణపై ఇరుపక్షాల మధ్య ఏకాభిప్రాయం కుదిరినట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనదైన ధోరణిలో సామాజిక మాధ్యమాల్లో వెల్లడించారు. ఫిబ్రవరి 28న మొదలు పెట్టిన ఇరాన్ యుద్ధం రోజుల్లో తేలిపోతుందని అమెరికా ప్రకటించినప్పటికీ అది కాస్తా వారాల్లోకి, నెలల్లోకి సాగిపోవడం ప్రపంచానికి తీవ్ర సమస్యగా మారింది. చమురు సంక్షోభం ఆర్థిక రంగాన్ని అతలాకుతలం చేస్తున్నది. ఈ నేపథ్యంలో కట్టకడకు ఏకాభిప్రాయం కుదిరినట్టు వెలువడిన వార్త ప్రపంచానికి ఊరటనిచ్చిందనడంలో సందేహ ం లేదు. ఈ ఆదివారమే సంతకాలు జరిగిపోతాయని ట్రంప్ అత్యుత్సాహంతో ప్రకటించేశారు. కానీ అంతిమంగా వచ్చే శుక్రవారం జెనీవాలో సంతకాలు జరుగుతాయని ఖరారైంది. ‘ఇల్లలుకగానే పండుగ కానట్టు’ ఈ ప్రకటనల సంరంభం ఎంతవరకు వాస్తవంగా పరిణమిస్తుందనేది ఇంకా పూర్తిగా స్పష్టం కాలేదనే చెప్పాలి. ఏకాభిప్రాయం కుదిరినట్టు ఇరాన్ కూడా ధ్రువీకరించినప్పటికీ ఏయే అంశాలపై ఏమేం అంగీకరించిందీ వివరాలు వెల్లడి కాకపోవడంతో దృశ్యం ఇంకా అస్పష్టంగానే ఉన్నదని చెప్పాలి.
అనాలోచితంగా యుద్ధాన్ని ప్రారంభించి అడ్డంగా దొరికిపోయిన అమెరికా ఏదోరకంగా ఒప్పందం కుదుర్చుకుని బయటపడాలని చూస్తున్న సంగతి ఇప్పటికే పలుసార్లు స్పష్టమైపోయింది. హొర్ముజ్‌లో చమురు ప్రవాహానికి ఇక ఎలాంటి అడ్డంకులు ఉండబోవని, నియంత్రణలు నిలిచిపోతాయని ట్రంప్ అట్టహాసంగా ప్రకటించినప్పటికీ జలసంధిలో నౌకల రాకపోకలపై ఇంకా స్పష్టత రాలేదు. ఒప్పందానికి మధ్యవర్తిత్వం వహించిన పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ప్రకటనలో హొర్ముజ్ ప్రస్తావనే లేకపోవడం గమనార్హం. మరోవైపు ఇరాన్ అధికార వార్తాసంస్థ మెహర్ ప్రకారం ఇరాన్ ’పర్యవేక్షణలో’ హొర్ముజ్‌లో రాకపోకల పునరుద్ధరణ జరుగుతుందని పేర్కొనడం విశేషం. అంటే ఇరాన్ చమురు నౌకలపై విధిస్తున్న టోల్ కొనసాగుతుందా? నిజానికి యుద్ధం ప్రారంభానికి ముందు నౌకల రాకపోకలకు ఎలాంటి సమస్యలు గానీ, టోల్ వసూలు గానీ లేవు. ఇజ్రాయెల్‌తో కలిసి అమెరికా మొదలు పెట్టిన యుద్ధం వల్ల కలిగిన నష్టాలను పూడ్చుకునేందుకు ఇరాన్ టోల్ భారీగా బాదుడు మొదలుపెట్టింది. దీనిని అదుపు చేసే ఉద్దేశంతో అమెరికా దిగ్బంధనానికి దిగింది. ఒప్పందం కోసం వెంపర్లాటలో ఇప్పుడు ఇరాన్ ఇష్టారాజ్యానికి హొర్ముజ్‌ను వదిలిపెట్టిందా అనేది ఇదమిద్ధంగా తేలాల్సి ఉన్నది. మొత్తంమీద యుద్ధానికి ముందునాటి స్థితికి హొర్ముజ్ తిరిగి వస్తుందా అనేది సందేహమే. ఏదీ ఏమైనప్పటికీ ట్రంప్ ప్రకటనతో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు 4 శాతం పైగా తగ్గడం శుభపరిణామం.
మరోవైపు ఇజ్రాయెల్ ఈ ఒప్పందానికి ఏమాత్రం సుముఖంగా లేదు. యుద్ధం వల్ల అమెరికాకు సొంతంగా ఆయుధ వ్యాపార ప్రయోజనాలున్నప్పటికీ అసలు సిసలు లబ్ధిదారు ఇజ్రాయెలే అని చెప్పాలి. పశ్చిమాసియాలో తనను సవాల్ చేసే మరో శక్తి ఏదీ ఉండకూడదనే ఇజ్రాయెల్ ఎత్తుగడలో అమెరికా ఇరుక్కుందనేది బహిరంగ రహస్యమే. ఇప్పుడు అందులో నుంచి బయటపడాలంటే అదే ఇజ్రాయెల్ ప్రధానమైన అడ్డంకిగా నిలుస్తున్నది. ఈ ఒప్పందంపై భారత్ సహా ప్రపంచ దేశాలు హర్షం ప్రకటిస్తుండగా ఇజ్రాయెల్ మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. ట్రంప్ ప్రకటించిన ఒప్పందం తమ దేశానికి ’వర్తించదని’ ఇరాన్ నేతలు ప్రకటనలు వెలువరిస్తున్నారు. తమ భద్రతకు ఏమాత్రం హామీ ఇవ్వని ఆ ఒప్పందానికి తాము కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదనేది వారి వాదన. ఈ ధోరణి అమెరికా-ఇరాన్ ఒప్పందానికి సమస్యలు సృష్టించే అవకాశాలు లేకపోలేదు. ఓవైపు లెబనాన్‌తో చర్చలు జరుపుతూనే, మరోవైపు హెజ్బొల్లాపై దాడులు కొనసాగిస్తూ అమెరికా-ఇరాన్ సంప్రదింపులకు ఇజ్రాయెల్ మోకాలడ్డుతున్నది. ఇరాన్‌తో అమెరికా కుదుర్చుకునే ఏ ఒప్పందమైనా ఇజ్రాయెల్ అంగీకారంతోనే ముందుకు సాగుతుందనేది వాస్తవం. యుద్ధం నుంచి బయటపడటం ఎంత ముఖ్యమో, ఇజ్రాయెల్‌ను దారికి తేవడమూ అంతే ముఖ్యమని అమెరికా గుర్తించాలి. అప్పుడే పశ్చిమాసియాలో శాంతికి బలమైన పునాదులు పడతాయి.