ఈసారి అమెరికా అధ్యక్ష ఎన్నికలు మన దేశంలో అనూహ్యమైన స్థాయిలో ఆసక్తిని కలిగించాయి. అమెరికా రాజకీయాల శిఖరాగ్రాన భారతీయం వెలిగిపోతుండటమే అందుకు కారణం. రిపబ్లికన్, డెమొక్రాట్ వైరిపక్షాల్లో ఎవరు గెలిచినా సంబురాలు జరుపుకొనే గమ్మత్తయిన పరిస్థితి నెలకొన్నదిక్కడ. తమిళ మూలాలు కలిగిన కమలా హ్యారిస్ డెమొక్రాటిక్ అభ్యర్థిగా ముందుకు రావడం పెద్ద పరిణామమే. కానీ, కథ కంచికి చేరలేకపోయింది. ఆమె గట్టిపోటీ ఇచ్చినా గట్టెక్కలేకపోయారు. అమెరికా పరిపాలనా పగ్గాలు మహిళల చేతికి వచ్చే అవకాశం చేజారిన రెండో సందర్భమిది.
ఇదివరకు హిల్లరీ క్లింటన్, ఇప్పుడు కమల ఓటమి పాలయ్యారు. ఇద్దరినీ ఓడించింది ఒక్కరే కావడం విశేషం. ఉత్కంఠ భరితంగా సాగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం పూర్తిగా ఊహించనిదేమీ కాదు. పోలింగ్ దగ్గర పడుతున్నకొద్దీ పారిశ్రామిక, వాణిజ్యవర్గాలు రిపబ్లికన్ వైపు మొగ్గుచూపడం, మీడియాలో అనుకూల కథనాలు వెల్లువెత్తడం గమనించినవారికి రాబోయే ఫలితాల గురించి ముందస్తుగానే అవగాహన ఏర్పడింది. ట్రంప్‌ను గెలిపించేందుకు టెక్ ది గ్గజం ఎలాన్ మస్క్ చేసిన హంగామా ఈసారి ఎన్నికల హైలైట్‌గా నిలవడం గమనార్హం. ట్రంప్‌తో జట్టు కట్టి ఉపాధ్యక్షునిగా ఎన్నికైన వాన్స్ సతీమణి ఉషా చిలుకూరి… ఏపీ ఆడబిడ్డ కావడం కొసమెరుపు.
భారత్-అమెరికా సంబంధాల మీద ట్రం ప్ విజయం ఎలాంటి ప్రభావాలు చూపుతుంది? అనేది ఇప్పుడు అందరి మెదళ్లలో మెదులుతున్న ప్రశ్న. ఆయన భారతీయులకు అపరిచితుడేమీ కాదు. ట్రంప్‌తో ప్రధాని నరేంద్ర మోదీకి గల సాన్నిహిత్యం జగమెరిగినదే. తొలివిడత పదవీకాలంలో ‘హౌడీ మోడీ’, ‘నమస్తే ట్రంప్’ వంటి ఆర్భాట ప్రచార కార్యక్రమాల్లో ఇద్దరూ కలిసి పాల్గొన్నారు. అయితే ఈ సాన్నిహిత్యం ద్వైపాక్షికంగా భారత్‌కు ఏ మేరకు లబ్ధి కలిగిస్తుందనేది ఇప్పుడే చెప్పలేం. ఎందుకంటే, ట్రంప్ మొదటినుంచీ ‘అమెరికాకే ప్రథమ ప్రాధాన్యం’ అన్న విధానాన్ని అనుసరిస్తున్నారు. ఇది రెండు దేశాల వాణిజ్య సంబంధాల్లో ఉద్రిక్తతలకు దారితీయవచ్చు. భారతీయ సుంకాలు అధికంగా ఉన్నాయని, తాను గెలిస్తే ప్రతీకార సుంకాలు వేస్తానని ఎన్నికల ప్రసంగాల్లో ట్రంప్ హెచ్చరించడం తెలిసిందే. ఐటీ, ఫార్మా, టెక్స్టైల్ రంగాలపై ఈ ధోరణి ప్రతికూల ప్రభావం చూపే అవకాశాలున్నాయి. డాలర్ మారకానికి ముకుతాడు వేయాలని బ్రిక్స్ వేదికగా భారత్ చేస్తున్న ప్రయత్నాలు రెండు దేశాల మధ్య పొరపొ చ్చాలు తేవచ్చు. భారతీయుల డాలర్ కలలకు ట్రంప్ ఏ మాత్రం సానుకూలం కాదనేదీ గుర్తుంచుకోవాలి. అమెరికన్ల ఉపాధి రక్షణకు వలసలను నిరోధించాలనే ఆలోచనతో వీసాలకు కోతపెట్టిన చరిత్ర ఆయనది.
రెండు అధ్యక్ష ఎన్నికల మధ్యకాలంలో ప్రపంచంలో ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి. ఉక్రెయిన్‌పై రష్యా దాడితో భీకర యుద్ధం రాజుకున్నది. గాజాలో ఇజ్రాయెల్ నరమేధంతో పాలస్తీనీయుల పరిస్థితి పెనం మీంచి పొయ్యిలో పడ్డట్టుగా తయారైంది. మరోవైపు పర్యావరణం శిథిలం కావడం వల్ల వాతావరణం వేడెక్కి ఉత్పాతాలు సంభవిస్తున్నాయి. వీటన్నిటిపై ట్రంప్ వైఖరి ఏమిటని ఆలోచిస్తే అంత సానుకూలతలేమీ ఉండకపోవచ్చనే సమాధానం వస్తుంది. ఎందుకంటే బయటి సమస్యల్లో అమెరికా ఎక్కువగా ఇరుక్కుపోవద్దని భావించే ట్రంప్ అనేక అంతర్జాతీయ ఒప్పందాలను గతంలో బుట్టదాఖలు చేసిన సందర్భాలున్నాయి. ఇరాన్ అణు ఒప్పందం నుంచి అమెరికా బయటకు రావడం అందుకు పెద్ద ఉదాహరణ. ఇక భూతాపం వంటి సమస్యలపైనా ట్రంప్ విధానాలు తెలిసినవే. అసలు అవి పూర్తిగా ఊహాకల్పిత సమస్యలని, దేనిలోనూ అమెరికా జవాబుదారీతనాన్ని తీసుకోవాల్సిన అవసరం లేదనేది ట్రంప్ విధానం. గతంలో కాప్ సదస్సుల్లో ఇది వివాదాలకు కారణమైంది. ఇవన్నీ మొదటి విడతలో అనుసరించిన విధానాలు. ఇప్పుడు నాలుగేండ్ల విరామం తర్వాత మరోసారి అధ్యక్ష పదవి చేపడుతున్న ట్రంప్ పరిపాలనలో మార్పులుంటాయా? అనేది త్వరలో తేలిపోతుంది.