డొనాల్డ్ ట్రంప్ సర్కార్ విధించిన సుంకాలు భారతీయ వస్త్ర పరిశ్రమ, ఎగుమతిదారులపై తీవ్రంగా పడింది. తమ ఆదాయం సగానికి పడిపోయినట్టు 34 శాతం వ్యాపార సంస్థలు నివేదించాయి. ఈ మేరకు కాన్ఫెడరేషన్ఆఫ్ ఇండియన్ టెక్స్టైల్ ఇండస్ట్రీ (సీఐటీఐ) నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. భారత వస్త్ర ఎగుమతుల కు అతిపెద్ద మార్కెట్ అమెరికా. మన దేశ మొత్తం వస్త్ర ఎగుమతుల్లో అమెరికా వాటా 10.8 బిలియన్ డాలర్లు కావడం గమనార్హం. భారత వస్త్ర ఎగుమతుల్లో ఇది సుమారు 30 శాతం.
భారత ఎగుమతులపై ట్రంప్ సర్కార్ 25 శాతం అదనపు సుంకం, 25 శాతం జరిమానా, మొత్తంగా 50 శాతం సుంకం విధించింది. ఇది మన వస్త్ర ఎగుమతులను తీవ్రంగా దెబ్బతీసింది. సెప్టెంబర్-అక్టోబర్ నెలల్లో 60 అగ్ర వస్త్ర ఎగుమతిదారులు, పరిశ్రమల సంఘాలతో మాట్లాడి సీఐటీఐ ఈ నివేదికను విడుదల చేసింది. పోటీని తట్టుకుని నిలబడటానికి 25 శాతం వరకు డిస్కౌంట్లు ఇస్తున్నట్టు 67 శాతం ఎగుమతిదారులు తెలిపారు. ఈ క్రమంలో నష్టాలను భరించాల్సి వస్తున్నదని సీఐటీఐ సెక్రెటరీ జనరల్ చంద్రిమా ఛటర్జీ పేర్కొన్నారు. ‘వస్త్ర పరిశ్రమ స్వల్ప మార్జిన్ కలిగిన వ్యాపారం. అయినప్పటికీ, వినియోగదారులను పోగొట్టుకోకుండా ఉండేందుకు చాలా కంపెనీలు డిస్కౌంట్లు ఇస్తూ నష్టాలను భరిస్తున్నాయి. అమెరికాతో చర్చలు జరుగుతున్న నేపథ్యంలో ఏదైనా ఉపశమనం కలుగుతుందని వస్త్ర పరిశ్రమలు ఆశిస్తున్నాయి’ అని ఛటర్జీ పేర్కొన్నారు.
భారతదేశ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో 2.3 శాతం వాటా కలిగిన, 4.5 కోట్ల మంది కార్మికులకు ఉపాధి కల్పిస్తున్న వస్త్ర పరిశ్రమలు పెట్టుబడుల ప్రవాహం మందగించడం సహా అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. దానికితోడు సుంకాల ప్రభావంతో అమ్మకాలు తగ్గిపోయి, ఆదాయాలు పడిపోయినట్టు భారతీయ వ్యాపారులు చెప్తున్నారు. అమెరికన్ల నుంచి డిస్కౌంట్ల కోసం అభ్యర్థనలు (30 శాతం), ఆర్డర్లను రద్దు చేయడం లేదా వాయిదా వేయడం (25 శాతం), ఆర్డర్ మొత్తంలో కోత (20 శాతం) తదితర కారణాల వల్ల ఆదాయాలు గణనీయంగా పడిపోయినట్టు పేర్కొంటున్నారు. ఆర్డర్ల మందగమనం కారణంగా గోదాంలలో స్టాక్ పేరుకుపోయి 85 శాతం కంటే ఎక్కువ మంది భారతీయ ఎగుమతిదారులు సతమతమవుతున్నారు. గతేడాది సెప్టెంబర్‌తో పోలిస్తే 2025 సెప్టెంబర్‌లో వస్ర్తాల ఎగుమతులు 10.34 శాతం తగ్గడం ఏ మాత్రం ఆశ్చర్యపరచలేదు. తత్ఫలితంగా చాలా మంది ఎగుమతిదారులు, ముఖ్యంగా ఎంఎస్ఎంఈలు (సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు) తీవ్రమైన మూలధన వ్యయం కొరతను ఎదుర్కొంటున్నాయి. అంతేకాదు, మూలధన వ్యయం అవసరాలు 30 శాతానికి పైగా పెరిగినట్టు 40 శాతం మంది ఎగుమతిదారులు నివేదించారు. ఇది వస్త్ర రంగంలో పెరుగుతున్న ఆర్థిక ఒత్తిడిని నొక్కిచెప్తున్నది.
భారతీయ వస్ర్తాలపై అమెరికా సుంకాల ప్రభావం దేశవ్యాప్తంగా స్పష్టంగా కనిపిస్తున్నది. ఎగుమతిదారులు, ముఖ్యంగా ఎంఎస్ఎంఈలు ఆర్డర్ల రద్దుతోపాటు పోటీతత్వాన్ని తట్టుకునేందుకు భారీ డిస్కౌంట్లు ఇస్తున్నాయి. వియత్నాం, బంగ్లాదేశ్ వంటి తక్కువ సుంకం ఉన్న దేశాలతో పోటీపడుతున్నందున పెద్ద, చిన్న పరిశ్రమలు కూడా తీవ్ర ఒడిదొడుకులను ఎదుర్కొంటున్నాయి.
అంతా స్థిరపడిన తరుణంలో అకస్మాత్తుగా వచ్చిన మార్పు తమ వ్యాపారాలను నాశనం చేసిందని సూరత్‌కు చెందిన జేపీ కాచివాలా కంపెనీ డైరెక్టర్ ధర్మేష్ కాచివాలా ఆవేదన వ్యక్తం చేశారు. ‘మేం పూర్తిగా అమెరికా మార్కెట్‌పై ఆధారపడ్డాం. యూఎస్ వినియోగదారులు కోరినట్టుగా అధిక నాణ్యతతో కూడిన వస్ర్తాలను తయారు చేస్తాం. కాబట్టి, మా పెట్టుబడి ఎక్కువగా ఉంటుంది. సుంకాల నేపథ్యంలో దేశీయ మార్కెట్లపై దృష్టిసారించాలని ఇప్పుడు సలహా ఇస్తున్నారు. కానీ, పోటీ తీవ్రంగా ఉంది. అంతేకాదు, దేశీయ మార్కెట్ లాభదాయకం కాదు’ అని ఆయన చెప్పారు.
దేశంలోని వస్త్ర పరిశ్రమ కుదేలైంది. ఒక్క సూరత్‌లోనే ఉత్పత్తిలో 30-40 శాతం క్షీణత, రూ.7,200 కోట్లకు పైగా ఆదాయం కోల్పోయినట్టు అంచనా. ఈ నేపథ్యంలో కర్మాగారాలు పనిదినాలను తగ్గించుకుంటున్నాయి. డిమాండ్ పడిపోవడంతో వస్త్ర పరిశ్రమలు ప్రమాదంలో పడ్డాయి. పండుగలు, పెళ్లిళ్ల సీజన్ కావడంతో దేశీయ మార్కెట్లో ప్రస్తుతం డిమాండ్ ఎక్కువగా ఉంది. కానీ, ఇది మూణ్నాలుగు నెలల్లో తగ్గిపోతుందని కాచివాలా అంచనా వేశారు. ‘మేం ఇతర ఎగుమతి మార్కెట్లను అన్వేషిస్తున్నాం. కానీ, కొత్త మార్కెట్లలో పాగా వేసేందుకు కనీసం ఆరు నెలల సమయం పడుతుంది. అమెరికాతో పోలిస్తే యూరోపియన్ మార్కెట్ల పరిమాణం చాలా తక్కువ. గత మూడు నెలలుగా మా పెట్టుబడులు కూడా తిరిగి రావడం లేదు’ అని ఆయన చెప్పారు.
సుంకాల ప్రభావాన్ని అధిగమించడానికి ఎగుమతిదారులు గల్ఫ్, ఆగ్నేయాసియాలోనూ భారీ డిస్కౌంట్లను అందిస్తున్నారు. ప్రత్యామ్నాయ ఉత్పత్తి స్థావరాలను అన్వేషిస్తున్నారు. యూకేతో భారత్ చేసుకుంటున్న స్వేచ్ఛావాణిజ్య ఒప్పందాలతో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. అయితే, అమెరికా సుంకాల ప్రభావాన్ని తగ్గించడానికి ప్రస్తుత రుణాల చెల్లింపుపై తాత్కాలికంగా వెసులుబాటు ఇవ్వాలని, మూలధన వ్యయం కోసం పూచీకత్తు లేని రుణాలు అందించాలని ప్రభుత్వాన్ని వస్త్ర పరిశ్రమలు కోరుతున్నాయి. ముడి పదార్థాల దిగుమతులపై ఉన్న ఆంక్షలు, దిగుమతి సుంకాలను తొలగించాలని అభ్యర్థిస్తున్నాయి. అంతేకాదు, సిబిల్ స్కోర్‌ను ప్రభావితం చేయకుండా రుణాలపై వడ్డీ మినహాయింపులను ఆశిస్తున్నాయి. ప్రభుత్వం ఉపశమన ప్యాకేజీని ప్రకటిస్తే తాత్కాలికంగా ఊపిరి పీల్చుకుంటామని, కార్మికుల ఉపాధిని కాపాడుకోగలమని పరిశ్రమ వర్గాలు చెప్తున్నాయి.
(‘ఇండియా టుడే’ సౌజన్యంతో…)
-సోనాల్ ఖేతర్పాల్,జుమానా షా