వలసాంధ్రుల పాలనా కాలంలో తెలంగాణ ప్రజలు అరిగోస పడ్డరు. ఆ అరువై ఏండ్ల కన్నీళ్లను, కష్టాలను చూడలేక తెలంగాణ ప్రాంతం ఓ బిడ్డను కన్నది. దాని పేరే టీఆర్ఎస్. తెలంగాణ తల్లి విముక్తి కోసం పద్నాలుగేండ్ల పాటు అహర్నిశలు కృషిచేసిన టీఆర్ఎస్ ఆఖరికి అనుకున్న ప్రత్యేక తెలంగాణ రాష్ర్టాన్ని సాధించింది. ‘తెలంగాణ జీవనయానాన్ని, టీఆర్ఎస్ పుట్టుక, ప్రస్థానాన్ని వేర్వేరుగా చూడలేం. ఆ రెండూ ఒక్కటే…’ అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చెప్పిన ఈ మాటలు అక్షర సత్యాలు. బీఆర్ఎస్ దిశను, తెలంగాణ దశను ఎన్నటికీ వేరు చేసి చూడలేం. తెలంగాణ అస్తిత్వం కోసం పుట్టిన పార్టీగా టీఆర్ఎస్ తన తల్లి తెలంగాణకు పునర్జన్మనిచ్చేందుకు తన ఉనికిని పణంగా పెట్టి, ఎన్నోసార్లు పురిటి నొప్పులను భరించింది. ఆ నొప్పుల వెనుక ఉన్న బాధేమిటో అనుభవించిన తల్లికే తెలుస్తుంది కానీ, మంత్రసానికి తెలువదు.
తెలంగాణ బాధే… టీఆర్ఎస్ గాథ.
టీఆర్ఎస్ పార్టీ పుట్టిందే తెలంగాణ బాధల్లోంచి, తెలంగాణ ప్రజల కన్నీటి గాథల్లోంచి. తెలంగాణకు కష్టం వస్తే బీఆర్ఎస్ కండ్లు చెమ్మగిల్లుతయి. తెలంగాణ కాలికి ముల్లు గుచ్చుకుంటే బీఆర్ఎస్ విలవిల్లాడుతుంది. రెండున్నర దశాబ్దాల కిందట పురుడుపోసుకున్న బీఆర్ఎస్ అధికారంతో సంబంధం లేకుండా ఇప్పటికీ తెలంగాణ రక్షణ, తెలంగాణ ప్రాంత ప్రయోజనాల కోసమే పరితపిస్తున్నది.
ఆరు దశాబ్దాల పాటు ఉమ్మడి భారాన్ని తన ఎదపై మోసి తెలంగాణ తల్లి గుండె బరువెక్కింది. మన సొమ్ముతో పరాయివాళ్లు పంచభక్ష్య పరమాన్నాలు తింటుంటే, సొంత బిడ్డలు పస్తులుండటాన్ని జూసి తెలంగాణ తల్లి కంట నీరింకిపోయింది. దాస్యశృంఖలాల సంకెళ్లను మోసి చేతులు కందిపోయినయి. పరాయి ప్రజల బతుకులకు కాపలా కాసి, ఉమ్మడి బరువును మోసి భుజాలు బరువెక్కిన సమయంలో చరిత్ర గర్భాన్ని చీల్చుకుంటూ కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ పురుడు పోసుకున్నది. నాటినుంచి తెలంగాణ తల్లి మోస్తున్న బరువును దించేందుకు, దాస్య శృంఖలాల సంకెళ్లను తెంచేందుకు టీఆర్ఎస్ చేయని ప్రయత్నం లేదు, తొక్కని గడప లేదు, వేయని అడుగు లేదు, సలపని పోరాటం లేదు. ఈ పార్టీకి తప్ప, మిగతా ఏ రాజకీయ పార్టీకి కూడా తెలంగాణ సోయి లేదనడంలో అతిశయోక్తి లేదు.
తెలంగాణ బతుకు మార్చేందుకు, ప్రజల జీవితాన్ని చక్కదిద్దేందుకు జరిగిన మహోజ్వల యజ్ఞంలో టీఆర్ఎస్ మొదట తానే సమిధ అయింది. తెలంగాణ ప్రజలకు కష్టం వస్తే కన్నీరు తీసింది. తెలంగాణకు నష్టమని తెలిస్తే నిప్పుకనికై మంట పుట్టించింది. 2001, ఏప్రిల్ 27న చిన్న కుటీరంలో పురుడు పోసుకున్న టీఆర్ఎస్.. 2014 జూన్ 2న తెలంగాణకు పురుడుపోసింది.
పద్నాలుగేండ్ల సుదీర్ఘ ఉద్యమంలో ఎన్నో కొత్త పోరాట రూపాలకు టీఆర్ఎస్ జీవం పోసింది. సాగరహారం, మిలియన్ మార్చ్, సకలజనుల సమ్మె, వంటావార్పు, పల్లెనిద్రలు, సైకిల్ యాత్రలు లాంటి ఎన్నో శాంతియుత ఉద్యమాలకు ముగ్గుపోసింది. అంతేకాదు, బరిగీసి కొట్లాడింది. నిరుద్యోగుల నుంచి ఉద్యోగుల వరకు, బస్సు డ్రైవర్ల నుంచి ఎయిర్ బస్ పైలెట్ల వరకు, విద్యార్థుల నుంచి అధ్యాపకుల వరకు, పిల్లాజెల్ల నుంచి ముసలీ ముతక వరకు అందర్నీ ఏకం చేసింది టీఆర్ఎస్సే. నీళ్లు, నిధులు, నియామకాల నినాదాన్ని తన విధానంగా మార్చుకొని పోరు బరిలో నిలిచింది, ప్రజలను నిలిపింది. పదవుల కోసం ఆరాటపడకుండా నిత్య పోరాటం చేసింది. అదరక, బెదరక కదనరంగంలో కాలుదువ్వి తెలంగాణను సాధించి విజయనాదం చేసింది.
కొట్లాడి సాధించుకున్న తెలంగాణను కేంద్రంతో పోట్లాడి మరీ అభివృద్ధి చేసింది. ప్రజలను ప్రగతిపథంలో నడిపించింది. తెలంగాణ ప్రగతి రథచక్రాలను పరుగులు పెట్టించింది. ఉద్యమకాలంలో తెలంగాణ ప్రజల కష్టాలను, కడగండ్లను కండ్లారా చూసిన కేసీఆర్.. స్వరాష్ట్రం సాధించాక ఆ కష్టాలను కనుచూపు మేరలో కనిపించకుండా అధఃపాతాళంలో పాతిపెట్టారు. కానీ, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆ కష్టాలను బుల్డోజర్లు పెట్టి మరీ తవ్వుతున్నది. ప్రజలను నష్టాల పాలు చేస్తున్నది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ తల్లి మరోసారి తను కన్నబిడ్డ బీఆర్ఎస్ను తలచుకుంటున్నది.
తనను బాధ పెడుతున్న సవతి బిడ్డ చెర నుంచి విడిపించాలని మొర పెట్టుకుంటున్నది. తన బిడ్డలకు ఏదైనా కష్టం వచ్చిందని తెలిస్తే కేసీఆర్ ఆలోచిస్తారేమో గానీ, తెలంగాణ తల్లికి కష్టం వచ్చిందని తెలిస్తే మాత్రం అరక్షణం కూడా ఆలోచించరు. క్షణాల్లో ఆ కష్టానికి ఎదురుగా నిలుచుంటారు. కాంగ్రెస్ హయాంలో తెలంగాణ పడుతున్న కష్టాలను చూడలేక బీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశం రూపంలో కేసీఆర్ సమరశంఖం పూరించారు. పార్టీ నాయకులను, కార్యకర్తలను సమాయత్తం చేశారు. ఎన్నో ఘన విజయాలు సాధించిన టీఆర్ఎస్ పార్టీ… ఆవిర్భావ రజతోత్సవాలను ఎంతో ఉత్సాహంగా జరుపుకోవాల్సిన సమయం ఇది. అయినప్పటికీ తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం తమ అధినాయకుడు కేసీఆర్ పూరించిన సమరశంఖ నాదంతో బీఆర్ఎస్ శ్రేణులు మళ్లీ ఉద్యమోత్సాహమే ఊపిరిగా ఉరకలెత్తుతున్నాయి.
– (వ్యాసకర్త: ఇండిపెండెంట్ జర్నలిస్ట్)
నర్మాల పరంధాములు