ఒక ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తే స్థానిక సంస్థలు ఎలా బలోపేతమ వుతాయో చెప్పటానికి తెలంగాణనే ప్రత్యక్ష ఉదాహరణ. ఉమ్మడి ఏపీలో సర్కారు సాయం లేక కునారిల్లిన స్థానిక సంస్థలకు.. 2014లో కేసీఆర్ తెలంగాణ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కొత్తగా జవసత్వాలు అందాయి. ఇయ్యాల తెలంగాణ పల్లెలు దేశంలోనే ఆద ర్శంగా నిలుస్తున్నాయి. అయినప్ప టికీ కొందరు సర్పంచ్‌లు, ఎంపీటీ సీలు, జెడ్పీటీసీలు ఇతర పార్టీల మాయలో పడి ఈ అభివృద్ధిని చూడ నిరాకరించటం విచారకరం.
ప్రతి పల్లె పచ్చబడాలె.. ప్రతి ఇల్లు శుభ్రంగా ఉండాలనే ఉద్దేశంతో కేసీఆర్ నూతన పంచాయతీరాజ్ చట్టం తీసుకొచ్చి స్థానిక ప్రభుత్వాలను క్రియాశీలకం చేశారు. ప్రతి గ్రామ పంచాయతీకి సరిపోను సిబ్బంది, కార్మికుల నియామకం, ప్రతి పల్లెకు ట్రాక్టర్, నెలనెలా నిధులు, నిరంతర పర్యవేక్షణతో తెలంగాణ గ్రామాలు కళకళలాడుతున్నాయి. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఏ కేటగిరీలో అవార్డులు ప్రకటిస్తున్నా.. టాప్-20లో 10-15 అవార్డులు తెలంగాణకే లభిస్తున్నాయి. సీఎం కేసీఆర్ దార్శనికత, స్థానికసంస్థల అభివృద్ధిపై ఆయనకున్న అంకితభావమే దీనికి కారణం.
అయితే కొందరు సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు ఇతర పార్టీలో మాయలో పడి తమ ఎదుగుదలను తామే అడ్డుకుంటున్నారు. ప్రభుత్వాన్ని దెబ్బతీసే కుట్రలో భాగంగా కొన్ని పార్టీలు సర్పంచులను చేరదేసి, వారితో నిరసనలు జరిపిస్తున్నాయి. నేను సర్పంచ్ మిత్రులను సూటిగా అడుగుతున్న. గ్రామంలో ప్రత్యేక నర్సరీ పెట్టి పచ్చదనం కోసం ఇంత ప్రాధాన్యం ఇచ్చిన ప్రభుత్వం గతంలో ఉందా? అంతకుముందు నామమాత్రంగా ఉన్న సర్పంచ్ల గౌరవ వేతనాన్ని పెంచిన ఏకైక ప్రభుత్వం బీఆర్ఎస్ సర్కారు కాదా? గ్రామంలో సీసీరోడ్లు, నూతన గ్రామ పంచాయతీ భవ నం, ఇంటింటి నుంచి తడి, పొడి చెత్త తరలించడానికి ట్రాక్టర్ గతంలో చూశారా? పేదలు చనిపోతే అంతిమ సంస్కారాలు నిర్వహించడానికి గతంలో ఎన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చేది? ఇప్పుడు ప్రతి పల్లెలో వైకుంఠధామాల నిర్మాణం ఎవరి వల్ల జరిగిందో గుర్తుకురావడం లేదా? గతంలో నాలుగు ఊర్లకు ఓ పంచాయతీ కార్యదర్శి ఉంటే.. ప్రజలు ఏ దరఖాస్తు పెట్టుకోవాలన్నా, కార్యదర్శి కోసం ఊర్ల వెంబడి తిరగాల్సి ఉండె. ఇప్పుడు ఆ పరిస్థితి ఉన్నదా? కేసీఆర్ ప్రభుత్వం ప్రతి గ్రామ పంచాయతీకి ఓ కార్యదర్శిని నియమించి ప్రజల సమస్యలకు సత్వర పరిష్కారం లభించేలా కృషిచేస్తున్న విషయం మీకు కనిపించడం లేదా? ఒక్క మేజర్ గ్రామ పంచాయతీ ఉంటే.. దానిచుట్టూ 20 తండాలు.. సరైన రోడ్లు, వీధి లైట్లు లేక ఎన్నో కష్టాలుండేవి. కానీ సీఎం కేసీఆర్ 500 జనాభా ఉన్న ప్రతి తండాను గ్రామ పంచాయతీగా చేసి, వాటిల్లో ఎస్టీలనే సర్పంచ్‌లను చేసి స్థానిక పాలన వారి చేతు ల్లో పెట్టారు. ఉమ్మడి రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఇలా చేసింది? ఏదో పార్టీ ఏదో ముచ్చట చెప్తే.. ఇంత అభివృద్ధి చేస్తున్న సర్కారును నిందిస్తరా? తెలంగాణలో ఏ మూరుమూల పల్లెకు వెళ్లి చూసినా ఈ రోజు పచ్చదనం పరిఢవిల్లుతున్నది.
ప్రతి ఇంటి ఆవరణ శుభ్రంగా కనిపిస్తున్నది. దోమల్లేవు.. డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వంటి జబ్బులు అమాంతం తగ్గిపోయాయి. ఈ ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిది కాదా? ఇదంతా మరిచి ఎవరి కోసమో అవాకులు చెవాకులు ఎలా పేలుతారు. గ్రామ పంచాయతీలకు గతంలో ఏ ప్రభుత్వం నెలనెలా స్టేట్ ఫండ్ రిలీజ్ చేసింది? గ్రామంలో పారిశుద్ధ్య కార్మికులకు రూ.7500 ఇస్తున్న ప్రభుత్వం ఎక్కడైనా ఉందా?
జాతీయ పార్టీలమని చెప్పుకుంటున్న బీజేపీ, కాంగ్రెస్.. రాష్ట్రం లో ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతూ రాజకీయంగా ఉనికి కోసం కొందరు సర్పంచ్‌లను పావులుగా వాడుకుంటున్నాయి. వారిని ప్రభుత్వం మీదికి రెచ్చగొడుతూ గందరగోళం సృష్టిస్తున్నాయి. బీజేపీ, కాంగ్రెస్ రాష్ట్ర పెద్దలు గుండె మీద చెయ్యి వేసుకొని చెప్పాలె.. మీరు అధికారంలో ఉన్న ఇతర రాష్ర్టాల్లో గ్రామ పంచాయతీలు తెలంగాణ పల్లెల స్థాయిలో ఉన్నయా? ఇప్పటికీ కరెంట్, తాగునీరు సౌలత్ లేని గ్రామాలు మీ పాలనలో అనేకం ఉన్న విషయం మీకు ఎందుకు గుర్తుకురావడం లేదు. 2022లో స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డుల్లో తెలంగాణ సత్తా చాటింది. ఫాస్ట్ మూవింగ్ సిటీల విభాగంలో రాష్ట్రంలోని ఏడు మున్సిపాలిటీలకు అవార్డులు వరించాయి. ఈ స్థాయిలో అవార్డులు బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ర్టాలకు ఎందుకు రావడం లేదు? జాతీయ పంచాయతీ అవార్డులకు పోటీ పడటంలోనూ తెలంగాణ దేశంలోని ఏ రాష్ర్టానికి అందనంత ఎత్తులో నిలిచింది. నిరుడు దేశంలోని మొత్తం 2.68 లక్షల గ్రామ పంచాయతీల్లో 36,677 ఈ పోటీలో పాల్గొన్నాయి. వీటిలో ఏకంగా 9,786 పంచాయతీలు తెలంగాణవే. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల నుంచి పోటీపడినవి మన దాంట్లో సగం కూడా లేవు. గతేడాది ఏప్రిల్‌లో జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అవార్డుల్లో తెలంగాణకు 19 పురస్కారాలు లభించాయి. 2021లో 12 అవార్డులు, 2020లో 10 లభించాయి. ఈ అవార్డులు ఊరికే ఇవ్వరు కదా? దీనికి బీజేపీ, కాంగ్రెస్‌ల దగ్గర సమాధానం లేదు.
కేంద్ర ప్రభుత్వం రాష్ర్టాన్ని ఆర్థికంగా ఇబ్బందుల పాల్జేసినా, రుణ సేకరణకు అడ్డంకులు సృష్టించినా, ఇవ్వాల్సిన నిధులను సరిగా ఇవ్వకపోయినా రాష్ట్రం మాత్రం పంచాయతీలకు పక్కాగా నిధులు విడుదల చేస్తున్నది. పంచాయతీలకు ప్రతి నెలా రూ.256.66 కోట్లను జమచేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేదు. దీన్ని గుర్తించకుండా పార్టీల మాయలో పడి రాష్ట్ర సర్కారును నిందించడం సరికాదు. రాష్ట్రంలోని 12,769 గ్రామ పంచాతీయల సర్పంచ్‌లకు ప్రజల హృదయాల్లో స్థానం ఉన్నది. గతంలో ఎప్పుడూ లేనంత అభివృద్ధి, పచ్చదనం వీరి హయాంలోనే సాధ్యమైందని ప్రజల మనుసుల్లో వారు చెరగని ముద్ర వేసుకున్నారు. ఆ గౌరవాన్ని కాపాడుకుంటూ.. ఆ అవకాశం ఇచ్చి న ప్రభుత్వంతో కలిసి నడువాలి.
(వ్యాసకర్త: ఎంపీపీ, నర్మెట్ట మండలం)
-తేజావత్ గోవర్ధన్ నాయక్
96666 77263