ప్రపంచ వాణిజ్యంలో పర్యాటకరంగం ఎంతో కీలకమైనది. కొన్ని దేశాల ఆర్థికవ్యవస్థలు పూర్తిగా పర్యాటకరంగంపైనే ఆధారపడి ఉన్నాయి. ఈ రంగం ద్వారానే పలు దేశాలకు విదేశీ మారక ద్రవ్యం కూడా సమకూరుతున్నది. అయితే, గత కొన్నేండ్లుగా ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం తన స్థాయిని మార్చుకుంటున్నది. ఒకప్పుడు పర్యాటకం ఒక విలాసం కాగా.. ఇప్పుడు అది నిత్యావసరం. ప్రజల జీవన స్థాయుల్లో వచ్చిన మార్పులే అందుకు ప్రధాన కారణం.
Tourism | నేటి సమాజంలో మనిషి నిత్యం ఎన్నో సమస్యలు, ఆలోచనలు, ఒత్తిడితో కూడుకున్న జీవితాన్ని గడుపుతున్నాడు. ముఖ్యంగా బ్యాంకింగ్, ఫైనాన్స్, బీమా, ఐటీ వంటి రంగాల్లో పనిచేసేవారి జీవితం ఎంతో ఒత్తిడితో కూడుకున్నది. అందుకే, అలాంటివారు ఒత్తిడి, సమస్యల కు దూరంగా ఏదో ఒక ప్రదేశానికి వెళ్లి సేద తీరుతున్నారు. గత కొన్నేండ్లుగా పర్యాటక రంగంలో నమోదవుతున్న వృద్ధే అందుకు నిదర్శనం.
వరల్డ్ బ్యాంకు డేటా ప్రకారం.. 1995 లో ప్రపంచవ్యాప్తంగా పర్యాటకుల సంఖ్య 1.08 బిలియన్లు ఉండగా.. 2019 నాటికి అది 2.4 బిలియన్లకు చేరుకున్నది. ఇక ఆదాయపరంగానూ పర్యాటకరంగం ముం దంజలో ఉన్నది. 1995లో ప్రపంచవ్యాప్తంగా పర్యాటక ఆదాయం 427.57 బిలియన్ డాలర్లు కాగా.. 2019 నాటికి అది 1.47 ట్రిలియన్ డాలర్లకు చేరుకున్నది. ప్రపంచ పర్యాటక, ప్రయాణ మండలి ప్రకా రం.. 1995లో ప్రపంచ స్థూల జాతీయోత్పత్తిలో ట్రావెల్ అండ్ టూరిజం రంగం వాటా సుమారు 1.5 శాతం ఉండగా అది 2019 నాటికి 10.3 శాతానికి చేరుకున్నది. 2019 నాటికి ప్రపంచవ్యాప్తంగా సుమారు 330 మిలియన్ల మందికి పర్యాటకరంగంలో ఉపా ధి లభించింది.
ప్రతీ పది మందిలో ఒకరు పర్యాటకరంగంలో ఉపాధి పొందుతున్నవా రే. ఇక పెట్టుబడుల విషయానికి వస్తే.. 2010లో ఈ రంగంలో సుమారు 754.6 బిలియన్ డాలర్ల పెట్టుబడుల ప్రవాహం ఉం డగా.. అది 2019 నాటికి 1.1 ట్రిలియన్ డాలర్లకు చేరుకున్నది. ఇది మొత్తం ప్రపంచవ్యాప్తంగా అన్నిరంగాల పెట్టుబడుల ప్రవాహంలో 4.5 శాతం. ఈ గణాంకాలు చాలు పర్యాటకరంగం ప్రాముఖ్యాన్ని చెప్పడానికి. ఇక, మన దేశంలోనూ పర్యాటకరంగం చాలా కీలకమైనది. 2001లో విదేశీ పర్యాటకుల రాక కేవలం 2.54 మిలియన్లు ఉండ గా అది 2019 నాటికి 10.93 మిలియన్లకు చేరుకున్నది. అదేవిధంగా, విదేశీ మారక ద్రవ్యం 2001లో 3,198 మిలియన్ డాల ర్లు రాగా.. 2019 నాటికి అది సుమారు 30,058 మిలియన్ డాలర్లకు చేరుకున్నది.
2019 వరకు దూసుకుపోయిన పర్యాటకరంగం కరోనా మహమ్మారి కారణంగా దారుణంగా దెబ్బతిన్నది. మన దేశంతో పాటు, ప్రపంచవ్యాప్తంగా టూరిజం, ట్రావెల్ సంస్థలు ఎన్నడూ లేని గడ్డు పరిస్థితిని ఎదుర్కొన్నాయి. ప్రత్యక్షంగా, పరోక్షంగా ఈ రంగంపై ఆధారపడిన లక్షల మంది రోడ్డునపడ్డారు. పర్యాటకానికి అనుబంధంగా ఉన్న హోటల్, ట్రావెల్, ఇతర సంస్థలు నష్టపోయాయి.
అయితే, 2021 నుంచి పర్యాటకరంగం గాడిన పడుతున్నది. ప్రపంచవ్యాప్తంగా పరుగులు పెడుతున్నది. వరల్డ్ టూరిజం బారోమీటర్-2024 నివేదిక ప్రకారం.. అంతర్జాతీయ పర్యాటకుల సం ఖ్య 2020లో 407 మిలియన్లు, 2021లో 457 మిలియన్లు, 2022లో 960 మిలియన్లు, 2023లో 1286 మిలియన్లకు చేరుకున్నది. కానీ, 2019కి ముందర వృద్ధితో పోలిస్తే ఇది చాలా తక్కువ. ఇక అంతర్జాతీయ పర్యాటక ఆదాయం కూడా 2020లో 558 బిలియన్ డాలర్లు, 2021లో 638 బిలియన్ డాలర్లు, 2022లో 1120 బిలియ న్ డాలర్లు, 2023లో 1380 బిలియన్ డాలర్లకు ఎగబాకింది. ఇక భారత్ విషయానికి వస్తే.. 2020లో 2.74 మిలియన్లు, 2021లో 1.52 మిలియన్ల మంది విదేశీ పర్యాటకులే వచ్చారు. ఆ తర్వాత 2022లో 6.44 మిలియన్లు, 2023లో 9.2 మిలియన్లకు ఈ సంఖ్య చేరుకోవడంతో పర్యాటకం తిరిగి పట్టాలెక్కింది. విదేశీ మారక ఆదాయంలోనూ 2020లో 50,136 కోట్ల నుం చి 2023 నాటికి సుమారుగా 1,75,000 కోట్లకు చేరుకున్నది.
కరోనా తర్వాత భారత్లో పర్యాటక రంగం గాడినపడేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగు చర్యలు తీసుకున్నాయి. 2022లో స్వదేశ్ దర్శన్ పథకం కింద 71 ప్రాజెక్టుల అభివృద్ధి కోసం రూ.5,500 కోట్లను కేంద్రం కేటాయించింది. 500కు పైగా పర్యాటక ప్రదేశాల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరిచింది. హెరిటేజ్ సర్క్యూట్ థీమ్ కింద 10 కొత్త ప్రాజెక్టులను మంజూరు చేసింది.
పర్యాటకం అంటే కేవలం అందమైన ప్రదేశాలు చూడటమే కాదు. వైద్యం, విద్య, వ్యాపార అవసరాలు, విశ్రాంతి తీసుకోవడానికి వివిధ ప్రాంతాలకు వెళ్లేవారిని కూడా పర్యాటకులనే అంటారు. ఇప్పటికే హెల్త్ టూరిజంలో భారత్ ప్రపంచంలోనే 5వ స్థానంలో ఉన్నది. 2023లో భారత హెల్త్ టూరిజం మార్కెట్ 6.79 బిలియన్ డాలర్లకు చేరుకున్నది. ఇలా పర్యాటకం ద్వారా సమకూరే విదేశీ మారక ద్రవ్యం వల్ల రూపా యి బలపడుతున్నది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చర్యల వల్ల పర్యాటకం, దాని అనుబంధ రంగాలు వృద్ధి చెందుతూ దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నాయి.
(వ్యాసకర్త: అసిస్టెంట్ ప్రొఫెసర్, సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కేరళ)
(నేడు ప్రపంచ పర్యాటక దినోత్సవం)
డాక్టర్ రామకృష్ణ బండారు
79057 51940