‘ఆఖరి మోకా, ఔర్ ఏక్ దక్కా’, ‘తెలంగాణ కోసమే, తెలంగాణ జర్నలిస్టులు’ ఉద్యమం దారిపొడవునా వినిపించిన నినాదాలు ఇవి. పోరాటమే ఎజెండాగా, తెలంగాణమే ఊపిరిగా, స్వరాష్ట్రమే లక్ష్యంగా తెలంగాణ జర్నలిస్టులు గర్జించిన సందర్భం మే 31. సరిగ్గా 25 ఏండ్ల క్రితం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్ వేదికగా, 2001 మే 31న ఏర్పడ్డ సంస్థ తెలంగాణ జర్నలిస్టుల ఫోరం. సీనియర్ ఎడిటర్ అల్లం నారాయణ నాయకత్వంలో జర్నలిస్టులు క్రాంతి కిరణ్, ఏ రమణ కుమార్, పిట్టల శ్రీశైలం, శశికాంత్, ఏ రాజేశ్, కందుకూరి రమేశ్‌బాబు సభ్యులుగా ఏర్పడ్డ సంస్థ తెలంగాణ జర్నలిస్టుల ఫోరం.
దివంగత ప్రొఫెసర్ జయశంకర్ సార్ మార్గనిర్దేశంలో, అల్లం నారాయణ నాయకత్వంలో ఒక్కొక్క అడుగు వేసుకుంటూ ముందుకు సాగింది. ఎన్నో అవమానాలు, అవహేళనలు, ఎక్కిరింపులు అన్నిటినీ దిగమింగుకొని.. ‘ఎత్తుకున్నాం తెలంగాణ జెండాను… వొత్తుకున్నాం కంటతడిని’ అని పాడుకుంటూ, ‘ఏక్ హీ రాస్తా… ఏక్ హీ రాస్తా… తెలంగాణ ఏక్ హీ రాస్తా’ అని నినదించుకుంటూ పోరాడిన సంస్థ టీజేఎఫ్.
తెలంగాణ ఉద్యమంలో అనేక వైరుధ్యాలు, భిన్న భావాలు కలిగిన రాజకీయ పార్టీలు, విద్యార్థి, ఉద్యమ, ప్రజా సంఘాలను ఒకే వేదిక మీదకు తీసుకువచ్చి తెలంగాణ రాష్ట్ర సాధనే మన ఏకైక లక్ష్యం అని చాటి చెప్పిన సంస్థ టీజేఎఫ్. తెలంగాణ అమరవీరుల స్థూపం గన్‌పార్క్ నుంచి సుందయ్య విజ్ఞాన కేంద్రం వరకు, అక్కడి నుంచి ఇందిరాపార్క్ వరకు, తెలంగాణ గల్లీల నుంచి ఢిల్లీ వరకు, వేలాదిమందిని కదిలించి తెలంగాణ కోసం కదం తొక్కించిన సంస్థ టీజేఎఫ్. 14 ఏండ్ల పాటు అన్ని పార్టీలను, ఉద్యమ సంస్థలను సమన్వయం చేసుకుంటూ, కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వరకు అలుపెరగని నిరంతర పోరాటం చేసిన ఏకైక జర్నలిస్టుల సంస్థ టీజేఎఫ్.
మమ్మల్ని ‘దారితప్పిన తమ్ముళ్లు’ అని అవహేళన చేసి వ్యాసాలు రాశారు కొందరు. మమ్మల్ని అవహేళన చేసిన వారికి మేము నడిచిన దారే సరైన దారి అని, తెలంగాణ రాష్ట్ర సాధనే ఏకైక మార్గమని 14 ఏండ్ల పాటు పోరాట పటిమతో సమాధానం చెప్పాం. టీజేఎఫ్ నడిచిన దారే… కాలిబాటై, బండ్ల బాటై, కంకర రోడ్డు అయి, డాంబర్ రోడ్డు అయి, జాతీయ రహదారి అయ్యింది. అదే తెలంగాణ దారి అయ్యింది. ‘ఆఖరి మోకా, ఔర్ ఏక్ దక్కా,‘ ‘తెలంగాణ కోసమే, తెలంగాణ జర్నలిస్టులు’ అని ఎందుకు అన్నామంటే, 1969లో మొదలైన ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం ఎలా విఫలమైందో చూశాం కాబట్టి, కేసీఆర్ నాయకత్వంలో ఏర్పడ్డ టీఆర్ఎస్తోనే రాజకీయంగా, ప్రజాస్వామ్య పద్ధతిలో తెలంగాణ రాష్ట్రం సాధ్యమని బలంగా నమ్మి ‘ఆఖరి మోకా, ఔర్ ఎక్ దక్కా’ అని నినదించాం.
తెలంగాణ బిల్లు పార్లమెంటులో ఆమో దం పొందిన తర్వాత, నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో టీజేఎఫ్ ఆధ్వర్యంలో పదివేల మంది జర్నలిస్టులతో 2014 మార్చి 9న జర్నలిస్టుల జాతర ఏర్పాటు చేశాం. ఈ భారీ సభలోనే టీజేఎఫ్ స్వరాష్ట్రంలో తెలంగాణ జర్నలిస్టుల సంక్షేమం కోసం ఆనాటి ఉద్యమ నేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్- టీయూడబ్ల్యూజేగా ఆవిర్భవించింది. 14 ఏండ్ల్ల సుదీర్ఘ పోరాటం తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైంది. ఉద్యమ నేత కేసీఆర్ తొమ్మిదిన్నరేండ్లపాటు ముఖ్యమంత్రిగా పనిచేశారు. సమైక్యాంధ్రప్రదేశ్‌లో జరిగిన అన్యాయాలను ఒక్కటొక్కటిగా సరిదిద్దుతూ… నీళ్లు, నిధులు, నియామకాలను తెలంగాణకే దక్కేలా చేశారు.
ఇప్పుడు రెండున్నరేండ్లుగా తెలంగాణ అస్తిత్వాన్ని, సంస్కృతిని, భవిష్యత్తును దెబ్బతీసే చర్యలు జరుగుతున్నాయి. కృష్ణా, గోదావరి జలాలను సీమాంధ్రులు యథేచ్ఛగా తరలించుకుపోయే కుట్రలు, హైదరాబాద్‌లో సమైక్యాంధ్రవాద, తెలంగాణ వ్యతిరేకులు అయిన ఆంధ్రా నేతల విగ్రహాలు, ఒక్కటొక్కటిగా తెలంగాణను పెకిలించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మళ్లీ ఒకసారి తెలంగాణ బుద్ధి జీవులు, మేధావులు, జర్నలిస్టులు నినదించి పోరాడాల్సిన సమయం వచ్చింది. త్యాగాల పునాదుల మీద సాధించుకున్న తెలంగాణ ఆగమైపోయే రోజులు వచ్చే ప్రమాదం కనిపిస్తున్నది. ఉద్యమ కాలం నాటి స్ఫూర్తిని మనలో మళ్లీ ఒకసారి నింపుకొందాం, పోరాట రూపమై కదం తొక్కుదాం. మే 31 స్ఫూర్తిని చాటుదాం.
– (వ్యాసకర్త: సీనియర్ జర్నలిస్ట్)
ఎ.రమణకుమార్