కేంద్ర,రాష్ట్ర సంబంధాల్లో సఖ్యత లేకపోవడంపై తీవ్ర చర్చ నడుస్తున్న తరుణంలో రాష్ట్రాల స్వయం ప్రతిపత్తిని తమిళనాడు సీఎం స్టాలిన్ తెరపైకి తెచ్చారు. ఇది పూర్తిగా సాధ్యమేనా అనే అంశంపై ఇప్పుడు దేశమంతా చర్చ నడుస్తున్నది. అయితే కేంద్రం, రాష్ర్టాల్లో వేర్వేరు పార్టీలు పాలన చేస్తున్నప్పటికీ, ప్రజా సంక్షేమమే పరమావధిగా భావించాలి. రాజకీయ లబ్ధి కోసం కాకుండా రాజ్యాంగ నిర్మాతలు చూపిన బాటలో నడుస్తూ పరస్పరం సర్దుకుపోతూ, ప్రగతి సాధించాల్సిన అవసరం దేశానికి ఎంతో ఉంది.
కేంద్ర, రాష్ట్ర సంబంధాలపై ఎన్డీయే ప్రభుత్వపు పదేండ్ల కాలంలో చర్చ మరింత తీవ్రమైంది. వాస్తవానికి 1970ల నుండే కేంద్రం-రాష్ర్టాల సంబంధాలపై చర్చ ఉన్నది. ఏయే అంశాల్లో కేంద్ర ప్రభుత్వం జోక్యం ఉంటే బావుంటుంది. ఏయే అంశాలకు పరిమితం అయితే సమాఖ్య స్ఫూర్తి దెబ్బ తినకుండా ఉంటుందనే అంశాలపై కొన్ని రాష్ర్టాల్లో నాటి అధికార పార్టీలు పలు సూచనలు, తీర్మానాలు సైతం చేశాయి. ఈ మధ్య తమిళనాడు విషయంలో సుప్రీం కోర్టు వ్యాఖ్యలు, ఆ తర్వాత స్టాలిన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తదితర అంశాల నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర సంబంధాల అంశం మరోసారి చర్చకు వస్తున్నది. తాము పంపిన బిల్లులకు ఆమోద ముద్ర వేయకండాతన వద్దే వాటిని ఉంచుకున్నారని ఆ రాష్ట్ర గవర్నర్ ఆర్.ఎన్.రవిపై స్టాలిన్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. నెలల తరబడి బిల్లులను గవర్నర్లు తమ వద్దే అట్టి పెట్టుకోవడం రాజ్యాంగ విరుద్దమని సుప్రీంకోర్ట్ పలుమార్లు చెప్పినప్పటికీ గవర్నర్ దగ్గర నుండి సానుకూల స్పందన రాలేదు. చివరకు సుప్రీం కోర్టు ఈ విషయంలో జోక్యం చేసుకొని తీవ్ర వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది. సుదీర్ఘంగా బిల్లులు తమ వద్ద ఉంచుకునే అధికారం గవర్నర్ కు లేదని తేల్చి చెప్పింది. అంతే కాదు బిల్లుల ఆమోదంలో రాష్ట్రపతికి కూడా గడువు విధించగలమని స్పష్టం చేసింది. ఆ తర్వాత గవర్నర్ ఆమోదం లేకుండానే తమిళనాడు ప్రభుత్వం పది బిల్లులను అసెంబ్లీలో పెట్టి చట్టాలయ్యాయని గెజిట్ వెలువరించింది. ఇది దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
తాజాగా రాష్ట్ర స్వయంప్రతిపత్తి, హక్కుల రక్షణ కోసం సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ కురియన్ జోసఫ్ నేతృత్వంలో స్టాలిన్ ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఈ పరిణామం తర్వాత కేంద్రం, తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పరస్పర విమర్శలు జరుగుతున్నాయి. తాజాగా ఉప రాష్ట్రపతి తీవ్ర స్వరంతో స్పందించారు. ఆర్టికల్ 142 గురించి మాట్లాడారు. సుప్రీం కోర్టు చట్టాలు చేస్తుందా అని ప్రశ్నించారు. రాజ్యాంగ వ్యవస్థల మధ్య విభేదాలు తలెత్తినప్పుడు పరిస్థితి ఇట్లాగే ఉంటుంది. గవర్నర్ తన పరిధి మేరకు ఉండి ఉంటే పరిస్థితి ఇట్లా అయ్యేది కాదని, ఇంతదాకా చర్చ వచ్చేది కాదనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతున్నది.
ఎన్డీయే పాలనలో విపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో గవర్నర్లు మితిమీరి వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. గతంలో మన రాష్టంలో కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు నాటి గవర్నర్ తో చాలా విషయాల్లో ఇబ్బంది పడాల్సి వచ్చింది. రాష్ర్టాల అధికారాల కోసం గళం విప్పి మాట్లాడటమే కాదు, కేంద్రంతో పోరుబాట పట్టిన నాయకుడు కేసీఆర్. రాజ్యాంగ పరిధి దాటి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ అధికారాల్లో జోక్యం చేసుకోకూడదని ఆయన గట్టిగా వాదించారు. అయినా పరిస్థితిలో ఎలాంటి మార్పూ లేదు. మొన్నటి వరకు కేరళలో ముఖ్యమంత్రి విజయన్‌కు, గవర్నర్ ఆరిఫ్‌కు మధ్య మాటల యుద్ధం జరిగింది. బెంగాల్లో మమతదీ అదే పరిస్థితి. తమిళనాడులో స్టాలిన్ పరిస్థితి తాజా నిర్ణయాలకు కారణమవుతున్నాయనటంలో సందేహం లేదు. గవర్నర్లు ఢీ అంటే ఢీ అంటున్నారు. సుప్రీం కోర్టు ఘాటు వ్యాఖ్యల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మితిమీరి వ్యవహరిస్తోందా అనే చర్చ ప్రస్తుతం దేశవ్యాప్తంగా జరుగుతోంది. నీట్ పరీక్ష, నూతన జాతీయ విద్యా విధానం, భాష విషయంలో బలవంత పెట్టడం, జీఎస్టీ పేరిట ముక్కుపిండి వసూలు చేయటం ఇలాంటి విషయాలన్నీ రాష్ట్ర ప్రభుత్వాలను, ప్రధానంగా దక్షిణాది రాష్ర్టాలను ఇబ్బంది పెడుతున్నారు. ఈ నేపథ్యంలో స్టాలిన్ ఆశించినట్టు రాష్ర్టాలకు స్వయం ప్రతిపత్తి హోదా లభిస్తే విద్య, వైద్యం, సంక్షేమం లాంటి విషయాలలో రాష్ట్ర ప్రభుత్వాలు సొంతంగా నిర్ణయాలు తీసుకొనేందుకు అవకాశం ఉంటుంది.
ప్రపంచీకరణ వేగం పుంజుకున్నాక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పలు విషయాల్లో స్పర్థలు వస్తున్నాయి. కాంగ్రెస్ హయాంలోనూ, బీజేపీ హయాంలోనూ కేంద్ర, రాష్ట్ర సంబంధాలు, పరిపాలనా సంస్కరణలపై కమిటీలను వేశారు. రాజ్యంగాన్ని పున: సమీక్షించాలని 2000 సంవత్సరంలో జస్టిస్ ఎం.ఎన్.వెంకటాచలయ్య కమిషన్ ఏర్పాటు చేయగా, కేంద్ర ,రాష్ట్ర సంబంధాల మెరుగుదల గురించి ఆ కమిషన్ పలు సూచనలు చేసింది. గవర్నర్‌ను నియమించే ముందు ముఖ్యమంత్రిని సంప్రదించాలని చెప్పింది. గవర్నర్ తన వద్దకు వచ్చిన బిల్లులపై ఆరు నెలల్లోగా నిర్ణయాన్ని వెలువరించాలని సూచన చేసింది.
2007లో కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టు మాజీ సీజేఐ మదన్ మోహన్ పూంచ్ నేతృత్వంలో ఇంకో కమిషన్ వేసింది. కేంద, రాష్ట్ర సంబంధాలను బలోపేతం చేయడం ఎలాగో చెప్పాలని కోరింది. ఈ కమిషన్ చాలా ముఖ్యమైన సూచనలు చేసింది. అందులో గవర్నర్ల గురించిన ప్రస్తావన ఇట్లా ఉంది…. ‘గవర్నర్లను సరైన కారణం లేకుండా తొలగించకూడదు. వివాదాస్పదం కాని, రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తినే గవర్నర్‌గా నియమించాలి. గవర్నర్ తన వద్దకు వచ్చిన బిల్లులపై ఆరు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలి.’ అయితే ఈ కమిటీ సూచనలను ఎన్డీయే సర్కారు పట్టించుకోలేదా? అస్సలు పరిగణనలోకి తీసుకోవాలనే ఆలోచన చేయలేదా? అంటే జరుగుతున్న పరిణామాలు అవుననే సమాధానమిస్తున్నాయి!
కేంద్ర, రాష్ట్ర సంబంధాల విషయంలో 1969లోనే తమిళనాడు తన గళాన్ని వినిపించింది. ఈ నేపథ్యంలో సమాఖ్య స్ఫూర్తికి భంగం కలగకుండా కేంద్రం తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. ప్రస్తుతం తమిళనాడు స్వయం ప్రతిపత్తి కోసం వ్యవహరిస్తున్నట్లుగానే మరికొన్ని రాష్ర్టాలు వ్యవహరిస్తే పరిస్థితి ఏమిటనే సందేహం వస్తుంది. కాబట్టి ప్రజాస్వామ్య వ్యవస్థ మరింత బలపడాలంటే రాజ్యాంగ మౌలిక సూత్రం దెబ్బ తినకుండా వ్యవహరించాల్సి ఉంటుంది. దక్షిణాది రాష్ర్టాల సీఎంలు కేంద్ర ప్రభుత్వ తీరును మూకుమ్మడిగా నిరసించిన సందర్భాలు అనేకం. ఈ మధ్యకాలంలోనే డిలిమిటేషన్ విషయంలో దక్షిణాది రాష్ర్టాల ముఖ్యమంత్రులు, ప్రతిపక్ష నాయకులు సమావేశమై 25 ఏండ్ల వరకు డిలిమిటేషన్ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లరాదని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఇవన్నీ చూస్తుంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య దూరం క్రమంగా పెరుగుతూ వస్తున్న విషయం తేటతెల్లమవుతున్నది. ఏది ఏమైనా మన రాజ్యాంగ నిర్మాతలు చూపిన బాటలో నడవాల్సిన అనివార్యత కేంద్రం, అన్ని రాష్ర్టాల ప్రభుత్వాలపై ఉంటుంది. తాము మొండిగా తీసుకునే నిర్ణయాలను బలవంతంగా రాష్ర్టాలపై రుద్ది దేశం ముక్కలు అయ్యే పరిస్థితి రాకుండా చూడాల్సిన గురుతర బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉంది. అలాగే ఆవేశంతో కాకుండా ఆలోచనతో రాజ్యాంగానికి లోబడి నిర్ణయాలు తీసుకుని ముందుకు సాగి ఫెడరల్ స్ఫూర్తిని చాటి చెప్పాల్సిన బాధ్యత రాష్ర్టాలకూ ఉంది.