‘ఈ ఏడాది నేరేడు చెట్లు అసాధారణంగా ఎక్కువ పండ్లు కాస్తున్నాయి. ఇది రాబోయే కరువుకు ప్రకృతి హెచ్చరిక’ అని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వాదన వెనుక శాస్త్రం ఏమి చెప్తున్నది? పెద్దల అనుభవాలు, అమ్మమ్మల పరిశీలనలు, స్ట్రెస్ ఫ్రూటింగ్, మాస్టింగ్ వంటి శాస్త్రీయ పదాలు కూడా జోడించటంతో ఇది మరింత నమ్మదగినట్టుగా కనిపిస్తున్నది. అయితే నిజంగా నేరేడు చెట్లు విరగకాస్తే కరువు వస్తుందా? చెట్లు భవిష్యత్తులో వచ్చే వాతావరణ మార్పులను ముందే పసిగట్టగలవా?
నేరేడు చెట్లు ఈ ఏడాది నిజంగానే ఎక్కువ పండ్లు కాస్తున్నాయా? తెలంగాణ లోని కొన్ని ప్రాంతాల్లో రైతులు, గ్రామీణ ప్రజలు ఈసారి నేరేడు చెట్లపై పండ్లు సాధారణం కంటే ఎక్కువగా కనిపిస్తున్నాయని చెప్తున్నారు. ఇది పూర్తిగా కల్పితం కాదు. కానీ ఒక ప్రాంతంలో లేదా కొన్ని రాష్ర్టాల్లో ఎక్కువ పండ్లు కనిపించటం ద్వారా దేశవ్యాప్తంగా కరువు వస్తుందని చెప్పటం శాస్త్రీయంగా సరైన నిర్ధారణ కాదు. ప్రతి సంవత్సరం చెట్లలో పుష్పించటం, పండ్లు కాయటం అనేవి వర్షపాతం, ఉష్ణోగ్రతలు, నేలలో సారం, తేమ, చెట్టు ఆరోగ్యస్థితి, పరాగసంపర్కం వంటి అనేక అంశాలపై ఆధారపడి ఉంటాయి.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘మాస్టింగ్’ అనే పదం నిజంగానే వృక్షశాస్త్రంలో ఉన్నది. కొన్ని వృక్షజాతులు ప్రతి సంవత్సరం సమానంగా పండ్లు ఇవ్వవు. కొన్నేండ్ల్లు తక్కువగా, మరికొన్నేండ్లు భారీగా ఉత్పత్తి చేస్తాయి. దీనినే ‘మాస్టింగ్’ అంటారు. ఓక్, పైన్, పనస, అనాస వంటి అనేక అడవి చెట్లలో ఈ లక్షణం కనిపిస్తుంది. దీనివల్ల కలిగే ప్రయోజనం ఏమిటంటే…ఒకేసారి భారీ సంఖ్యలో విత్తనాలు ఉత్పత్తి చేస్తే వాటిని పక్షులు, జంతువులు మొత్తం తినలేవు. ఫలితంగా కొన్ని విత్తనాలు నేలలో పడిపోయి కొత్త మొక్కలుగా ఎదుగుతాయి. అంటే ‘మాస్టింగ్’ అనేది ప్రకృతిలో జాతి మనుగడ కోసం ఏర్పడిన ఒక వ్యూహం.
నిరుడు తూర్పుకనుమల్లో మేం తిరుగుతున్నపుడు చెట్లకు పనస పండ్లు విపరీతంగా వేలాడుతూ కొన్ని కుప్పలుగా నేలమీద రాలిపోవటం చూశాం. అలాగే పైనాపిల్ కూడా. ‘ఈ కొండ ప్రాంతాల్లో ఊట నీటి వల్ల ఈ పండ్లు బాగా పండుతాయి. ఇలా పండటం వల్ల కరువు ఎపుడూ రాలేదు’ అని అక్కడి రైతులు చెప్పారు. కొన్ని మొక్కలు లేదా చెట్లు తీవ్ర ఒత్తిడికి గురైనప్పుడు ఎక్కువ పూలు లేదా పండ్లు ఉత్పత్తి చేస్తుంటాయి. నీటి కొరత, అధిక ఉష్ణోగ్రతలు, చీడలు, వేర్లకు నష్టం వంటి పరిస్థితుల్లో కొన్ని మొక్కలు తమ జీవచక్రాన్ని వేగవంతం చేసి విత్తనాలను ఉత్పత్తి చేయటానికి ప్రయత్నిస్తాయి.
భారతదేశంలో అత్యంత సహనశక్తి కలిగిన చెట్లలో నేరేడు ఒకటి. లోతైన వేర్లు ఉంటాయి. ఎండలను తట్టుకుంటుంది. తక్కువ నీటితో కూడా బతుకుతుంది. భూగర్భ జలాలను లోతుగా అందుకోగలదు. అందుకే నేరేడుచెట్టు పండ్లు ఎక్కువగా కాయటం అనేది తప్పనిసరిగా కరువు సంకేతం అని చెప్పలేం. ఈ ఏడాది ఎక్కువ పండ్లు ఎందుకు కనిపిస్తున్నాయి? దీనికి అనేక కారణాలు ఉండవచ్చు. చెట్టు గత సంవత్సరం నిల్వ చేసుకున్న శక్తిని ఈ ఏడాది పండ్ల రూపంలో వినియోగించి ఉండవచ్చు. కొన్ని చెట్లలో పుష్పోత్పత్తిని వేడి ప్రభావితం చేస్తుంది. కొన్నేండ్లకు ఒకసారి సహజంగానే భారీగా పండ్లు కాస్తుంటాయి. ఒక గ్రామంలో కనిపించిన పరిస్థితి రాష్ట్రమంతటా వర్తించకపోవచ్చు.
నేరేడు చెట్లు ఎక్కువ పండ్లు కాస్తే కరువు వస్తుందనే వాదనకు ప్రత్యక్ష శాస్త్రీయ ఆధారాలు లేవు. అయితే, చెట్లు నీటి ఒత్తిడికి స్పందిస్తాయి. మాస్టింగ్, స్ట్రెస్ ఫ్రూటింగ్ వంటి ప్రక్రియలు నిజంగానే ఉన్నాయి. నేరేడు చెట్లు ఒక ముఖ్యమైన సందేశం మాత్రం ఇస్తాయి. అది ప్రకృతిలో జరుగుతున్న మార్పులను గమనించమని సూచిస్తాయి. భారత్లో వాతావరణ మార్పు ప్రభావాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎండలు పెరుగుతున్నాయి. భూగర్భ జలాలు తగ్గుతున్నాయి. వర్షాలు అస్థిరంగా మారుతున్నాయి. ఇలాంటి సమయంలో నేరేడు చెట్లు ఎక్కువ పండ్లు పండాయా? లేదా? అనేది కాదు, నీటిని ఎలా వినియోగిస్తున్నాం? భూగర్భ జలాలను ఎంత వేగంగా ఖాళీ చేస్తున్నాం? చెట్లను ఎంత మేరకు కాపాడుతున్నాం? అనేదే అసలు ప్రశ్న. ప్రకృతి సంకేతాలను గౌరవించాలి. కానీ వాటిని మూఢనమ్మకాలుగా కాకుండా శాస్త్రీయ అవగాహనతో అర్థం చేసుకోవాలి. అప్పుడే సంప్రదాయ జ్ఞానం, ఆధునిక శాస్త్రం కలిసి మన భవిష్యత్తును కాపాడుతాయి.
– (వ్యాసకర్త: సీనియర్ జర్నలిస్టు)
శ్యాంమోహన్ 94405 95858