మనసుపెట్టి కష్టపడితే ఎంతటి విజయాన్నైనా సాధించవచ్చని నిరూపించింది ఓ గిరిజన యువతి. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా యువతీయువకులు తెలుసుకోవాల్సిన ఓ చదువుల తల్లి జీవితం ఇది. రెండు రోజుల బిడ్డతో పోటీ పరీక్షకు హాజరై విజయం సాధించింది. స్వతంత్ర భారతదేశంలో 77 ఏండ్ల తర్వాత తమిళనాడులో మొట్టమొదటి మహిళా గిరిజన న్యాయమూర్తిగా రికార్డుకెక్కింది. ఆ ఎస్టీ యువతి పేరు వి.శ్రీపతి.
తమిళనాడులోని తిరువన్నామలై దగ్గర జువ్వాది పర్వతశ్రేణుల మధ్య ఉన్న గిరిజన గూడెం పులియూర్ గ్రామానికి చెందిన 23 ఏండ్ల శ్రీపతి తండ్రి కాలియప్పన్, తల్లి మల్లిక. శ్రీపతికి ఒక చెల్లెలు, ఒక తమ్ముడు ఉన్నారు. చెన్నై నుంచి 250 కిలోమీటర్ల దూరంలో ఏ మాత్రం సౌకర్యాలు లేని ఆ గ్రామంలో ఆమె తల్లిదండ్రులు పోడు వ్యవసాయం చేసుకొని జీవించేవారు. వారు ఎక్కడికైనా వెళ్లడానికి బస్సు ఎక్కాలంటే 15 కిలో మీటర్లు నడవాలి. అంతటి మారుమూల గిరిజన గ్రామం అది. వారిది ‘మలయలి’ అనే అత్యంత వెనుకబడిన గిరిజన తెగ. ఆ తెగలో అమ్మాయిలను చదివించడం, బయటకు పంపడంపై అనేక ఆంక్షలు ఉన్నాయి. శ్రీపతి తల్లిదండ్రులు వాటిని పట్టించుకోలేదు. పిల్లలను చదివించాలన్న కోరిక వారిలో బలీయంగా ఉన్నది. ఆ గూడెంలో పాఠశాల, కనీసం రోడ్డు సౌకర్యం కూడా లేకపోవడంతో పిల్లల చదువు కోసం వారు తిరుపత్తూరు జిల్లా ఎలగిరి హిల్స్‌కు దగ్గరలోని ‘అత్నావర్’ అనే పల్లెకు వలస వెళ్లారు. అక్కడ కూడా పోడు వ్యవసాయమే చేసేవారు. పిల్లల చదువు ముఖ్యమనుకున్నారు. యలగిరి హిల్స్‌లో మంచి స్కూల్ ఉందని సంతోషించారు. శ్రీపతి ప్రాథమిక విద్య, ఇంటర్ అక్కడే అభ్యసించింది.
కలియప్పన్ పర్యాటక ప్రదేశాల్లో హౌస్ కీపింగ్ వంటి పనులు చేసేవారు. శ్రీపతి చదువులో బాగా రాణించింది. మంచి మార్కులతో ఉత్తీర్ణురాలవుతూ ఉండేది. ఉన్నత చదువులు చదవాలన్నది ఆమె కోరిక. ఇంటర్లో మంచి మార్కులతో పాసైంది. ఆమె పట్టుదలను చూసి తల్లిదండ్రులు ఆమెను తిరువణ్ణామలైలో 5 సంవత్సరాల లా కోర్సులో చేర్పించారు. అయితే, కుటుంబ నేపథ్యం, బంధువుల ఒత్తిడి వల్ల శ్రీపతికి చిన్న వయసులోనే వెంకట్రామన్ అనే యువకుడితో పెండ్లి చేశారు.
వివాహమైనా శ్రీపతి చదువు మాత్రం ఆపలేదు. పట్టుదల వీడలేదు. డాక్టర్ అంబేద్కర్ లా విశ్వవిద్యాలయంలో పీజీ చేసింది. అప్పుడే తమిళనాడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు జూనియర్ సివిల్ జడ్జి ఉద్యోగాల భర్తీకి పోటీ పరీక్షకు ప్రకటన జారీ చేశారు. అప్పటికే ఆమె గర్భవతి. అయినా పట్టువదల కుండా ఆ పోటీ పరీక్షకు దరఖాస్తు చేసింది. సరిగ్గా పరీక్ష సమయానికి డెలివరీ డేట్ వస్తుందని ఆందోళన చెందింది.
తల్లిదండ్రులు, తనకు ఇష్టమైన టీచర్ మహాలక్ష్మి, భర్త వెంకట్రామన్ శ్రీపతికి ధైర్యం చెప్పారు. పోటీ పరీక్షకు ప్రిపేర్ కావాలని ప్రోత్సహించారు. శ్రీపతి ఆ పరీక్షని ఓ యజ్ఞంలా భావించింది. తల్లి మల్లిక అండతో రాత్రి పగలు చదివి పరీక్షకు సిద్ధమైంది. ఓ పక్క పరీక్ష తేదీ, మరో పక్క డెలివరీ డేట్ దగ్గర పడుతున్నాయి. పరీక్ష తేదీ కంటే డెలివరీ సమయమే రెండు రోజులు ముందు వచ్చింది. అయినా, పుస్తకాలు వదల్లేదు. ప్రిపరేషన్ కొనసాగించింది.
2023 నవంబరు 27 శ్రీపతి పండంటి పాపకు జన్మనిచ్చింది. రెండు రోజులకే 29న పరీక్ష. పరీక్ష రాయాలని శ్రీపతి పట్టుబట్టింది. వద్దని వైద్యులు హెచ్చరించినా వినలేదు. తాను కష్టపడి చదివిన చదువు వృథా కాకూడదని అనుకుంది. తల్లిదండ్రులు, భర్త సహకారంతో పసిగుడ్డుతో ప్రయాణమైంది. పచ్చి బాలింత అయిన శ్రీపతి యలగిరి హిల్స్ నుంచి కారులో నాలుగున్నర గంటలు ప్రయాణించి పోటీ పరీక్ష రాసింది. విజయం సాధించింది. 2024 ఫిబ్రవరి 15న సివిల్ జడ్జి పోస్టుకు ఎంపికైంది. రాష్ట్రంలో జడ్జి అయిన మొట్టమొదటి గిరిజన మహిళగా రికార్డులకెక్కింది. యువతకు ఆదర్శ మహిళ అయింది. తమిళనాడు ప్రభుత్వ ‘ద్రవిడ మోడల్’ విధానంలో రూపొందించిన ‘ద తమిళ మీడియం యాక్ట్’ ప్రకారం తమిళ మీడియంలో చదివిన విద్యార్థులకు ప్రభుత్వ ఉద్యోగాలలో 20 శాతం రిజర్వేషన్ కల్పిస్తారు. ఈ చట్టం శ్రీపతి జడ్జిగా ఎంపిక కావడానికి ఉపయోగపడిందని భావిస్తున్నారు. ఎందరు చెప్పినా వినకుండా ప్రాణాలకు తెగించి 200 కిలోమీటర్లు ప్రయాణించి పరీక్ష రాసిన రెండు రోజుల బాలింత శ్రీపతి సంకల్పం నేటి తరానికి ఆదర్శం. పెండ్లి చేసుకున్న తర్వాత కూడా చదువు ఆపకుండా, పోటీ పరీక్షలకు సిద్ధమై విజయం సాధించిన శ్రీపతికి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అభినందనలు.
– (వ్యాసకర్త: సీనియర్ జర్నలిస్ట్) శిరందాసు నాగార్జునరావు 94402 22914