భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పటి నుంచి పదేండ్ల కాలంలో అంటే 1960 కల్లా 6 నుంచి 14 ఏండ్ల మధ్య వయసు గల పిల్లలకు
ఎలిమెంటరీ స్థాయి వరకు ఉచిత నిర్బంధ విద్యా విధానం అందించాలనేది రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాల్లోని ఆర్టికల్ 45 లక్ష్యం. ఇది నెరవేరలేదు కాబట్టి 2002లో 86వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆర్టికల్ 21(ఏ)ను చేర్చారు. దీని ప్రకారం విద్యా హక్కు జీవించే హక్కులో భాగమైంది.
దీనికి అనుగుణంగా విద్యాహక్కు చట్టాన్ని రూపొందించారు. 2010 నుంచి ఇది అమలవుతూ వస్తున్నది.
పిల్లలందరికీ 14 ఏండ్ల వయసు (8వ తరగతి) వరకు విద్య తప్పకుండా అందాలంటే ఆ స్థాయి వరకు పిల్లల విద్య ఎలాంటి అంతరాయం లేకుండా కొనసాగాలి. కాబట్టి 8వ తరగతి వరకు ఎలాంటి బోర్డు పరీక్షలు ఉండకూడదని, పరీక్షల్లో ఫెయిల్ అయ్యారన్న కారణంగా పై తరగతులకు పంపకుండా ఉండరాదని, అంటే డిటైన్ చేయకూడదని విద్యాహక్కు చట్టం సెక్షన్ 16 నిర్దేశిస్తుంది. దీని అర్థం పిల్లలకు పరీక్షలు ఉండకూడదని కాదు. పిల్లల్ని టీచర్లు ఎప్పటికప్పుడు నిరంతరం సమగ్రంగా మూల్యంకనం చేయాలి. తగిన దిద్దుబాటు చర్యలు చేపట్టాలి. అవి పిల్లలకు భారం కాకుండా ఉండాలి, ఆ స్ఫూర్తితోనే నిరంతర సమగ్ర మూల్యంక పద్ధతిని (సీసీఈ) ప్రవేశపెట్టారు.
ఆ తర్వాత ఈసీసీఈ, నో డిటెన్షన్ విధానాలు అమలు జరుగుతున్న తీరుపై సమీక్ష కోసం అప్పటి కేంద్ర ప్రభుత్వం 2012లో హర్యానా విద్యామంత్రి గీతా బుక్కల్ అధ్యక్షతన సీఏబీఈ కమిటీని నియమించింది. ఈ కమిటీ సీసీఈని సరిగా అమలు చేయడానికి టీచర్లను సంసిద్ధం చేయాలని, ఉపాధ్యాయ విద్యను సంస్కరించాలని.. 5,8 తరగతుల వార్షిక పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులకు రెమిడియల్ క్లాసులు నిర్వహించి మళ్లీ పరీక్ష పెట్టి పై తరగతులకు పంపించాలని సిఫారసు చేసింది. కానీ ప్రథమ్ వారి ఏఎస్ఈఆర్ సర్వే ఫలితాలు వెలువడిన ప్రతిసారీ పిల్లలు సరైన సామర్థ్యాలు పొందడం లేదనే చర్చ విస్తృతమైంది.
ఈసీసీఈ విధానం, నో డిటెన్షన్ విధానాల వల్లే ఈ సమస్య పెరిగిందనే చర్చలు జరిగాయి. 2017లో జరిపిన నేషనల్ అచీవ్మెంట్ సర్వే ఫలితాలు కూడా పిల్లలకు స్థాయీ సంబంధిత సామర్థ్యాలు లేవని తేల్చింది. దీంతో నో డిటెన్షన్, సీసీఈ విధానాల వల్ల పిల్లలు వార్షిక పరీక్ష పరీక్షల్లో ఫెయిలైనా పై తరగతులకు వెళ్తున్నారని, దీని వల్ల చదువుపై వారిలో శ్రద్ధ లోపించిందని, టీచర్లకు జవాబుదారీతనం లేకుండా పోయిందనే వాదనలు తెరపైకి వచ్చాయి. దీంతో 2019లో విద్యాహక్కు చట్టానికి సవరణ చేసి 5,8 తరగతుల వార్షిక పరీక్ష ఫలితాల ఆధారంగా డిటెన్షన్ విధానాన్ని అమలు చేసే వెసులుబాటు కల్పించారు. అయితే, ఈ డిటెన్షన్ విధానం అమలు చేయడంలో రాష్ర్టాలకు స్వేచ్ఛను ఇచ్చారు. దీంతో ఈ విధానాన్ని కొన్ని రాష్ర్టాలు అప్పటి నుంచి అమలు చేస్తున్నాయి. తెలుగు రాష్ర్టాలు మాత్రం ఈ విధానాన్ని అమలు చేయడం లేదు.
ఈ నేపథ్యంలో ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ అధీనంలో నడిచే కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ విద్యాలయాల్లో కూడా వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. దీంతో ఈ విషయంపై మరోసారి చర్చ తెరపైకి వచ్చింది. ఈ సందర్భంగా పిల్లలు తమ స్థాయికి తగ్గ విషయాలను ఎందుకు నేర్చుకోలేక పోతున్నారన్నది గమనార్హం. దీనికి సరైన కారణాలను, పరిష్కారాలను వెతకాలి. ఈ అన్వేషణ కనుక సరైన రీతిలో జరిగితే డిటెన్షన్ విధానాన్ని అమలు చేయడమా, నో చెప్పడమా? అనేవి అంతగా ముఖ్య విషయాలు కావన్న విషయం తెలుస్తుంది.
మూడు దశాబ్దాలుగా ఉపాధ్యాయ విద్యలో జరిగిన ప్రైవేటీకరణ కారణంగా లాభార్జన లక్ష్యంతో నడిచే ప్రైవేటు ఉపాధ్యాయ విద్యాసంస్థలు ఎక్కువయ్యాయి. ఇవి సర్టిఫికెట్లను అమ్ముకునే షాపులుగా మారాయని స్వయానా జాతీయ విద్యా విధానం 2020 ముసాయిదా కూడా పేర్కొన్నది. ఇలాంటి సంస్థల నుంచి ఉత్పన్నమైన టీచర్లు సమగ్ర నిరంతర మూల్యంకనం స్ఫూర్తిని అర్థం చేసుకుంటారని ఆశించలేం. టీచర్ల పని పరిస్థితులను మెరుగుపరచడం, కరికులం లోడ్ లేకుండా చూడటం, శాస్త్రీయమైన వర్క్‌లోడ్ ఉండేటట్టు చూడటం, స్కూళ్ల పని గంటలను హేతుబద్ధీకరించడంలో ఇంకా వలసవాద వికారం (కలోనియల్ హేంగోవర్) కనబడుతూనే ఉంటుంది.
నేషనల్ కరికులం ఫ్రేమ్ వర్క్ 2005 సిఫారసులను అనుసరించి స్కూల్ కరికులంలో చాలా శాస్త్రీయ మార్పులు జరిగాయి. కానీ టీచర్ల వర్క్ లోడ్ విషయంలో ఇంకా కలోనియలిజం ఛాయలను విస్మరించలేక పోతు న్నాం. ఎక్కువ బోధనా గంటలు ఎక్కువ విషయాలను నేర్పుతాయనే భావనలోనే ఉన్నాం. పని పరిస్థితులను మెరుగుపరిచే భౌతిక వసతుల విషయంలో మనం ఇంకా చాలా వెనుకబడి ఉన్నాం. ఈ మౌలిక విషయాలను విస్మరించిన విద్యా తాత్వికతనే మన బ్యూరోక్రాట్స్ విశ్వసిస్తారు. వారి విశ్వాసాలకు అనుగుణంగానే విద్యావిధానాలు రూపొందుతాయి. విద్యా విధానాల రూపకల్పన నుంచి విద్యావేత్తలు దూరమై చాలా కాలమే అయింది. అందుకనే పరీక్ష లు, వాటి ఫలితాలు, డిటెన్షన్ విధానాలు ప్రాధాన్యం పొందుతూ ఉన్నాయి.
పిల్లలు ఫెయిల్ అవడం అంటూ ఉండదు, వాళ్లు ఫెయిల్ చేయబడుతారు అని ఎన్సీఈఆర్టీ మాజీ ప్రొఫెసర్ కృష్ణకుమార్ ఒక సందర్భంలో అన్న మాటలను గుర్తుకు తెచ్చుకోవలసిన సందర్భం మరోసారి వచ్చింది. పిల్లలకు సంబంధం లేని విషయాల వైఫ్యల్యాన్ని వారి వైఫల్యంగా చూపించే ప్రయత్నం అన్యాయం, జీవించే హక్కులో భాగంగా గుర్తించబడిన విద్యా హక్కు సాధనలో అది అనాగరికం కూడా.
(వ్యాసకర్త: అధ్యాపకులు, కేయూ)
-ఎడమ శ్రీనివాసరెడ్డి
99499 05069