విరాట్కర్ణ కథానాయకుడిగా నటిస్తున్న మైథలాజికల్ యాక్షన్ అడ్వెంచర్ ‘నాగబంధం: ది సీక్రెట్ ట్రెజర్’ చిత్రం నిర్మాణదశ నుంచే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్నది. అభిషేక్ నామా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం జూలై 3న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకురానుంది. రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ సందర్భంగా గురువారం కొత్త పోస్టర్ను విడుదల చేశారు. ఇందులో హీరో విరాట్కర్ణ చేతిపై పడగ విప్పిన సర్పం, మరో చేతితో ఆయన కత్తి పట్టుకొని తీక్షణమైన చూపులతో కనిపిస్తున్నారు.
భారతీయ పురాణాలు, ప్రాచీన రహస్యాలు, దైవిక శక్తుల మహిమలు కలబోసిన ఈ కథలో విజువల్స్ అబ్బురపరుస్తాయని, ప్రపంచస్థాయి సాంకేతికాంశాలతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నామని, మునుపెన్నడూ చూడని పోరాట ఘట్టాలతో ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరుస్తుందని మేకర్స్ తెలిపారు. ఈ చిత్ర హిందీ హక్కులను జీ స్టూడియోస్ కొనుగోలు చేసింది. నభానటేష్, ఐశ్వర్యమీనన్, జగపతిబాబు, మహేష్ మంజ్రేకర్ తదితరులు చిత్ర తారాగణం.