సిటీబ్యూరో, మే 21 (నమస్తే తెలంగాణ): రాజస్థాన్ కేంద్రంగా నగరంలో డ్రగ్స్ విక్రయాలకు పాల్పడుతున్న ఒక వ్యక్తిని సికింద్రాబాద్ డీటీఎఫ్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి రూ.3లక్షల విలువ చేసే ఓపీయం, పాపిష్ఠ డ్రగ్స్‌ను స్వా ధీనం చేసుకున్నారు. సికింద్రాబాద్ డీటీఎఫ్ సీఐ సావిత్రి సౌజన్య కథనం ప్రకారం…రాజస్థాన్‌కు చెందిన ప్రవీణ్ కుమార్(26) ఉపాధి కోసం నగరానికి వలస వచ్చి, ప్రైవేటు ఉద్యోగం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు.
అయితే వచ్చే ఆదాయం సరిపోకపోవడంతో రాజస్థాన్‌లో తక్కువ ధరకు లభించే ఓపియం, పాపిష్ఠ తదితర నిషేధిత డ్రగ్స్‌ను కొనుగోలు చేసి, నగరంలో అధిక ధరలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నాడు. సమాచారం అందుకున్న సికింద్రాబాద్ డీటీఎఫ్ బృందం , సికింద్రబాద్, బోయిన్పల్లి పరిసర ప్రాంతాల్లో నిఘా పెట్టి తనిఖీలు నిర్వహించింది. ఈ తనిఖీలలో రివెరా వైన్స్ న్యూ బోయినపల్లిలో ద్విచక్ర వాహనంపై అనుమానాస్పదంగా వెళ్తున్న ప్రవీణ్‌కుమార్‌ను ఆపి, తనిఖీ చేయగా అతడి వద్ద ఓపీయం, పాపిష్ట మత్తు పదార్థాలు లభించాయి.
దీంతో నిందితుడిని అరెస్టు చేసి, అతడి వద్ద నుంచి రూ.3లక్షల విలువ చేసే 400గ్రాముల ఓపీయం, 450 గ్రాముల పాపిష్ఠ డ్రగ్స్‌తో పాటు ద్విచక్రవాహనం, సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడికి హరీష్ కుమార్‌తో పాటు మత్తు పదార్థాలు సరఫరా చేయడంలో సహకరిస్తున్న మరో ఇద్దరిపై కూడా కేసులు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. సికింద్రాబాద్ ఈఎస్ పంచాక్షరీ, ఏఈఓస్ శ్రీనివాస్ పర్యవేక్షణలో జరిపిన ఈ దాడుల్లో డీటీఎఫ్ సీఐ సౌజన్యతో పాటు సిబ్బంది పాల్గొన్నారు.