‘ముడా’ స్థలం కేటాయింపు కుంభకోణానికి సంబంధించి కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై విచారణ జరిపేందుకు ఆ రాష్ట్ర గవర్నర్ థావర్‌చంద్ గహ్లోత్ అనుమతి ఇవ్వడం వివాదాస్పదంగా మారింది. ఓ వైపు కాంగ్రెస్-రాష్ట్ర ప్రభుత్వం, మరోవైపు బీజేపీ- గవర్నర్ల మధ్య ఈ విషయమై వాగ్వాదం జరుగుతున్నది.
CM Siddaramaiah | గవర్నర్ నిర్ణయాన్ని ఆ రాష్ట్ర క్యాబినెట్ ఖండించింది. అంతేకాదు, దీన్ని రాజకీయంగా, న్యాయపరంగా ఎదుర్కోవాలని నిర్ణయించింది. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత సిద్ధరామయ్య సర్కార్ ఎదుర్కొన్న అత్యంత తీవ్రమైన రాజకీయ సవాల్ ఇదే. ఈ నేపథ్యంలో గవర్నర్ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని, చట్ట వ్యతిరేకమని సిద్ధరామయ్య అన్నారు. గవర్నర్ నిర్ణయాన్ని న్యాయస్థానంలో సవాల్ చేస్తామని కూడా ఆయన చెప్పారు. తన ప్రభుత్వాన్ని పడగొట్టే కుట్రలో ఇది భాగమని పేర్కొన్నారు.
ఈ కేసులో ఒకసారి విచారణ ఊపందుకున్నట్టయితే.. సిద్ధరామయ్యపై, కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి రావడం ఖాయం. అయితే ఇది మరో రకంగా కాంగ్రెస్‌కు మేలు చేసే అవకాశం ఉంది. సిద్ధరామయ్య నేతృత్వంలో పార్టీ నేతలను ఏకం చేసేందుకు ఇది దోహదం చేయవచ్చు. మరోవైపు ఈ అంశాన్ని వాడుకొని తమ పార్టీ నాయకులను కూడా ఏకతాటిపైకి తీసుకురావాలని బీజేపీ ఆశిస్తుండవచ్చు.
విచారణకు అనుమతించవద్దని క్యాబినెట్ చేసిన సూచనను గవర్నర్ గెహ్లోత్ తిరస్కరించారు. ప్రాథమిక దర్యాప్తు నివేదికల పట్ల సంతృప్తి చెందానని, అందుకే విచారణకు అనుమతించినట్టు గవర్నర్ చెప్పారు. ఈ సంతృప్తి అనేది ప్రాథమిక ఆధారాల ద్వారా కాకుండా రాజకీయంగా ఉండవచ్చు. మన దేశంలో గవర్నర్ వ్యవస్థను దుర్వినియోగపరుస్తున్న తీరును గనుక పరిగణనలోకి తీసుకుంటే.. ప్రభుత్వాన్ని కూల్చాలనే కుట్రలో భాగమేనని వస్తున్న అభియోగాలు రాజకీయ ఆరోపణలు మాత్రమే కాకపోవచ్చు.
‘ఆపరేషన్ కమలం’తో పోలిస్తే.. ఇలా గవర్నర్‌ను వినియోగించుకొని తిరుగుబాటును మరింతగా ఎగదోయడమనేది చాలా తక్కువ ఖర్చుతో కూడుకున్న మార్గం. ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు పార్టీ ఫిరాయింపులను వాడుకున్నప్పుడు బాధితుడు నైతికంగా ఉన్నతస్థితిలో ఉంటాడు. అలా కాకుండా అవినీతి అనేది ప్రధానాంశమైతే మాత్రం ప్రభుత్వాన్ని పడగొట్టినవారు కూడా నైతిక విజయం సాధిస్తారు. అయితే బీజేపీ నేతల అవినీతి ఆరోపణలపై కూడా గవర్నర్ ఇదే విధంగా స్పందిస్తారా? అనేది ఇక్కడ ప్రశ్న. ఒకవేళ గవర్నర్ అలా చేయకపోతే అది అతని పక్షపాత వైఖరిని బహిర్గతం చేయవచ్చు. కానీ, ఆయన తీసుకున్న చర్యను మాత్రం ప్రభావితం చేసే అవకాశం లేదు.
ముడా కుంభకోణం విషయమై సిద్ధరామయ్య వాదన కూడా నమ్మశక్యంగా లేదు. అతని భార్యకు భూముల కేటాయింపునకు సంబంధించి లేవనెత్తిన అన్ని ప్రశ్నలకు ఆయన వద్ద సంతృప్తికరమైన సమాధానాలు లేవు. అంతేకాదు, ఈ విషయంపై అసెంబ్లీలో చర్చించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా లేదు. ప్రభుత్వం నియమించిన కమిషన్ ఎక్కడికీ వెళ్లకపోవచ్చు. ఈ వాదోపవాదాలు, మాటల యుద్ధం నేపథ్యంలో అవినీతి అనేది చాలా చిన్న అంశంగా మారిపోతున్నది. ముందుగా ఒక అవగాహనకు రావడం, ఆ తర్వాత ప్రభుత్వంపై పోరాటం చేయడమనేది సాకు మాత్రమే. రాజకీయ గోడపై ఉన్న అద్దంలో గనుక చూసుకుంటే ఎవ్వరూ సచ్ఛీలురు కారనే విషయం అవగతమవుతుంది.
ఇరుపార్టీల నాయకులు ఒకరికొకరు వ్యతిరేకంగా ప్రచారం చేసుకుంటే ఏది గెలుస్తుంది? రాజకీయమా, నైతికతా, ప్రజా ప్రయోజనాలా, వ్యక్తిగత సర్దుబాట్లా? ప్రజలకు తెలుసుకోగల హక్కున్న ఈ వ్యవహారంలోని వాస్తవం ఎప్పటికైనా ఈ వివాదాల నుంచి బయటపడుతుందా? ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో లేని సంస్థ ఆధ్వర్యంలో నిష్పక్షపాతంగా విచారణ జరగడం ఇప్పుడు తక్షణావసరం, ఆహ్వానించదగినది కూడా.
(‘డెక్కన్ హెరాల్డ్’ సౌజన్యంతో)
-ఎడిటోరియల్ డెస్క్