మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తాజాగా మరొక గొప్పమాట సెలవిచ్చారు. ఆయన ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకీ ఎన్నికల సభలో 17వ తేదీన ప్రసంగిస్తూ, ఒకవేళ కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీల ఇండియా కూటమి అధికారానికి వచ్చినట్టయితే అయోధ్యలోని రామ మందిరంపైకి బుల్డోజర్లను పంపి కూల్చివేయగలదని అన్నారు. రామ్‌లల్లాను తిరిగి గుడారం కిందకు తీసుకురాగలదన్నారు.
అంతేకాదు, బుల్డోజర్లను ఎక్కడ నడపాలో ఆ రెండు పార్టీలు యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వద్ద ట్యూషన్ చెప్పించుకోవాలని కూడా సూచించారు. వాటిని యోగి నడిపింది ఎవరి ఇళ్ల పైకో తెలిసిందే. ఇటువంటి మాటలు విన్న నాగరికులైన ప్రజలకు, సాధారణ ప్రజలకు సైతం, ఒక ప్రజాస్వామిక దేశ ప్రధానమంత్రి ఈ తీరున మాట్లాడగలరా అని నమ్మశక్యంగా తోచదు. అయితే, ఆయన ఈ విధమైన పతనానికి తగిన కారణాలున్నాయి. అవేమిటో మునుముందు చూద్దాము.
రాజకీయాల్లో కొన్ని దశాబ్దాల అనుభవం, ముఖ్యమంత్రిగా, ప్రధానిగా మరికొన్ని దశాబ్దాల అనుభవం గల మోదీకి 2014, 2019 ఎన్నికల ప్రచారంలో లేనివిధంగా ఈసారి నిజంగా భయంకరమైన స్థాయికి దిగజారి ప్రచారాలు సాగిస్తున్నారు. పైన పేర్కొన్నది ఒకరోజు నాటి ఒక సభ గురించి మాత్రమే. కాని ప్రస్తుత ఎన్నికలు ప్రకటించినప్పటి నుంచి మొదలుకొని వారాలకు వారాలు గడుస్తున్నా ఆయన ప్రచారం ఇదే ధోరణిలో నడుస్తున్నది.
2014, 2019లో లేని ఈ కొత్త మార్పు ఇప్పుడెందుకని కొందరు ఆశ్చర్యపోవచ్చు. ఆయన గత ముప్ఫై ఏండ్లలోనే ఏ పార్టీకి గాని, కూటమికి గాని రాని విధంగా ఈ రెండు మార్లు బీజేపీకి లోక్‌సభలో పూర్తి మెజారిటీని సాధించారు. పరిపాలన మాట ఎట్లున్నా సొంత పార్టీలో, మొత్తం దేశ రాజకీయాలలో తిరుగులేని నాయకునిగా పేరు తెచ్చుకున్నారు. భారతదేశంలోనే గాక విదేశాలలో కూడా. ప్రస్తుత 2024 ఎన్నికలలోనూ సీట్లు ఒకవేళ కొంత తగ్గినా ఆయనే తిరిగి ప్రధాని కాగలరన్నది దేశ, విదేశాలలో, ఇక్కడి ప్రతిపక్షాలలో కూడా ఎక్కువమంది నమ్ముతున్న మాట.
అటువంటప్పుడు ఏ విధంగా ఆలోచించినా నరేంద్ర మోదీ తన స్థాయిని మరిచి, తన వ్యక్తిత్వాన్ని ఇంతగా పతనం చేసుకొని, ఇంతగా దేశ విదేశాలలో అప్రతిష్ట పాలవుతూ, సమాజానికి ఇంత తీవ్రమైన హాని కలుగజేస్తూ, ప్రజాస్వామిక విలువలను ఇంతగా నష్టపరుస్తూ , ఇంత హీనంగా వ్యవహరించవలసిన అగత్యం ఏమి వచ్చిందన్నది పలువురికి బోధపడని విషయం. సాధారణంగా ఒక పార్టీ వరుసగా రెండు సార్లు అధికారంలో ఉన్నప్పుడు కొంత యాంటీ ఇన్‌కంబెన్సీ అనేది ఏర్పడుతుంది.
కాని అటువంటిది లేకపోగా తనకు ప్రజాదరణ ఇంకా పెరిగినట్టు నిరూపించుకోవాలన్నది మోదీ ఆలోచన అయినట్టు కనిపిస్తున్నది. తన నాయకత్వాన బీజేపీ 2014లో 282 సీట్లు గెలువగా 2019లో 303కు పెంచుకున్నది. అదేవిధంగా ఆయన కూటమి అయిన ఎన్డీయే సీట్లు 336 నుంచి 353కు పెరిగాయి. ఆ విధంగా మొదటిసారి నుంచి రెండవసారికి యాంటీ ఇన్‌కంబెన్సీ లేకపోయింది. అందుకు మోదీకి ప్రశంసలు లభించాయి.
ఈ మూడవసారి కూడా వరుసగా అధికారానికి వచ్చి నెహ్రూ రికార్డును చెరిపివేయాలని, అంతేగాక, బీజేపీ, ఎన్డీయేల బలాన్ని మరింత పెంచాలన్న కోరిక ఆయనకు బలంగా ఉన్నట్టున్నది. అందువల్లనే కావచ్చు 2024లోనూ తమదే అధికారం అనటంతో ఆగక ‘చార్ సౌ పార్’ అంటూ సీట్లు 400 దాటుతామని మొదటినుంచి పదే పదే ప్రకటిస్తున్నారు. ఇది తేలికైన లక్ష్యం కాదు. మూడవసారి కూడా గెలవాలని కోరుకోవటం వేరు, 400 స్థానాలు దాటాలనుకోవటం వేరు.
సరిగ్గా ఇక్కడే సమస్యకు మూలం ఉన్నట్టు కనిపిస్తున్నది. గెలవటం మాట సరేసరి కాగా, 400 సీట్లు సాధించటమన్న లక్ష్యాన్ని మోదీ తనకు తాను ఒక మహా ప్రతిష్ఠాత్మకమైన విషయంగా మార్చుకున్నట్టు కనిపిస్తున్నది. అదిగాని జరిగినట్టయితే దాని ప్రభావాలు పలు విధాలుగా ఉంటాయి. ప్రతిపక్ష కాంగ్రెస్‌తో పాటు ఇండియా కూటమి దారుణంగా దెబ్బతినిపోతాయి. ఏ కూటమిలోనూ చేరని తటస్థ పార్టీలు బలహీనపడి నైతికంగా, రాజకీయంగా కుంగిపోతాయి.
స్వాతంత్య్రం లభించినప్పటి నుంచి గత 75 ఏండ్లలో ఏ పార్టీకి ఎప్పుడూ లేనంత ఖ్యాతి బీజేపీకి పెరుగుతుంది. తామింకా అధికారంలో లేని రాష్ర్టాలలో అధికార సాధనకు మార్గం సుగమమవుతుంది. ముఖ్యంగా, ఇంతకాలం జనసంఘ్‌కు గాని, బీజేపీకి గాని, సంఘ్‌పరివార్‌కు గాని కొరకరాని కొయ్యగా మిగిలిన దక్షిణాది స్వాధీనమయే అవకాశం బహుశా లభిస్తుంది. పరిపాలనాపరంగా, మతతత్వపరంగా ఎదురవుతున్న విమర్శలను ఇక ఇప్పటిస్థాయిలో అయినా లెక్కపెట్టవలసిన అవసరం ఉండదు.
బీజేపీ సుదూర భవిష్యత్తులో ఎంతమాత్రం ఎదురులేని శక్తిగా మారుతుంది. పార్టీ అజెండాలో గల కొన్ని వివాదాస్పద అంశాలను ఇప్పటికే అమలుకు తేగా, తక్కినవాటి అమలుకు కూడా వీలు కలుగుతుంది. రాజ్యాంగం రద్దు ఆలోచన నిజంగానే ఉన్నపక్షంలో ఆ పని చేయగలరు కావొచ్చు. మరొకస్థాయిలో, సంఘ్ పరివార్‌కు మొదటినుంచి కూడా భారతదేశాన్ని హిందూరాజ్యంగా మార్చే తలంపు ఉన్నందున, ఆ దిశలో ఇప్పటికే కొన్ని చర్యలు తీసుకుంటున్న దరిమిలా, ఇకముందు అనేక చర్యలు ఎటువంటి సంకోచం లేకుండా తీసుకోగలరు.
ఇక వ్యక్తిగతంగా మోదీ నాయకత్వానికి కలిగే ఉపయోగాల గురించి చెప్పనక్కరలేదు. ఇట్లా పలువిధాలుగా చూసినప్పుడు, 400 స్థానాల ప్రాముఖ్యం ఏమిటో గ్రహించవచ్చు. మోదీకి గుజరాత్ రోజుల నుంచి కూడా తను మొదట సంఘ్‌పరివార్ సంస్థలలో పనిచేస్తుండినా, తర్వాత రాజకీయాలలోకి వచ్చినా, ముఖ్యమంత్రి అయినా చాలా పట్టుదల మనిషి అనే పేరున్నది. ఆ విధంగా ఇప్పుడు 400 సీట్ల లక్ష్యాన్ని నిర్ణయించింది తనే తప్ప సంఘ్‌పరివార్ కాదు. దానిని సాధించాలన్న పట్టుదల తనకున్నది అందువల్లనేనని అనుకోవచ్చు. ఇక్కడ మరొకమాట కూడా చెప్పుకోవాలి.
బీజేపికి మాతృ సంస్థ ఆర్ఎస్ఎస్ అయినప్పటికీ, ముఖ్యంగా గోల్వాల్కర్ తర్వాత కాలంలో పార్టీ నాయకులు ఏదో ఒక మేర స్వతంత్రించి వ్యవహరించటం మొదలుపెట్టారు. ఇది వాజపేయి, అద్వానీల కాలంలో స్పష్టమైంది. ఈ లక్షణాలను మోదీ సైతం గుజరాత్ రోజుల నుంచే ప్రదర్శించటం మొదలైంది. బయటి లోకానికి ఎక్కువ కన్పించకపోయినా ఇప్పటికీ కొనసాగుతున్నది. ఈ పరిస్థితిని పరివార్ నాయకత్వం గుర్తించినప్పటికీ మోదీ బలం, ప్రభుత్వ అధికారం, దాన్ని ఆధారం చేసుకొని హిందూత్వ అజెండాను ముందుకు తీసుకుపోగలగటం వంటి అవకాశాల దృష్ట్యా ఏమీ అనలేకుండా ఉన్నది. పరివార్‌లోనూ కొందరికి అధికారపు రుచి దొరికిందంటారు. ఇది కూడా మోదీ బలాన్ని ఆత్మవిశ్వాసాన్ని, ధీమాను పెంచుతున్నదనుకోవాలి.
మొత్తానికి మోదీకి మొదటినుంచి గల ఈ పట్టుదల తత్వం కూడా ఇపుడు 400 సీట్ల పట్టుదలలో ప్రతిఫలిస్తున్నదని చెప్పాలి. ఆ విధంగా జరుగుతుందా లేదా అనేది వేరే విషయం. కాని ప్రస్తుతానికి తన పట్టుదలను గమనించి అర్థం చేసుకోవటం అవసరం. ప్రతిపక్షాలతో పాటు మోదీ విమర్శకులు చేస్తున్నట్టు ఇవన్నీ పగటి కలలంటూ కొట్టివేయటం వల్ల ఉపయోగం ఉండదు. ఒక స్థితిని సక్రమంగా అర్థం చేసుకొనేవారే అందుకు పరిష్కారాన్ని కనుగొనగలరు.
ఈ ప్రయోజనాలన్నింటిని దృష్టిలో ఉంచుకున్నందువల్లనే 400 సీట్లు ఎట్లాగైనా గెలిచితీరాలని భావిస్తున్న మోదీ, అందుకోసమే హిందువులను అత్యధిక స్థాయిలో పోలరైజ్ చేసేందుకు మొదట చెప్పుకొన్న యూపీ తరహా ప్రసంగాలు చేస్తున్నారా? అవుననే తోస్తున్నది. లేనట్టయితే, ఎన్నికలు ప్రకటించినదే తడవు ముస్లింలపై, ప్రతిపక్షాలపై, విమర్శకులపై ఎడతెరిపి లేకుండా ఈ విధమైన పూర్తి అసంబద్ధమైన ఆరోపణలు, దాడులు చేయవలసిన అవసరమే లేదు. తను చూపుతున్న ధోరణి ఎటువంటిదో, దాని ప్రభావమేదో, దానిపై దేశ విదేశాలలో వస్తున్న విమర్శలేమిటో, అందువల్ల తన ప్రతిష్ఠ ఎంత దెబ్బతింటున్నదో తెలియని వ్యక్తి కాదాయన. అయినప్పటికీ అదే ధోరణి కొనసాగిస్తున్నారంటే, పైన పేర్కొన్న వివిధ ప్రయోజనాలే తనకు ముఖ్యమనిపిస్తున్నాయన్న మాట.
ఆ మేరకు ఆయన ఏమేమి మాట్లాడుతూ వస్తున్నారో ఇక్కడ జాబితా రాయనక్కరలేదు. జూన్ 1న జరిగే తుది విడత పోలింగ్‌కు ప్రచారం ముగిసేలోగా ఇంకా ఏమేమి మాట్లాడగలరోనని దేశ ప్రజలు ఊపిరి బిగపట్టి వేచి చూడవలసిందే. ఇప్పటికే బాహాటంగానూ, చాపకింద నీటి వలెనూ వ్యాపించి భారత సమాజాన్ని విషప్రాయం చేస్తున్న మత విద్వేషాల వల్ల, ఎన్నికల తర్వాత కాలంలో ఏమి జరగగలదోనని భయపడుతుండవలసిందే. ప్రపంచ ప్రజాస్వామ్యానికే మాతృక అని మోదీయే సగర్వంగా చాటిన మన దేశం ఆయన హయాంలో ఇప్పటికే ఎన్నికైన నియంతృత్వమనే పేరు తెచ్చుకొని, ప్రపంచ ప్రజాస్వామిక దేశాల ర్యాంకింగ్స్‌లో 105వ స్థానానికి పడిపోయిన స్థితిలో, మునుముందు మరేమి జరగవచ్చునో అని బెంగపడుతుండవలసిందే. ఇందువల్ల దేశం, సమాజం చివరికి మోదీయే మేనేజ్ చేయలేనివిధంగా మారే ప్రమాదం ఉన్నది.
ఇదంతా ఇట్లుండగా మరొకవిధమైన అంచనాలు సాగుతున్నాయి. మోదీకి, ఎన్డీయేకు 400 స్థానాలు కాదు గదా కనీస మెజారిటీ అయిన 272 సీట్లు కూడా వచ్చే అవకాశం లేదని, అది గ్రహించినందువల్లనే తను ఒత్తిడికి గురవుతూ నానాటికి మరింత అసంబద్ధమైన, మరింత తీవ్రమైన, ప్రమాదకరమైన భాష మాట్లాడుతూ పోలరైజేషన్‌ను పెంచజూస్తున్నారని. ఇవి ఎంతవరకు సరైన అంచనాలో చెప్పగల స్థితిలో మనము లేము. కాని మోదీ ధోరణి మహా ఆందోళనకరంగా ఉందన్నది మాత్రం కండ్ల ఎదుట కనిపిస్తున్నది.
టంకశాల అశోక్